బీమిలి నియోజకవర్గంలో టీడీపీ కోటకు బీటలు! | Sakshi
Sakshi News home page

బీమిలి నియోజకవర్గంలో టీడీపీ కోటకు బీటలు!

Published Wed, Mar 13 2019 1:08 PM

Tdp Tough Competition  In  Bhimiili Constituency - Sakshi

సాక్షి, తగరపువలస: భీమిలి... రాష్ట్రంలో పరిచయం అక్కర్లేని అసెంబ్లీ నియోజకవర్గం. మొదటి నుంచి రాజవంశీయులను పార్టీలకతీతంగా అసెంబ్లీకి పంపించిన ఘనత సొంతం చేసుకున్న ప్రాంతం. 1980 దశకంలో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీకి కంచుకోటగా మారిన నియోజకవర్గం. మధ్యలో కాంగ్రెస్, పీఆర్పీ అభ్యర్థులు విజయం సాధించినా 2014 ఎన్నికల్లో మరలా ఈ నియోజకవర్గం టీడీపీ ఖాతాలోకి వెళ్లింది.

ఈ ఐదేళ్లలో ఆ పార్టీ నాయకులు చేసిన అక్రమాలు.. గత ఎన్నికల్లో ఇచ్ని హామీలు ఒక్కటి కూడా నెరవేర్చక పోవడంతో నియోజకవర్గంలో టీడీపీ గ్రాఫ్‌ పడిపోయింది. ఇక్కడ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ బలీయమైన శక్తిగా ఎదిగింది. వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భీమిలి నియోజకవర్గంలో సుమారు 12 రోజుల పాటు జరిపిన పాదయాత్ర ఈ ప్రాంత ప్రజలపై తీవ్ర ప్రభావం చూపించింది.  వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో నూతన ఉత్తేజం నింపింది.

పడిపోయిన టీడీపీ గ్రాఫ్‌
2014 ఎన్నికల్లో భీమిలి నుంచి గెలిచి మంత్రి అయిన గంటా శ్రీనివాసరావు స్థానికులకు అందుబాటులో లేరు. నెలకోసారి అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చి తన ప్రతినిధులతో నడిపించారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన ఆర్‌.ఎస్‌.డి.పి.అప్పలనరసింహరాజు వంటి సీనియర్లకు కూడా సరైన గుర్తింపు లభించలేదు.

అంతే కాకుండా బి.ఫామ్‌ పొందిన గంటా శ్రీనివాసరావు తొలుత ఆర్‌.ఎస్‌.డి.పి.అప్పలనరసింహరాజు ఇంటికి వెళ్లి తనను ఆశీర్వదిస్తే చిట్టివలస జూట్‌మిల్లు సమస్య, తగరపువలసలో ఆర్టీసీ కాంప్లెక్స్, పాండ్రంగి గోస్తనీనదిపై వంతెన, పద్మనాభస్వామి కొండకు ఘాట్‌రోడ్డు వంటి దీర్ఘకాల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి మాట తప్పారు.  పరుచూరి భాస్కరరావు హయాంలో భూ కుంభకోణాలు, మధ్యాహ్న భోజన పథకం ప్రైవేట్‌ ఏజెన్సీలకు అప్పగింత, ప్రభుత్వ, ప్రయివేట్‌ ఉద్యోగాలలో అవినీతి, హుద్‌హుద్‌ సమయంలో మంత్రి ఇంటి నుంచి బయటకు రాకపోవడం అన్నీ కలిపి ఇక్కడ టీడీపీ గ్రాఫ్‌ను పడేశాయి.

అభ్యర్థికోసం టీడీపీ వెతుకులాట
ఇప్పటికే పలుమార్లు చంద్రబాబు భీమిలిలో సర్వే చేయించినప్పుడు ఇక్కడ టీడీపీకి నూకలు చెల్లిపోయినట్టు గుర్తించారు. దీనికితోడు ఎన్నికల ముందు పార్టీ కార్యకర్తలు, నాయకులు వైఎస్సార్‌సీపీలోకి జారిపోతుండటంతో మైండ్‌ గేమ్‌ ఆడుతున్నట్టు తెలుస్తోంది. మంత్రులు నారా లోకేష్, గంటా శ్రీనివాసరావు పేర్లతో పాటు తాజాగా అశోక్‌గజపతిరాజు కుమార్తె అతిది పేరు తెరమీదకు తేవడం ఆ పార్టీ దీనస్థితికి అద్దం పడుతోంది. 

కాంగ్రెస్‌ డీలా
భీమిలి నియోజకవర్గంలో కాంగ్రెస్‌ శ్రేణులు డీలా పడ్డారు.రాష్ట్ర విభజన దెబ్బ నుంచి ఆ పార్టీ నాయకులు కోలుకోలేదు.  నియోజకవర్గంలో కాంగ్రెస్‌ ప్రభావం పెద్దగా ఉండదనే చెప్పాలి. జనసేన పరిస్థితి కూడా అంతే.

ముత్తంశెట్టి రాకతో మరింత జోష్‌
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర సమయంలో భీమిలి సమన్వయకర్తగా ఉన్న అక్కరమాని విజయనిర్మల పార్టీ బలోపేతానికి కృషి చేశారు. ఇటీవల మారిన  సమీకరణాల కారణంగా భీమిలి ప్రజలతో గతంలో పరిచయాలు ఉన్న అవంతి విద్యాసంస్థల అధినేత ముత్తంశెట్టి శ్రీనివాసరావు టీడీపీకి, లోక్‌సభకు రాజీనామా చేసి వైఎస్సార్‌సీపీలో చేరడంతో ఆయనను భీమిలి సమన్వయకర్తగా నియమించారు.

ఆయన రాకతో భీమిలిలో వైఎస్సార్‌సీపీకి మరింత బలం చేకూరినట్టయింది. టీడీపీ కాంగ్రెస్‌లకు చెందిన వారేకాకుండా, తటస్థులు కూడా వైఎస్సార్‌సీపీకి దగ్గరవుతున్నారు. దీంతో చంద్రబాబు మదిలో కలవరం మొదలయి భీమిలిలో ముత్తంశెట్టిని ఢీ కొట్టే శక్తి కోసం ఎదురు చూస్తున్నారు. ఏదిఏమైనప్పటికీ భీమిలిలో వైఎస్సార్‌సీపీ గెలుపు నల్లేరుపై నడకలాంటిదని టీడీపీ నాయకులే అంగీకరిస్తున్నారు. 

Advertisement
Advertisement