టీడీపీలో టిక్కెట్ల లొల్లి! | Sakshi
Sakshi News home page

టీడీపీలో టిక్కెట్ల లొల్లి!

Published Fri, Feb 28 2014 3:52 AM

TDP sets of tickets!

సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే టీడీపీలో టిక్కెట్ల పంచాయితీ మొదలైంది. ఆ పార్టీ నాయకుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. బహిరంగంగా విమర్శించుకోకపోయినా కార్యకర్తల వద్ద..తమ అనుయాయుల వద్ద అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. ఇలాగైతే పార్టీ గట్టెక్కడం కష్టమని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో తీవ్రంగా దెబ్బతిన్నపార్టీని తిరిగి బతికించుకోవాలంటే సమర్థులైన నాయకులకు టిక్కెట్లు ఇవ్వాలని కార్యకర్తలు కోరుతున్నారు.
 
 అయితే కర్నూలు జిల్లాలో పరిస్థితి వేరో విధంగా ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఇమడ లేక తాజా మాజీ మంత్రులు టీజీ వెంకటేష్, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, లబ్బి వెంకటస్వామి, నీరజారెడ్డిలు పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరితే రాజకీయ భవిష్యత్‌కు ఢోకా ఉండదని భావించారు. అయితే రాష్ట్ర విభజన పాపంలో పాలు పంచుకున్న వీరిని పార్టీలో చేర్చుకునేది లేదని వైఎస్సార్సీపీ చెప్పేసింది. దీంతో వేరే దారిలేక.. కాంగ్రెస్‌లో ఉండలేక.. టీడీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. అనుకున్న వెంటనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడితో మంతనాలు నెరపటం.. పార్టీలో చేరిపోయేందుకు పచ్చజెండా ఊపడం జరిగిపోయాయి.  
 
 ఇవీ తలనొప్పులు
 పాణ్యం నుంచి బరిలో దిగేందుకు  ఏరాసు ప్రతాప్‌రెడ్డి,  కాటసాని రాంభూపాల్‌రెడ్డి పోటీ పడుతున్నారు. టీడీపీ అధినేత ఇప్పటికే ప్రముఖ రియల్టర్ కేజే రెడ్డికి పాణ్యం నుంచి పోటీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అందులో భాగంగా కేజే రెడ్డి ప్రచారం కూడా చేస్తున్నారు.
 - తనకే టిక్కెట్ వస్తుందని శ్రీశైలం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ శిల్పా చక్రపాణిరెడ్డి భావిస్తున్నారు.  సిట్టింగ్ ఎమ్మెల్యే ఏరాసు ప్రతాప్‌రెడ్డిని టీడీపీలోకి వస్తే తన బలం పెరుగుతుందని ఆశిస్తున్నారు.
 
 కాటసాని రాంభూపాల్‌రెడ్డికి వస్తే బనగానపల్లెలో ఆయన ఓటు బ్యాంకును రాబట్టుకోవచ్చని ఆ నియోజకవర్గ ఇన్‌చార్జ్ బీసీ జనార్దన్ రెడ్డి భావిస్తున్నారు. అందులో భాగంగానే ఓ వైపు శిల్పా చక్రపాణిరెడ్డి, మరో వైపు బీసీ జనార్థన్‌రెడ్డి పాణ్యం టికెట్ తమకు అనుకూలంగా ఉన్న వారికే ఇప్పించేందుకు అధినేత చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే ఏరాసుకు డోన్ టికెట్ ఇప్పిస్తే పెద్ద భారం తొలగిపోతుందని కేఈ సోదరు భావిస్తున్నట్లు తెలిసింది. అదే జరిగితే తాను అనుకున్న స్థానం నుంచి పోటీకి మార్గం సుగమం అవుతుందని కేఈ సోదరులు భావిస్తున్నట్లు ఆయన వర్గీయులు వెళ్లడించారు.
 
 నీరజకు నో చెప్పిన బాబు?
 ఆలూరు ఎమ్మెల్యే నీరజారెడ్డికి టీడీపీలో చుక్కెదురైనట్లు సమాచారం. అనేక విమర్శలు ఎదుర్కొంటున్న నీరజారెడ్డిని పార్టీలో చేర్చుకునేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నో చెప్పినట్లు తెలిసింది. అయితే నీరజారెడ్డి నంద్యాలకు చెందిన టీడీపీ నేత ఎన్‌హెచ్ భాస్కర్‌రెడ్డి ద్వారా బాబుపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది.
 

Advertisement
Advertisement