దారి తప్పిన గురువుకు దేహశుద్ధి | Sakshi
Sakshi News home page

దారి తప్పిన గురువుకు దేహశుద్ధి

Published Mon, Apr 3 2017 3:25 PM

దారి తప్పిన గురువుకు దేహశుద్ధి

శ్రీకాకుళం(నరసన్నపేట):
విద్యార్థినులను సొంతబిడ్డల్లా చూసుకోవాల్సిన ఉపాధ్యాయుడు దారి తప్పాడు. సెల్‌ఫోన్లలో అసభ్యకర సందేశాలు పంపుతూ ఆడపిల్లలను వేధించసాగాడు. గురువే కదాని తొలుత వారంతా మౌనంగా భరించారు. అతనిలో మార్పు రాకపోవడంతో తమ తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు. దీంతో కోపోద్రిక్తులైన బాలికల తల్లిదండ్రులు.. దారి తప్పిన ఆ గురువుకు చెప్పులతో కొట్టి దేహశుద్ధి చేశారు. అనంతరం రహదారిపై ఊరేగిస్తూ తీసుకెళ్లి, పోలీసులకు అప్పగించారు. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.

స్థానిక రవీంద్ర భారతి స్కూల్లో హిందీ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న సింగూరు అంబోజీరావు.. అదే పాఠశాలలో చదువుతున్న విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడు. 8, 9వ తరగతులు చదువుతున్న ఐదుగురు విద్యార్థినులకు అసభ్యకర నందేశాలు పంపేవాడు. తనను ప్రేమించాలని కొందరికి, అసభ్యకరంగా మరికొందరికి మెసేజ్‌లు పంపించేవాడు. అతని చర్యలకు విసుగుచెందిన విద్యార్థినులు.. వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. దీంతో కోపోద్రిక్తులైన వారంతా అంబోజీరావు కోసం వల పన్ని, ఆదివారం సాయంత్రం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద పట్టుకున్నారు. అసభ్య మెసేజ్‌లపై నిలదీశారు. అనంతరం దేహశుద్ధి చేశారు. కాంప్లెక్స్‌ నుంచి స్కూల్‌ వద్దకు తీసుకువెళ్లారు.

అక్కడ మహిళలు చెప్పులతో కొట్టారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. రోడ్డుపై నడిపించుకొని వెళ్లాలని కొందరు పట్టుబట్టారు. దీంతో కొద్ది దూరం అతని షర్టు తీసి, నడిపించారు. అనంతరం నరసన్నపేట ఏఎస్సై రమేష్‌ అతనిని స్టేషన్‌కు తరలించారు. పిల్లల ఫోన్లకు వచ్చిన మెసేజ్‌లను పోలీసులు పరిశీలించారు. ఈ వ్యవహారంపై ప్రిన్సిపాల్‌ వాసుదేవరావు తీరును కూడా తల్లిదండ్రులు వ్యతిరేకించారు. గతంలో ఒకసారి ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశామని, ఆయన స్పందించలేదని తెలిపారు. దీనిపై ప్రిన్సిపాల్‌ను సైతం నిలదీశారు. గతంలో అంబోజీరావుకు హెచ్చరించానని వాసుదేవరావు పోలీసుల ఎదుట తెలిపారు.

Advertisement
Advertisement