ఎలా బతకాలి బాబూ..! | Sakshi
Sakshi News home page

ఎలా బతకాలి బాబూ..!

Published Mon, Feb 9 2015 6:34 AM

ఎలా బతకాలి  బాబూ..! - Sakshi

 పేరుకు ప్రభుత్వ ఉద్యోగం. నెలాఖరుకు అప్పు చేస్తే గానీ ఇల్లు గడవని స్థితి. నెలకు ఇరవై వేల రూపాయల జీతం. ముప్పయ్యో తారీఖుకు చేతిలో చిల్లి గవ్వ ఉండదు. పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి, పిల్లల స్కూల్ ఫీజులు పెరుగుతున్నాయి రవాణా చార్జీలు పెరుగుతున్నాయి, కేబుల్ చార్జీలు పెరుగుతున్నాయి, ఆఖరుకు దుస్తులు ఇస్త్రీ చేసే రేట్లు కూడా పెరుగుతున్నాయి. కానీ జీతం మాత్రం పెరగడం లేదు. పీఆర్సీ అమలుపై ఉద్యోగులు కోటి కళ్లతో ఎదురుచూస్తుంటే, సీఎం చంద్రబాబు మాత్రం ఆ ఆశలపై నీళ్లు చల్లే పనిలో ఉన్నారు.
 
 విజయనగరం కంటోన్మెంట్:  విజయనగరంలో నివాసం ఉంటున్న రాజారావు ఓ ప్రభుత్వ కార్యాలయంలో అటెండర్‌గా పని చేస్తున్నారు. భార్య, ఇద్దరు పిల్లలు, తల్లిదండ్రులతో కలిసి ఓ అద్దె ఇంటిలో ఉంటున్నాడు. రాజారావుకు నెలకు రూ.22వేలు జీతం వస్తుంది. ఇంటి అద్దె రూ.4వేలు కట్టాలి. గ్యాస్ సిలెండర్, పాలతో సహా ఇతర నిత్యావసరాలన్నింటికి కలిపి 12వేల రూపాయలు ఖర్చవుతోంది. కరెంటు బిల్లు, కేబుల్ కనెక్షన్ కలిపి రూ.1000 అవుతుంది. ఇద్దరు పిల్లలకు ట్యూషన్, స్కూల్‌ఫీజులతో పాటు స్టేషనరీ ఖర్చులు రూ.4000 వరకు అవుతాయి. ఇంటిలో ఒక సెల్, రాజారావు వద్ద ఒక సెల్ ఉంది. వీటికి  నెలకు రూ.600 వరకు ధారబోయాల్సిందే. ఇక వైద్య ఖర్చుల కోసం కనీసం రూ.రెండు వేలైనా పెట్టాలి. అత్యవసర ఖర్చులు వీటికి అద నం. సినిమాలు, షికార్ల ఆలోచన చేయడమే వీరికి తప్పు. అలా చేస్తే మరో వెయ్యి క్షవరం కావడం ఖాయం. ఎంత పొదుపుగా ఉన్నా రాజారావు ప్రతి నెలా ఓ రూ.రెండు వేలు అప్పు చేయాల్సి వస్తోంది. చేసేది ప్రభుత్వ ఉద్యోగమైనా పెరుగుతున్న ధరలు రాజారావుకు కునుకు పట్టనీయడం లేదు.  
 
 రాజారావు మాత్రమే కాదు ఇంకా ఎందరో ప్రభుత్వ ఉద్యోగులు చాలా ఏళ్లుగా పడుతున్న బాధలివి. పదో వేతన స్థిరీకరణ కోసం వేలాది మంది ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. టెన్త్ పే రివిజన్ కమిషన్ సిఫార్సులు చేసి నెలలు గడుస్తున్నా ఇప్పటికే దీనిపై స్పష్టమైన ప్రకటననివ్వలేదు. ఎన్నికల ముందు ప్రకటన చేస్తారని ఎదురు చూసిన ఉద్యోగులకు తీవ్ర నిరాశే ఎదురైంది. జిల్లాలోని పలు శాఖల్లో 26 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో మధ్య తరగతికి చెందిన ఉద్యోగులు పీఆర్సీ నివేదిక ఇచ్చినప్పటినుంచి ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ ముఖ్యమం త్రి చంద్రబాబు నాయుడు తీరు వారికి నిరాశే మిగుల్చుతోంది. పని తీరు బాగాలేదన్నట్టుగా వ్యాఖ్యలు చేయడమే కాకుండా ఆదాయం తీసుకువస్తేనే జీతాలు పెంచుతామన్నట్లు మాట్లాడడంపై ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఫిట్‌మెంట్‌ను తెలంగాణలో 43 శాతానికి ఖరారు చేశారు. కానీ ఇక్కడి ఉద్యోగులకు మాత్రం ఆ భాగ్యం దక్కలేదు.
 
 ఈ వర్గాన్నీ దూరం చేసుకుంటారా..?
 ప్రస్తుతం తెలుగుదేశం ప్రభుత్వానికి చంద్రబాబు వాగ్దానాల పుణ్యమాని దాదాపు అన్ని వర్గాలూ దూరమయ్యాయి. కొత్త ప్రభుత్వాన్ని ప్రతి ఒక్క రూ విమర్శిస్తున్నారు. అసంబద్ధ రుణమాఫీ చర్యలతో రైతు వర్గాలు దూరమయ్యాయి. అలాగే డ్వాక్రా మహిళల రుణమాఫీ మాట దేవుడెరుగు, వారికి బ్యాంకర్లు దూరమయ్యేందుకు అధిక వడ్డీలు చెల్లించాల్సి వచ్చేందుకు కారణమైన చంద్రబాబును అంతా దుమ్మెత్తిపోస్తున్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాల్లేక, ఉన్న ఉద్యోగాలు వివిధ దశల్లో తొల గించి ప్రకటించిన నిరుద్యోగ భృతిని కూడా పక్కన పెట్టేయడంతో నిరుద్యోగులు, యువత కూడా దూరమయ్యారు. ఇప్పుడు చంద్రబాబు అసందర్భ ఆలోచనలూ, హంగామా పర్యటనలు, ప్రతిపాదనలు, ప్రణాళికలకు దగ్గరుండి సహక రిస్తున్నది ఉద్యోగ వర్గాలే. వారిని కూడా పీఆర్సీ అమలు జాప్యం చేయడమే కాకుండా అవమానకర వ్యాఖ్యలతో దూరం చేసుకునే పరిస్థితులు నెలకొన్నాయని పలువురు ఉద్యోగులు బహిరంగంగానే  వ్యాఖ్యానిస్తున్నారు.
 
 ప్రకటించక  ముందే...
 ఇప్పటికే పీఆర్సీ నివేదిక ప్రభుత్వం దగ్గరుంది. అది అమలు చేయలేదు సరికదా... పాత ధరలతో ఉన్న ఆ నివేదికను ఆమోదించకముందే ప్రభుత్వం ఎడాపెడా చార్జీలు, ధరలు పెంచుతోంది. దీని ప్రభావంతో పీఆర్సీ ప్రకటించినా సుఖం లేదనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. ఇటీవల వి ద్యుత్ చార్జీలు, పెట్రోల్‌పై వ్యాట్ టాక్స్, ఇతర వినిమయ చార్జీలను పెంచిన ప్రభుత్వం కొత్త పీఆర్సీకి సరిపడా ముందుగానే దండుకుంటున్నదని అర్థమవుతోంది.
 
 మరోవైపు ఖాళీగా ఉన్న పోస్టులను నింపకుండానే నిత్యం సమీక్షలు, సమావేశాలతో ఉద్యోగులను ఊదరగొడుతున్నప్పటికీ పీఆర్సీ గురించి కనీసం పట్టించుకోవడం లేదని ఉద్యోగ సంఘాలు గోల పెడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 31,000 మంది డ్రాయింగ్ ఆఫీసర్లను 3,600 మందికి తగ్గించేందుకు ఆన్‌లైన్ వ్యవస్థను పెట్టారనీ, దీని వల్ల మరింత పనిభారం పెరుగుతుందే తప్ప ఉద్యోగులకు ఎలాంటి ప్రయోజనాలూ ఉండవని చెబుతున్నారు. సింగపూర్ పర్యటన, ఉచిత సంక్రాంతి కానుకలు, ప్రణాళికలు, కొత్త వాహనాలు, సొంత కార్యాలయాల నిర్మాణాలకు కోట్లు ఖర్చు చేస్తున్న చంద్రబాబుకు ఉద్యోగుల పీఆర్సీ ఇస్తేనే బడ్జెట్ గుర్తొస్తుందానని విమర్శించే ఉద్యోగులు ఇక కార్యరంగంలోకి దూకేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.
 
 కుటుంబమంటే ముగ్గురేనా..?
 వాస్తవానికి కుటుంబమంటే తల్లితండ్రి, ఇద్దరు పిల్లలు, భార్యాభర్తలు. అంటే ఆరుగురు సభ్యులున్న కుటుంబానికి కనీసం ఇద్దరు లేకపోయినా నలుగురు కుటుంబ సభ్యులయినైనా లెక్కించాలని ఉద్యోగులు అంటున్నారు. పీఆర్సీ నూతన వేతన స్థిరీకరణ చేసేటప్పుడు కుటుంబాన్ని ప్రాతిపదికగా తీసుకున్నది కేవలం ముగ్గురు సభ్యలతోనేననీ, ఇది సరికాదని వారంటున్నారు. ఇద్దరు భార్యాభర్తలతో పాటు ఇద్దరు పిల్లలను ఒక యూనిట్‌గా పరిగణించారనీ దీనిని సహించబోమనీ చెబుతున్నారు. ఇద్దరు పిల్లలను ఒక యూనిట్‌గా ఎలా తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు.
 
 1960 కాలం నాటి హోల్‌సేల్ లెక్కలా ?
 ఏపీ ప్రభుత్వం నియమించిన పీఆర్సీ కమిషన్ లోపభూయిష్టంగా నివేదిక ఇచ్చినా దాన్ని కూడా అమలు పర్చడానికి ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని ఉద్యోగులు చెబుతున్నారు. పీఆర్సీ నివేదికను 1960-70 కాలాల నాటి కమొడిటీస్(అవసరాలు) ఆధారంగా లెక్కిం చారని అంటున్నారు. అప్పట్లో సెల్ ఫోన్లు కానీ, టీవీలు కానీ, కంప్యూటర్లు కానీ, మంచి వైద్య సేవలు కానీ, మోటారు వాహనాలు, ఇం టర్నెట్‌లు కానీ లేవని, కానీ ఈ ఖర్చులు ఇప్పుడు అదనంగా వచ్చాయని ఉద్యోగులు చెబుతున్నారు. ధరలు కూడా హోల్‌సేల్‌గా నిర్ణయించి నివేదికలో పొందుపర్చడంపై వారు మండిపడుతున్నారు.
 
  ఉద్యమం చేస్తాం
 కమిటీ నివేదించిన పీఆర్సీ నివేదికకు ప్రభుత్వం వ్యతిరేకంగా ప్రకటనలు జారీ చేస్తే ఉద్యమాలకు సిద్ధమవుతాం. మాకూ ఉద్యమ చరిత్ర ఉంది.  డీఏ కలుపుతామనీ మాటిచ్చారు. ఇంకా చాలా హామీలు గుప్పించారు. వాటన్నిటినీ ప్రభుత్వం నెరవేర్చాలి. ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూసే తరుణమిది. ప్రకటన వచ్చాక ప్రభుత్వానికి సహకరించడమో ఉద్యమాలకు వెళ్లడమో తేలిపోతుంది.    
  - బీహెచ్‌ఆర్‌ఎస్ ప్రభూజీ,
 జిల్లా అధ్యక్షుడు , ఏపీఎన్జీఓ సంఘం,
 విజయనగరం
 
 ప్రతిపాదనలు, ప్రకటనలకు

 రూ.కోట్లలో ఖర్చా?
 ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన వాగ్దానాలను అమలు పరచాలి. ఉద్యోగుల విషయంలో ఇచ్చిన మాట ని లబెట్టుకోవాలి. సింగపూర్ తదితర విదేశీ పర్యటనలు చేస్తూ ఇక్కడి ఉద్యోగులను విస్మరించడం బాధాకరం. పీఆర్సీ నివేదికను వెంటనే అమలు పర్చాలి. అధిక సమయం పనిచేస్తున్నాం కనుక మాకు ఎక్కువ ఫిట్‌మెంట్ ఇవ్వాలి. ఇప్పటికే పలు శాఖలను విలీనం చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులపై పనిభారం ఎక్కువ వేస్తున్నారు. దీనిపై మరోసారి పునరాలోచించుకోవాలి.        
 - పీవీ పద్మనాభం, సంయక్త కార్యదర్శి,
 ఏపీఎన్జీఓల సంఘం, విజయనగరం
 
 విస్మరించరాదు
 ప్రభుత్వ ఆలోచనను ప్రజల్లోకి తీసుకు వెళ్లడమే ఉద్యోగుల ప్రధాన విధి. అలాంటి కీలకమైన వారిని ప్రభుత్వం విస్మరించకూడదు. ప్రస్తుతం పీఆర్సీని ఎందుకు అట్టిపెడుతున్నారో అర్థం కావడం లేదు. అంతకు ముందు ఆర్థిక పరిస్థితులు బాగుండే ఇచ్చారా? ఉద్యోగుల ఆర్థిక పరిస్థితి బాగుంటేనే మరింత బాగా పనిచేయగలుగుతారని అర్థం చేసుకోవాలి.                    
   - కె. సురేష్‌కుమార్,
 ఎన్జీఓ విజయనగరం పట్టణ అధ్యక్షుడు
 
 ఇచ్చేటట్టు కనిపించడం లేదు
 చంద్రబాబు పీఆర్సీ ప్రకటన అంతా లాబీయింగ్‌లకు మాత్రమే. ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అయితే ఇటీవల కేసీఆర్ తెలంగాణలో పీఆర్సీ ప్రకటించడంతో కాస్త ముం దుకు వచ్చారంతే. అంత తొందరగా పీఆర్సీ కమిషన్ ఆమోదం చేస్తారని ఉద్యోగుల్లో నమ్మకం కుదరడం లేదు.  దీనిపై ప్రభుత్వమే మరోసారి బాగా ఆలోచించాలి.
 - పొట్నూరు భాస్కరరావు, ఉపాధ్యక్షుడు,  
 ఏపీటీఎఫ్, విజయనగరం మండలం
 

Advertisement
Advertisement