పచ్చమార్కు రాజకీయం! | Sakshi
Sakshi News home page

పచ్చమార్కు రాజకీయం!

Published Sat, Mar 4 2017 2:57 PM

TDP Nominee sathrucharla elected unanimously as MLC

పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ... స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ... ఈ రెండింటికి ఒకేసారి ఎన్నికలు! రెండూ ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సినవే! కానీ అధికార టీడీపీకి మాత్రం రాజకీయ స్వలాభం అనే కోణంలో మాత్రమే చూస్తోంది! ఇందుకోసం తనదైన ‘పచ్చ’మార్కు రాజకీయ ఎత్తుగడలు ప్రయోగించింది. ఉత్తరాంధ్ర పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ సీటును పొత్తు ధర్మంలో భాగంగా బీజేపీ కేటాయించిన టీడీపీ... ఈ బరిలో స్వతంత్య్ర అభ్యర్థులుగా ఉన్న టీడీపీ నాయకులను మాత్రం ఉపసంహరించలేదు. అదే స్థానిక కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో మాత్రం సొంత పార్టీ అభ్యర్థిగా తెరపైకి తెచ్చిన శత్రుచర్ల విజయరామరాజును గట్టెక్కించడానికి నానాఅగచాట్లు పడింది! సొంత పార్టీ రెబెల్‌ అభ్యర్థి తమరాల శోభన్‌బాబును బుజ్జగించి, మరో స్వతంత్య్ర అభ్యర్థి మామిడి శ్రీకాంత్‌ అనుయాయుల మద్యం దుకాణాలపై ముమ్మర దాడులతో బెదిరించి సఫలమైంది. నయానో..భయానో వీరిద్దర్నీ బరి నుంచి తప్పించడంతో చివరకు మిగిలిన శత్రుచర్ల గట్టెక్కారు.

► శత్రుచర్ల ఎన్నిక కోసం స్వతంత్య్ర అభ్యర్థులపై ఒత్తిళ్లు
► శ్రీకాంత్‌ సంబంధీకుల మద్యం దుకాణాలపై దాడులు
► టీడీపీ నాయకుడు శోభన్‌బాబుకు బుజ్జగింపులతో దారికి!
► స్వతంత్య్ర అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ
► స్థానిక సంస్థల’ ఎమ్మెల్సీగా శత్రుచర్ల ఎన్నిక


సాక్షి ప్రతినిధి శ్రీకాకుళం: జిల్లాలో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్‌ కౌన్సిలర్ల సంఖ్యాపరంగా కాస్త బలం ఉన్న టీడీపీలో పలువురు నాయకులు స్థానిక సంస్థల ఎమ్మెల్సీపై ఆశలు పెట్టుకున్నారు. గత సాధారణ ఎన్నికల్లో టిక్కెట్ల కోసం పోటీపడిన కొల్ల అప్పలనాయుడు, కలిశెట్టి అప్పలనాయుడు వంటివారందరికీ దీన్ని చూపించే టీడీపీ అధిష్టానం శాంతింపజేసింది. కాంగ్రెస్‌ నేత పీరుకట్ల విశ్వప్రసాద్‌ పదవీకాలం మరో రెండు నెలల్లో ముగియనున్న నేపథ్యంలో జిల్లాలోని స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారా మోగింది. జిల్లాకు చెందిన టీడీపీ నాయకులు 20 మంది దరఖాస్తు చేసుకున్నారు. సామాజిక సమతౌల్యం పేరుతో ప్రధాన కులాలకు చెందిన నాయకులందర్నీ టీడీపీ నేతలు కదిలించారు. కానీ గతంలో హామీ పొందిన కొల్ల అప్పలనాయుడు, కలిశెట్టి అప్పలనాయుడులతో పాటు మాజీ ఎమ్మెల్యే బగ్గు లక్ష్మణరావు, సింతు సుధాకర్‌ తదితరులంతా ఆఖరి నిమిషం వరకూ సీటు తమదేనంటే తమదేనంటూ ధీమాగా ఉన్నారు. కానీ అందుకు భిన్నంగా మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు పేరును అధిష్టానం తెరపైకి తీసుకొచ్చింది. ఈ విషయంలో జిల్లాకు చెందిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళావెంకటరావుతో పాటు బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు చక్రం తిప్పినట్లు గుసగుసలు వినిపించాయి. గతంలో శత్రుచర్లపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా గెలిచి తర్వాత టీడీపీలోకి ఫిరాయించిన పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణకు, జిల్లా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడికి ఇది రుచించలేదు. అలాగే కొన్నేళ్లుగా హామీలకే పరిమితమైపోతున్న కొల్ల అప్పలనాయుడు రెబెల్‌గా నామినేషన్‌ వేసేందుకు హడావుడి చేశారు. దీంతో కంగారుపడిన ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి పరిటాల సునీతను రంగంలోకి దించారు. స్వయంగా ఫోన్‌లో మాట్లాడించి తనదైన పచ్చమార్కు శైలి రాజకీయంతో కొల్లను మరోసారి ఇంటికే పరిమితం చేయగలిగారు.

స్వతంత్య్ర అభ్యర్థులపై దృష్టి...: టీడీపీ తరఫున శత్రుచర్ల విజయరామరాజుతో పాటు అదే పార్టీకి చెందిన తమరాల శోభన్‌బాబు కూడా స్వతంత్య్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. మరోవైపు మామిడి శ్రీకాంత్‌ కూడా స్వతంత్య్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేయడంతో జిల్లాలో రాజకీయ పరిణామాలు తేడా కొట్టే ప్రమాదం ఉందని టీడీపీ నాయకులు భావించారు. ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా చూస్తామని మాట ఇచ్చి తీసుకొచ్చిన శత్రుచర్ల కూడా స్క్రూటినీ సమయంలో ఉత్కంఠకు గురికావాల్సి వచ్చింది. ఎస్టీ కులధ్రువీకరణ పత్రం కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను మామిడి శ్రీకాంత్‌ ప్రస్తావించడంతో న్యాయపరమైన వివాదాలు చుట్టుముట్టే ప్రమాదాన్ని టీడీపీ నాయకులు ఊహించారు. అంతేగాకుండా ఇచ్చిన మాట ప్రకారం శత్రుచర్ల ఎన్నిక ఏకగ్రీవం కావాలంటే స్వతంత్య్ర అభ్యర్థులిద్దరూ బరి నుంచి తప్పుకోవాలి. ఈ పని కోసం టీడీపీ నాయకులు అన్ని రకాల ప్రయోగాలు చేశారు.

మద్యం దుకాణాలపై దాడులా?: ఎమ్మార్పీ కన్నా అధిక ధరలకు మద్యం విక్రయం జిల్లాలో మందుబాబులకు కొత్తకాదు! ఈ మద్యం సిండికేట్‌ టీడీపీ నాయకుల కనుసన్నల్లోనే నడుస్తుండటంతో ఎక్సైజ్‌ అధికారులు కూడా అటువైపు దృష్టి పెట్టలేదు. అనేక ఆరోపణలు వచ్చినా నిమ్మకు నీరెత్తినట్లే వ్యవహరించారు. కానీ గురువారం రాత్రి మాత్రం రాజాం, పాలకొండ, వీరఘట్టం, రేగిడి ప్రాంతంలో మూకుమ్మడి తనిఖీలకు దిగారు. 40 దుకాణాలను క్షుణ్నంగా పరిశీలించారు. ఆరు దుకాణాల్లో ఎమ్మార్పీ కన్నా అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారనే నెపంతో వాటిని సీజ్‌ చేశారు. సిబ్బందిని పోలీసుస్టేషన్లకు తరలించి భయాందోళనలు సృష్టించారు. విశేషమేమిటంటే ఆ దుకాణాలన్నీ మామిడి శ్రీకాంత్, ఆయన బంధువులు, సన్నిహితులు భాగస్వామిగా ఉన్నవే. శుక్రవారం కూడా ఆయన వ్యాపారాలపై ముప్పేట దాడులకు అధికార యంత్రాంగాన్ని టీడీపీ నాయకులు మోహరించారు. ఈ దాడులు, తనిఖీలు మాటెలా ఉన్నా ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఎన్నికలలో ప్రత్యర్థులపై అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న టీడీపీ ప్రభుత్వ తీరుకు నిరసనగా శ్రీకాంత్‌ తన నామినేషన్లు ఉపసంహరించుకున్నారు.

పట్టభద్రుల ఎన్నికల్లో భిన్న వైఖరి...: స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి శత్రుచర్లను గట్టెక్కించడానికి అప్రజాస్వామిక విధానాలను అమలు చేసిన నాయకులు... పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో ఉమ్మడి అభ్యర్థిగా బరిలోనున్న బీజేపీ నాయకుడు పీవీఎన్‌ మాధవ్‌ విషయంలో మాత్రం అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. దీనికి కారణం స్వతంత్య్ర అభ్యర్థిగా రంగంలోనున్న ఆమదాలవలస పట్టణ తెలుగుయువత అధ్యక్షుడు చింతాడ రవికుమార్‌కు తెరవెనుక టీడీపీ నాయకులు మద్దతు ఇవ్వటమేనన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయాన్ని పసిగట్టే శుక్రవారం సాయంత్రం శ్రీకాకుళంలో జరిగిన శత్రుచర్ల అభినందన సభలో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కామినేని తనదైన శైలిలో టీడీపీ నాయకులకు చురకలు అంటించారు. మాధవ్‌ గెలిచినా, ఓడినా టీడీపీ బాధ్యతేనంటూ వ్యాఖ్యానించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఇద్దరు స్వతంత్య్ర అభ్యర్థులను దారిలోకి తెచ్చుకొని శత్రుచర్లను స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గట్టెక్కించిన టీడీపీ నాయకులు... వైఎస్సార్‌సీపీ మద్దతు ప్రకటించిన పీడీఎఫ్‌ అభ్యర్థి అజశర్మ, కాంగ్రెస్‌ అభ్యర్థి యడ్ల ఆదిరాజు వంటి బలమైన ప్రత్యర్థులతో పాటు మరో 34 మందిని పక్కనబెట్టి మాధవ్‌ను ఎలా గెలిపిస్తారనేదీ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది! ఒకవేళ మాధవ్‌కు పరాజయమే ఎదురైతే... టీడీపీ నాయకుల పచ్చమార్కు రాజకీయానికి మరో మచ్చుతునకగా మిగిలిపోవడం ఖాయం!.

Advertisement
Advertisement