పరిశ్రమల పేరుతో భూ దోపిడీ | Sakshi
Sakshi News home page

పరిశ్రమల పేరుతో భూ దోపిడీ

Published Sat, Feb 20 2016 3:47 AM

పరిశ్రమల పేరుతో భూ దోపిడీ - Sakshi

గూడూరు(చిల్లకూరు): జిల్లాలో పరిశ్రమల పేరుతో భూ దోపిడీ జరుగుతోందని ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమా ర్ దుయ్యబట్టారు. స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహం లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో పలు పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటనలకే పరిమితమవుతోందన్నారు. గతంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఉన్న పరిశ్రమలే ఇప్పుడు కూడా ఉన్నాయని, కొత్త పరిశ్రమ ఒక్కటి రాకపోయినా వేల ఎకరాల పేదల భూములను దోపిడీ చేసేందుకు సిద్ధం కావడం సబబుకాదన్నారు. ఇటీవల కోస్టల్ కారిడర్ పేరుతో వేల ఎకరాలను బ్లాకులుగా గుర్తించడం చూస్తుంటే పెద్దలకు భూములు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోందన్నారు. ఇప్పటికే క్రిష్ణపట్నం పోర్టు అధీనంలో 18 వేల ఎకరాలు ఉన్నాయని వాటిలో ఎలాంటి పరిశ్రమలు ఏర్పాటు కాకుండా అవి నిరుపయోగంగా ఉన్నాయన్నారు.

అలాగే చిల్లకూరు మండలంలో కెనేటా పరిశ్రమకు కేటాయించిన భూములను జిందాల్ కంపెనీ రూ.300 కోట్లకు కొనుగోలు చేసిందని అమ్మడానికి వారెవరు, కొనడానికి వీరు ఎవరని ఆయన ప్రశ్నించారు. చింతవరం కొత్తపట్నం ప్రాంతంలో 750 ఎకరాలు మల్టీపర్పస్ సెజ్‌కు కేటాయిస్తే మాస్ అపెరల్ పార్కును ఐదెకరాల్లో మాత్రమే నిర్మించారన్నారు. పరిశ్రమల పేరుతో భూములు సేకరించే సమయంలో ఖచ్చితంగా పరిశ్రమలను ఏ సమయానికి ఏర్పాటు చేస్తారు..ఎంత మందికి ఉపాధి అవకావాలు కల్పిస్తారో వెల్లడించాలన్నారు. నియోజకవర్గంలో పెద్దల చేతుల్లోని భూములు వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పేదలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో కోట ఎంపీపీ నల్లపరెడ్డి వినోద్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు నాశిన నాగులు, పిట్టు నాగరాజు, శివకుమార్, బిమ్మిరెడ్డి మధురెడ్డి, రాజారెడ్డి, మోహిద్దీన్ పాల్గొన్నారు.

Advertisement
Advertisement