అలా.. మొదలైంది | Sakshi
Sakshi News home page

అలా.. మొదలైంది

Published Sat, May 28 2016 1:33 AM

TDP mahanadu opened in Tirupati

తిరుపతిలో ప్రారంభమైన టీడీపీ మహానాడు
పెద్దఎత్తున తరలి వచ్చిన   పార్టీ శ్రేణులు
ఒకటిన్నర గంటపాటు సీఎం ప్రసంగం
సభ్యత్వ నమోదు, ఫొటో ఎగ్జిబిషన్ ప్రారంభం
ఉక్కపోతతో నాయకులు,  విలేకరులు విలవిల
వార్షిక నివేదికలను  సమర్పించిన ఏపీ, తెలంగాణ ప్రధాన కార్యదర్శులు
తిరుపతి ప్రాశస్త్యాన్ని పదేపదే ప్రస్తావించిన సీఎం

 

తిరుపతిలో శుక్రవారం తెలుగుదేశం పార్టీ మహానాడు సందడిగా ప్రారంభమైంది. ఉదయం 10.30 గంటలకు ప్రాంగణంలోకి ప్రవేశించిన పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పార్టీ జెండాను ఎగురవేసి 35వ మహానాడును ప్రారంభించారు. మూడ్రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి పెద్దఎత్తున నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. ఉదయం 9 గంటలకు పార్టీ శ్రేణులతో ప్రాంగణం సందడిగా మారింది.       



తిరుపతి: రాష్ట్ర విభజన జరిగాక ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ తొలి మహానాడు తిరుపతిలో నిర్వహించడంతో వివిధ జిల్లాల నుంచి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వచ్చాయి. ఉదయం 10.30 - 12 గంటల మధ్య రాహుకాల ఘడియలు ఉండటంతో సీఎం చంద్రబాబునాయుడు ముందుగానే ప్రాంగణంలోకి ప్రవేశించారు. ఈశాన్య భాగాన ఏర్పాటుచేసిన ఎన్టీఆర్ త్రీ ఫొటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన బాబు అక్కడి నుంచి నేరుగా రక్తదాన శిబిరంలోకి ప్రవేశించి రక్తదానం చేస్తున్న పార్టీ కార్యకర్తలను పలకరించారు. ఆ తర్వాత పక్కనే ఉన్న సభ్యత్వ నమోదు విభాగాన్ని పరిశీలించి వేదికపైకి చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల పార్టీ అధ్యక్షులు కళా వెంకటరావు, ఎల్ రమణ, పొలిట్‌బ్యూరో సభ్యులు, నందమూరి బాలకృష్ణలతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏడాది కాలంలో అశువులు బాసిన పార్టీ నేతలకు మహానాడు వేదిక ద్వారా సంతాపం తెలియజేశారు.


ఆహ్వానం పలికిన ఎమ్మెల్యే సుగుణమ్మ..
మహానాడు ప్రాంగణంలో తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ సీఎం చంద్రబాబునాయుడుకు స్వాగతం పలికారు. శ్రీవారి చిత్రపటాన్ని అందించారు. అనంతరం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల పార్టీ ప్రధాన కార్యదర్శులు వర్ల రామయ్య, అమర్‌నాథ్ వార్షిక నివేదికలను  సమర్పించారు. అనంతరం చంద్రబాబునాయుడు పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. తిరుపతికి ఉన్న ప్రాశస్త్యాన్ని వివరించారు. ఎన్టీఆర్ ఇక్కడి నుంచే గెలిచి మహానాడుకు బీజం వేశారన్నారు. భక్తులకు ఇబ్బంది కలుగజేయకుండా ఉండేందుకు టీటీడీ గదులు ఖాళీ చేయాలని కార్యకర్తలకు సూచించారు.

 
భరించలేని ఉక్కపోత..

మహానాడు ప్రధాన ప్రాంగణానికి ఎదురుగా ఉన్న కుర్చీలన్నీ 10 గంటలకే నిండిపోయాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పార్టీ కార్యకర్తలు, నాయకులు ఉక్కపోతతో విలవిల్లాడిపోయారు. మీడియా గ్యాలరీలోని విలేకరుల కోసం ఒక్క కూలర్ కూడా ఏర్పాటు చేయకపోవడంతో వీరి పని కూడా ఇబ్బందికరంగా మారింది.  పర్యవేక్షణ కొరవడిన కారణంగా భోజనాల దగ్గర తొక్కిసలాట చోటుచేసుకుంది. చిత్తూరు ఎంపీ శివప్రసాద్ ఎంతో ఆసక్తిగా సాంస్కృతిక బృందాలను సిద్ధం చేసినప్పటికీ ఆహూతుల నుంచి పెద్దగా స్పందన లభించలేదు. ఒక దశలో ఎంపీ శివప్రసాద్ కూడా తీవ్ర నిరుత్సాహానికి లోనై వేదిక పైనుంచి కిందికి దిగి వెళ్లారు.

 
సందడంతా బాలయ్యదే

మహానాడు ప్రారంభ మయ్యే సమయానికి వేదికపైకి చేరుకున్న సినీహీరో నందమూరి బాలకృష్ణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గౌతమీ పుత్ర శాతకర్ణి గెటప్‌లో వచ్చిన బాలకృష్ణ వేదికకు రెండు వైపులా తిరిగి అభిమానులకు అభివాదం చేశారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్వయంగా పార్టీ పెద్దలందరినీ కలిసి కరచాలనం చే శారు. ఎన్టీఆర్ తనయుడు నందమూరి హరికృష్ణ, వైఎస్‌ఆర్‌సీపీ నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలు మహానాడు వేదికపై కనిపించలేదు. కర్నూలు జిల్లా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఒక్కరే సీఎంకు అభివాదం చేసి కూర్చున్నారు. ఈ సందర్భంగా మహానాడులో 7 ప్రధాన ముసాయిదా తీర్మానాలను పార్టీ అధిష్టానం తీర్మానించింది. తొలి రోజు మహానాడులో పార్టీ రాష్ట్ర నాయకులు, మంత్రులతో పాటు పార్టీ జిల్లా నాయకులు గౌనివారి శ్రీనివాసులు, ఎమ్మెల్యే సుగుణమ్మ, డీకే సత్యప్రభ, ఎంపీ శివ ప్రసాద్, టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, గాలి ముద్దు కృష్ణమనాయుడు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement