అందని ద్రాక్షే.. | Sakshi
Sakshi News home page

అందని ద్రాక్షే..

Published Tue, Nov 25 2014 12:00 AM

అందని ద్రాక్షే.. - Sakshi

 సాక్షి, రాజమండ్రి : కొత్త రేషన్ కార్డులు ఇచ్చే అంశంపై ప్రభుత్వం ఇప్పట్లో ఎటువంటి నిర్ణయమూ తీసుకునే సూచనలు కనిపించడం లేదు. తెలుగుదేశం ప్రభుత్వం ఇటీవల ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జన్మభూమి సభల్లో రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఇప్పటికే ఉన్నవాటిని ఎలా తగ్గించాలా అని చూస్తున్న ప్రభుత్వం, కొత్త కార్డుల జారీపై ఏ నిర్ణయమూ తీసుకునే పరిస్థితి ఉండదని తెలుస్తోంది. జన్మభూమి గ్రామసభల్లో రేషన్ కార్డుల కోసం 1.06 లక్షల దరఖాస్తులు వచ్చాయి. అంతకుముందు నేరుగా వచ్చిన మరో 25 వేల వరకూ దరఖాస్తులు రెవెన్యూ కార్యాలయాల్లో మగ్గుతున్నాయి. ఇలా జిల్లావ్యాప్తంగా మొత్తం 1.31 లక్షల మంది కార్డుల కోసం నిరీక్షిస్తున్నారు. ఇటీవల పౌరసరఫరాల శాఖ కమిషనర్ బి.రాజశేఖర్ కొత్త కార్డుల మాట ఇప్పట్లో లేదని స్పష్టం చేశారు.
 
 అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జారీ చేసిన తెల్ల కార్డులను తగ్గించేందుకు ప్రస్తుత ప్రభుత్వం సర్వేలు, తనిఖీలు చేపడుతోంది. జిల్లాలో సుమారు 15 లక్షల కార్డులుండగా వివిధ కారణాల తో వాటిలో ఇప్పటికే సుమారు 60 వేలు తొలగించారు. అలాగే సుమారు లక్ష కార్డులకు సరిపోయేలా ఆరు లక్షల మంది రేషన్ నిలిపివేశారు. ఉన్న కార్డులు తీసేయడం తప్ప ఒక్క కొత్త కార్డు కూడా ఇచ్చేది లేదని అధికారులు చెబుతున్నారు. మరోపక్క గత ప్రభుత్వం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో కార్డుల కోసం వచ్చిన సుమారు 50 వేలు పైగా దరఖాస్తులు అధికారుల వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. వీటి మాటేమిటని అడిగితే, మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిందేనని అధికారులు చెబుతున్నారు.
 

Advertisement
Advertisement