డబ్బు, మద్యంతో ఓటర్లకు టీడీపీ ఎర  | Sakshi
Sakshi News home page

డబ్బు, మద్యంతో ఓటర్లకు టీడీపీ ఎర 

Published Mon, Apr 8 2019 10:36 AM

TDP Lure To The Voters With Money And Liquor - Sakshi

సాక్షి, అమరావతి : సార్వత్రికల ఎన్నికల ఘట్టం తుది అంకానికి  చేరింది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు ప్రచారం ముగుస్తోంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అధినేతలు అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. రెండు రోజుల గడువు మాత్రమే ఉండటంతో, నియోజకవర్గాల్లో పూర్తిస్థాయిలో ప్రచారం చేసేందుకు రోడ్‌షోలు నిర్వహిస్తున్నారు.

రాత్రివేళ కుల సంఘాలతో అత్మీయ సమావేశాలు, చోటామోటా నాయకులతో బేరసారాలు కొనసాగిస్తున్నారు. ముందు జాగ్రత్తగా ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో టీడీపీ పార్టీ అభ్యర్థులు డబ్బులు పంపిణీ చేస్తున్నారు. ఎన్నికల్లో ఓటమి ఖాయమని పలు జాతీయ సర్వేలు తేల్చి చెప్పడంతో పాటు, ప్రజల్లో అధికార పార్టీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కానుండటంతో , చివరి ఆస్త్రంగా ఓటర్లలను ప్రలోభాలకు  గురి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

టీడీపీ అభ్యర్థులకు ఎదురుగాలి 
జిల్లాలో గుంటూరు, నరసరావుపేట, బాపట్ల తెలుగుదేశం పార్టీ  ఎంపీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో ఎదురీదుతున్నారు. గుంటూరు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గల్లా జయదేవ్‌కు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ప్రధానంగా ఎంపీగా గెలిచినప్పటి నుంచి మళ్లీ ఎన్నికలు వచ్చే వరకు ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో, ఓట్లు అడిగేందుకు వెళితే పలుచోట్ల సొంత పార్టీ నేతనే నిలదీస్తున్నట్లు సమాచారం.

సామాన్య ప్రజలు ఆయన్ను కలుసుకోవాలంటే ఇప్పటికి కుదరని పరిస్థితి ఉంది. ప్రభుత్వ అధికారిక సమావేశాలకు సైతం హాజరుకాకపోవడం, పార్లమెంటు పరిధిలోని సమస్యల గురించి ఆయన పట్టించుకున్న దాఖలాలు లేవు. ఎన్నికల సమయంలో పరిశ్రమలు ఏర్పాటు చేసి, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్న హామీ నెరవేరలేదు. పదవీ కాలంలో ఆయన వ్యాపారాలు చక్కదిద్దుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చారు.

కనీసం ఎంపీ నిధుల్ని అభివృద్ధి పనులకు ఖర్చు చేయక పోవడంతో , అవి మురిగిపోయే దుస్థితి నెలకొంది. దీంతో ఈసారి ఎన్నికల్లో గెలిచేందుకు కేవలం గల్లా జయదేవ్‌ గల్లా పెట్టేనే నమ్ముకున్నారు. ఓటర్లకు డబ్బులు పంచి మరొసారి మాయ చేయాలని చూస్తున్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి లోకల్‌ కావడం కలిసొచ్చే అంశం. దీనికితోడు మాస్‌ లీడర్‌గా పేరున్న ఆయన తనదైన శైలిలో పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో తిరుగుతూ ఓటర్ల మనస్సు దోచుకుంటున్నారు. గెలుపుపై ధీమాతో ప్రచారంతో దూసుకపోతున్నారు.

రాయపాటికి తప్పని తిప్పలు 

నరసరావుపేట తెలుగుదేశం పార్లమెంటు అభ్యర్థి రాయపాటి సాంబశివరావు ప్రచారంలో వెనకంజలో ఉన్నారు. వయోభారానికి తోడు, అనారోగ్యం నేపథ్యంలో   ప్రచారంలో పాల్గొన లేకపోతున్నారు. అతికష్టం మీద టీడీపీ అధినేతల సభలకు, అక్కడక్కడా నాయకులను మాత్రమే కలుస్తున్నారు. దీనికితోడు నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో స్పీకర్‌ వర్గం రాయపాటికి సహకరించపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.

ఎంపీగా గెలిచినప్పటికీ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేరు. కనీసం నరసరావుపేటలో కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసుకోలేక పోయారు. దీంతో ఆయనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. టిక్కెట్టు చివరి నిమిషంలో ఖరారు కావడంతో , ప్రచారంలో బాగా వెనుకబడి ఉన్నారు. నరసరావుపేట వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలును ఏడు నెలల ముందుగానే పార్టీ సమన్వయకర్తగా ప్రకటించింది.

దీంతో ఆయన ఎన్నికల నోటిఫికేషన్‌ రాకముందే పార్లమెంటు పరిధిలోని అన్ని పట్టణాలు, గ్రామాల్లో తిరిగి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన నవరత్నాలను వివరించటంతో పాటు, ప్రజలకు చేరువయ్యారు. ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేశాక, రెండో సారీ అన్ని పట్టణాలు, పల్లెల్ని  చుట్టేసి, ప్రచారంలో దూసుక పోతున్నారు. యువకుడు, విద్యావేత్త, కష్టపడేతత్వం కల వ్యక్తి అని ప్రజల్లో ముద్ర వేసుకున్నారు. పల్నాడుకు ప్రత్యేకంగా మేనిఫెస్టో ప్రకటించారు. పార్లమెంటు అభివృద్ధికి ప్రత్యేక విజన్‌తో ముందుకు పోతుండటంతో, ప్రజల్లో ఆయనపై నమ్మకం ఏర్పడింది.  

మాల్యాద్రి టిక్కెట్టు పైనే ఊగిసలాట 

బాపట్ల తెలుగుదేశం పార్టీ పార్లమెంటు అభ్యర్థి శ్రీరాం మాల్యాద్రి టిక్కెట్టు చివరి వరకు అధిష్టానం ప్రకటించ లేదు. ఆయన నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేకపోవడం, పదవీ కాలంలో నియోజకవర్గానికి చేసింది లేకపోవడంతో టిక్కెట్టు ఇచ్చే విషయంలోనే టీడీపీ అధిష్టానం అలోచన చేసింది.

తాడికొండ అసెంబ్లీ అభ్యర్థిగా మార్చాలని చూసినా, సిట్టింగ్‌ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌ టిక్కెట్టుపై గట్టి పట్టు పట్టడంతో చివరకు అధిష్టానం, పెద్దల ఆశీస్సులతో టిక్కెట్టు సాధించినా నియోజకవర్గంలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.  బాపట్ల పార్లమెంటు స్థానానికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సామాన్యునికి పట్టం కట్టింది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి నందిగం సురేష్‌ ఇప్పటికే  నియోజక వర్గ పరిధిలో విస్తృతంగా తిరిగి ప్రజలను కలుసుకున్నారు.

యువకుడు, సామాన్యుడుని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అందలం ఎక్కించింది. దీంతో ఓటర్లు నందిగం సురేష్‌ను ప్రత్యేకంగా అక్కున చేర్చుకుంటున్నారు.  ప్రచారంలో సైతం తన దైన శైలిలో దూసుకుపోతున్నారు.మొత్తం మీద వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ అభ్యర్థులు, అసెంబ్లీ అభ్యర్థులు ప్రచారంలో దూసుక పోతుండగా, టీడీపీ అభ్యర్థులు ఎదురీదుతున్నారు. చివరి అస్త్రంగా టీడీపీ అభ్యర్థులు ఓటర్లలను ప్రలోభ పెడుతూ, డబ్బుల పంపకాలకు తెరలేపారు. 

Advertisement
Advertisement