Sakshi News home page

విభజన దిశగా ఎస్‌సీఈఆర్‌టీ!

Published Fri, Apr 11 2014 4:10 AM

Teacher community divided over reforms in education sector

విభజన దిశగా ఎస్‌సీఈఆర్‌టీ!
వేరు చేయడమే మంచిదన్న భావన
పాఠ్య పుస్తకాల్లో మార్పుల నేపథ్యంలో ఆలోచనలు

 
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనతో పాటే రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ)ని కూడా విభజించడం అనివార్యమని విద్యాశాఖ భావిస్తోంది. గురువారం విద్యా శాఖ విభజనపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వద్ద సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ప్రాథమిక విద్యా ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య, సెకండరీ విద్యా ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యాశాఖ విభజనకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు.
 
 రాష్ట్ర విభజన తరువాత రెండు రాష్ట్రాలకు ఏడాది పాటు సేవలు అందించాల్సిన శిక్షణ సంస్థల జాబితాలో (పదో షెడ్యూలులో) ఎస్‌సీఈఆర్‌టీని కూడా కేంద్రం చేర్చింది. అయితే రాష్ట్ర విభజన తరువాత ఎస్‌సీఈఆర్‌టీని కూడా విభజించాలని... వేర్వేరు రాష్ట్రాల పాఠ్య పుస్తకాల్లో అక్కడి పరిస్థితులకు అనుగుణంగా మార్పులు తీసుకురావాల్సిన అంశాలపై వేర్వేరు ఎస్‌సీఈఆర్‌టీలు ఉండటమే ముఖ్యమని అధికారులు భావిస్తున్నారు. దీనిపై ప్రభుత్వ స్థాయిలో చర్చ జరుగుతోందని ప్రాథమిక విద్యా ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య తెలిపారు. ప్రభుత్వం కూడా పదో షెడ్యూలులో ఏయే సంస్థలను కొనసాగించాలి? ఏయే సంస్థలను అందులోంచి మినహాయించాలి? ఏయే సంస్థలను అందులో చేర్చాలి? అనే అంశాలపై చర్చిస్తోందని పేర్కొన్నారు.
 
 ఈ నేపథ్యంలో ఎస్‌సీఈఆర్‌టీని పదో షెడ్యూలు నుంచి తొలగించి, రెండుగా విభజించడమే మంచిదని అధికార వర్గాలు యోచిస్తున్నాయి. ఈ మేరకు మార్పు చేసేలా ప్రభుత్వానికి నివేదించే అవకాశం ఉంది. మరోవైపు పదో షెడ్యూలులో లేని ప్రభుత్వ పరీక్షల విభాగాన్ని అందులో చేర్చాలని ఆలోచిస్తున్నారు. తద్వారా రాష్ట్ర విభజన జరిగినా మరో ఏడాది పాటు రెండు రాష్ట్రాలకు పరీక్షల విభాగం సేవలు అందించే వీలు ఏర్పడనుంది. పదో తరగతిలో వార్షిక, అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల విధానం ఉన్న నేపథ్యంలో వీటిపై దృష్టి సారించింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement