కులాల మధ్య టీడీపీ చిచ్చు 

16 Jul, 2019 07:47 IST|Sakshi
సమావేశంలో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు

ఓటమిని జీర్ణించుకోలేక దాడులు 

పండుగను రాజకీయం చేసిన నీచ సంస్కృతి  

విలేకరుల సమావేశంలో కొత్తచెరువు వైఎస్సార్‌ సీపీ నాయకులు 

కొత్తచెరువు: మండలంలోని నాగులకనుమ వద్ద చోటు చేసుకున్న గొడవలకు టీడీపీ నాయకులే కారణమంటూ వైఎస్సార్‌సీపీ నాయకులు పేర్కొన్నారు. రెండు రోజుల క్రితం టీడీపీ నాయకుల చేతిలో గాయపడిన వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు ఫణిశేఖర్, బాలాజీను వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి డి.ఎస్‌.కేశవరెడ్డి సోమవారం పరామర్శించారు. అనంతరం స్థానిక ఆ పార్టీ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కొత్తచెరువులో టీడీపీ నాయకులు రౌడీయిజం చేస్తూ కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని విమర్శించారు. మరోసారి ఇలాంటి చర్యలను సహించేది లేదని హెచ్చరించారు. పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి లోచర్ల విజయభాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ..  దాడిలో గాయపడిన కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. పార్టీలకతీతంగా ప్రజలందరూ కలిసి జరుపుకుంటున్న పండుగను కొందరు స్వార్థపరులు రాజకీయం చేయాలని చూశారన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పార్టీ జెండాలను కట్టి పండుగ సంస్కృతిని మంటగలిపే ప్రయత్నం చేశారన్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో కొత్తచెరువులో వైఎస్సార్‌ సీపీకి ఐదువేల పైచిలుకు మెజారిటీ రావడాన్ని జీర్ణించుకోలేక ఈ తరహా దాడులకు తెగబడడం సిగ్గుచేటన్నారు. రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రజలను భయపెట్టి ఓట్లు దండుకునే నీచ సంస్కృతికి టీడీపీ నేత సాలక్కగారి శ్రీనివాసులు తెరలేపారన్నారు. కులాల మధ్య చిచ్చు పెట్టే విధానాలకు స్వస్తి చెప్పకపోతే ప్రజలే టీడీపీకి బుద్ధి చెబుతారని హెచ్చరించారు. సమావేశంలో వైఎస్సార్‌ సీపీ నాయకులు అంగడి సోమశేఖర్‌రెడ్డి, ఎల్లప్ప, వెంకటరాముడు, బుల్లెట్‌ మధు, నాగభూషణ, లక్ష్మీనారాయణ, షాన్‌షేట్‌ తదితరులు పాల్గొన్నారు.   

>
మరిన్ని వార్తలు