రాజుదే పైచేయి | Sakshi
Sakshi News home page

రాజుదే పైచేయి

Published Wed, Jan 14 2015 12:40 AM

రాజుదే పైచేయి - Sakshi

 త్వరలో జరగనున్న శాసన మండలి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికల్లో.. తెలుగుదేశం పార్టీ మద్దతు కోసం హోరాహోరీగా తలపడిన ఇద్దరు కార్పొరేట్ విద్యారంగ ప్రముఖుల్లో.. మండలిలో ప్రభుత్వ విప్ చైతన్యరాజుదే పైచేయి అయ్యింది. మొదటి నుంచీ పార్టీ మద్దతు కోసం పోటీ పడిన ప్రగతి విద్యాసంస్థల అధినేత పరుచూరి కృష్ణారావు ఈ పరిణామంతో డీలా పడ్డారు. ఈ పరిస్థితుల్లో పార్టీ మద్దతు ఖాయమని ఆదినుంచీ ధీమాతో ఉన్న కృష్ణారావు స్వతంత్రంగా బరిలోకి దిగుతారా లేక ప్రత్యామ్నాయం ఆలోచిస్తారా అనేది టీడీపీలో చర్చనీయాంశంగా మారింది.
 
 సాక్షి ప్రతినిధి, కాకినాడ :ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ మద్దతు కూడగట్టేందుకు చైతన్యరాజు, కృష్ణారావు చివరివరకూ ప్రయత్నాలు చేశారు. చివరకు జిల్లాలో మెజార్టీ పార్టీ నేతల మద్దతు కూడగట్టడంలో చైతన్యరాజు సఫలీకృతులయ్యారు. పార్టీ అధిష్టానం కూడా ఇందుకు సానుకూలత వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో కాకినాడలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, పార్టీ బీసీ సెల్ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి రెడ్డి సుబ్రహ్మణ్యం తదితరుల సమక్షంలో.. పార్టీ జిల్లా అడ్‌హాక్ కమిటీ కన్వీనర్ పర్వత చిట్టిబాబు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ బలపరిచే అభ్యర్థిగా చైతన్యరాజు పేరును మంగళవారం అధికారికంగా ప్రకటించారు.టీడీపీ నిర్ణయంతో కంగుతిన్న కృష్ణారావు వర్గం పార్టీ నేతల తీరుపై మండిపడుతోంది. మొదటినుంచీ చెబుతున్నట్టే పార్టీ మద్దతు ఉన్నా.. లేకున్నా కృష్ణారావు స్వతంత్రంగానైనా బరిలో నిలవడం ఖాయమని ఆయన అనుచరవర్గం చెబుతోంది. అయితే ఆయనను అధిష్టానం బుజ్జగిస్తుందని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.
 
 పార్టీ రహితంగా జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు తెరలేచిన అనంతరం సిటింగ్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ చైతన్యరాజు మరోసారి బరిలో నిలవనున్నట్టు ముందుగానే ప్రకటించారు. ఆయన పదవీ కాలం మార్చి నెలతో ముగియనుంది. ఈ తరుణంలో అధికార పార్టీ తీర్థం పుచ్చుకోవడంతో ఆయనకు మండలిలో ప్రభుత్వ విప్ పదవి కూడా లభించింది. ఈ పరిస్థితుల్లో మరోసారి పోటీ చేసి చైతన్యరాజు తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్నారు. ఇందులో భాగంగా టీడీపీ మద్దతు కోసం ఆయన చేయని ప్రయత్నమంటూ లేదు. చైతన్యరాజుకు పోటీగా టీడీపీ మద్దతు కోసం ప్రగతి విద్యాసంస్థల అధినేత, గత అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దాపురం టిక్కెట్టు ఆశించి భంగపడిన పరుచూరి కృష్ణారావు కూడా ప్రయత్నించారు. పెద్దాపురం టిక్కెట్టు ఇస్తామని నమ్మించి చివరి నిమిషంలో రాజప్పకు ఇచ్చిన నేపథ్యంలో.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు పార్టీ మద్దతు ఖాయమని కృష్ణారావు గట్టి నమ్మకంతోనే ఉన్నారు. మాట ఇచ్చి కూడా టిక్కెట్టు ఇవ్వలేదన్న సానుభూతి, సామాజిక నేపథ్యం కలిసి వస్తుందని ఆయన ఆశించారు.
 
 కానీ లోక్‌సభ దివంగత స్పీకర్ జీఎంసీ బాలయోగి హయాం నుంచీ పార్టీలోని జిల్లా ముఖ్య నేతలతో ఉన్న సన్నిహిత సంబంధాలు, గతంలో రాజ్యసభ ఎన్నికల్లో బరి నుంచి తప్పుకోవడం, వివాదరహితుడనే పేరు ఉండడంతో.. మెజార్టీ నేతలు చైతన్యరాజువైపే మొగ్గు చూపారని టీడీపీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. చైతన్యరాజుకు టీడీపీ మద్దతు ఇస్తున్నట్టు అధికారికంగా ప్రకటించడంతో కృష్ణారావు వర్గీయులు ఆత్మపరిశీలనలో పడ్డారంటున్నారు. చైతన్యరాజుకు మద్దతు ఇచ్చిన నేపథ్యంలో కృష్ణారావును పార్టీ అధిష్టానం బుజ్జగించి, బరిలో లేకుండా చేసే వ్యూహాలకు జిల్లా నేతలు పదును పెడుతున్నారు. కృష్ణారావు విషయాన్ని అధిష్టానమే చూసుకుంటుందని జిల్లా నేతలు ధీమాగా చెబుతున్నారు. అలాగని ఇందుకు కారణం మాత్రం వారు చెప్పడంలేదు. కృష్ణారావు భవిష్యత్ వ్యూహం ఎలా ఉన్నా.. ఇద్దరు కార్పొరేట్ విద్యారంగ ప్రముఖులు బరిలోకి దిగే యత్నాలు ఉభయ గోదావరి జిల్లాల రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. కృష్ణారావు స్వతంత్ర పోరుకు సై అంటారా? అధిష్టానం బుజ్జగింపులతో వెనక్కు తగ్గుతారా అనేది టీడీపీలో హాట్‌టాపిక్‌గా మారింది.
 
 అధినేత నిర్ణయించారు : పర్వత
 కాకినాడ సిటీ : శాసన మండలి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గం ఎన్నికల్లో సిటింగ్ ఎమ్మెల్సీ చైతన్యరాజును అభ్యర్థిగా నిలపాలని తమ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్ణయించినట్టు టీడీపీ జిల్లా అడ్‌హాక్ కమిటీ కన్వీనర్ పర్వత చిట్టిబాబు తెలిపారు. కాకినాడలోని పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. చైతన్యరాజు విజయానికి పార్టీ జిల్లా నాయకులు కృషి చేస్తారన్నారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, చైతన్యరాజు, ఎమ్మెల్సీ రవివర్మ, పార్టీ నేతలు గన్ని కృష్ణ, రెడ్డి సుబ్రహ్మణ్యం, గంగ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement