డీఈఓ గారూ... ఈ పాపం ఎవరిది? | Sakshi
Sakshi News home page

డీఈఓ గారూ... ఈ పాపం ఎవరిది?

Published Thu, Mar 27 2014 3:50 AM

'Teachers largely ceased promotions

నెల్లూరు(టౌన్), న్యూస్‌లైన్: ‘ఉపాధ్యాయులు ఎక్కువగా ఉన్నందునే 14 నెలలుగా ప్రమోషన్లు నిలిపేశా. ఉపాధ్యాయులు తక్కువగా ఉన్న చోటికి అదనంగా ఉన్న ప్రాంతం నుంచి సర్దుబాటు చేశా. సబ్జెక్టు ఉపాధ్యాయుల కొరత లేకుండా చేశా’ ఈ మాటలు అన్నది ఎవరో కాదు సాక్షాత్తు డీఈఓ మువ్వా రామలింగం. ఇటీవల విలేకరుల సమావేశంలో ఆయన ఈ విధంగా సెలవిచ్చారు. వాస్తవాలను పరిశీలిస్తే అందుకు విరుద్ధంగా ఉన్నాయి.
 
 ఏడాదిపాటు తెలుగు టీచర్ లేడు
 నెల్లూరు నగరంలోని కర్ణాలమిట్ట మున్సిపల్ హైస్కూల్‌కు నగరంలోనే మంచి పేరుంది. గతంలో ఈ పాఠశాల నుంచి 9.7,  8.7 జీపీఏ సాధించిన విద్యార్థులు అనేక మంది ఉన్నారు. ఒక ఉపాధ్యాయుడు సహకారంతో చదువుకున్న ఈ పాఠశాల విద్యార్థిని నందిని 551 మార్కులు సాధించింది. పూటగడవని కుటుంబంలో పుట్టిన ఈ  విద్యార్థిని ప్రస్తుతం జైనుల సహకారంతో ఉన్నత విద్యను చదువుతోంది. అలాగే నీలిమ అనే విద్యార్థిని 556, మరో విద్యార్థి 526 మార్కులు సాధించారు. ఉత్తమ ఫలితాలకు ఈ పాఠశాల
  పెట్టింది పేరు.
 
 నేటి దీనస్థితిలో..
 ఈ కర్ణాలమిట్ట కార్పొరేషన్ ఉన్నత పాఠశాలలో ఇప్పుడు  44 మంది పదో తరగతి విద్యార్థులున్నారు. మొదట్లో ఇంకా ఎక్కువ మంది విద్యార్థులున్నప్పటికి టీచర్లు లేరని కొంతమంది బడి మారారు. అంతే కాదండోయ్.. అన్ని తరగతులకు అన్ని సబ్జెక్టులకు కలిపి ఈ పాఠశాలలో 14 మంది ఉపాధ్యాయులు ఉండాలి. ఒక్కో సబ్జెక్టుకు ఇద్దరేసి టీచర్లు ఉండాలి. కాని ఇక్కడ ఉండేది 8 మందే. గురువారం నుంచి ప్రారంభమయ్యే  టీచర్ లేని అనాథైన తె లుగు పరీక్షను రాయబోతున్నారు.  
 
  గాంధీనగర్ మున్సిపల్ పాఠశాలలో కూడా తెలుగు ఉపాధ్యాయుడు లేకుండా విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయబోతున్నారు.
 
  జాకీర్‌హుస్సేన్ నగర్, దర్గామిట్ట, కొండాయపాళెంలలోని యూపీ స్కూళ్లలో సైతం తెలుగు టీచర్ లేడు. అంతే కాక ఇక్కడ ఇంగ్లిష్, లెక్కల్ టీచర్ కూడా లేక పోవడం విశేషం.
 కేఎన్‌ఆర్ కార్పొరేషన్ ఉన్నత  పాఠశాలలో దాదాపు 1200 మంది విద్యార్థులున్నారు. ఇక్కడ సబ్జెక్టు టీచర్లు ముగ్గురు మాత్రమే ఉన్నారు. అయితే ఎస్జీటీలను కొందరిని తాత్కాలికంగా సర్దుబాటు చేశారు.
 
  ఏసీనగర్‌లో 700 మంది విద్యార్థులుంటే కేవలం పీఎస్ సబ్జెక్టుకు ఒకే  టీచర్ ఉండటం విశేషం. ఆంగ్లమాధ్యమం, తెలుగుకు వేర్వేరుగా టీచర్లుండాలి. కాని అలా జరగడంలేదు.
  వైవీఎం, సీబీనగర్‌లో ఉన్న మున్సిపాలిటీ పాఠశాలల్లో అదనంగా సబ్జెక్టు టీచర్లు ఉన్నా లేనిచోటకు రాజకీయ కారణాలతో సర్దుబాటు చేయలేకపోయారు. ఇలాంటి కారణాలు జిల్లాలో అనేక పాఠశాలల్లో చోటు చేసుకున్నాయి.
 
 హెచ్‌ఎంలు అడిగినా పట్టించుకోలేదు
 పలు సమావేశాల్లో సబ్జెక్టు కొరత గురించి డీఈఓ దృష్టికి  ప్రధానోపాధ్యాయులు తీసుకెళ్లారు. అప్పుడు డీఈఓ స్పందిస్తూ ‘మీరు ఉండడయ్యా .. అంతా మున్సిపాలిటీ మురుగు కంపే’ అంటూ వ్యంగ్యంగా అనడంతో ప్రధానోపాధ్యాయులు బాధ పడిన సందర్భాలున్నాయి.
 
 నిధులున్నా.. దండగేనా?
  విద్యాహక్కు చట్టం, ఆర్వీఎం, ఆర్‌ఎంఎస్ నిధులెన్ని ఉన్నా కనీసం ఇబ్బందులున్న చోట కొన్ని పాఠశాలలకు విద్యావలంటీర్లను కూడా నియమించకపోవడం దారుణం.
 
 ఉపాధ్యాయుల కొరతకు..
 ప్రతి నెల ఉద్యోగులు పదవీ విరమణ పొందుతుంటారు. నిబంధనల ప్రకారం ప్రతి నెల ఉపాధ్యాయులకు ప్రమోషన్లు కల్పించాలి. కాని ఈ నిబంధనలు పాటించకుండా 14 నెలలుగా ప్రమోషన్లు ఆపిన ఫలితంగా సబ్జెక్టు టీచర్ల కొరత తీవ్రమైందని ఉపాధ్యాయ లోకం కోడైకూస్తోంది. ప్రమోషన్లు ఆపితే ఆ ఖాళీల్లో గవర్నమెంట్ ఆర్డర్ల పేరుతో బదిలీ ఉపాధ్యాయులను నియమించి లక్షలు దండుకోవడానికే  విద్యాశాఖాధికారులు ఇలా చేస్తున్నారనే విమర్శలు జోరందుకున్నాయి.

 డిప్యూటీఈవో నిర్లక్ష్యం:
 విద్యాసంవత్సరం ప్రారంభంలోనే డిప్యూటీ ఈఓ, ఎంఈఓలు పాఠశాలలను తనిఖీలు చేసి టీచర్ల కొరతపై డీఈఓకు నివేదిక ఇవ్వాలి. అప్పుడు డీఈఓ వెంటనే టీచర్లను సర్దుబాటు చేస్తారు. కాని వీరికి ఆ తీరిక దొరికినట్టులేదు. కొన్ని పాఠశాలలనే ఎంచుకుని పదే పదే తనిఖీలు చేసి తమను  ప్రశ్నించినవారిపై వ్యతిరేకంగా నివేదికలు ఇవ్వడానికి మాత్రమే సమయం సరిపోతోందనే విమర్శలున్నాయి. విద్యార్థుల భవిష్యత్ గురించి మాత్రం ఆలోచించే తీరిక లేదని మేధావులు, ప్రజలు ఆరోపిస్తున్నారు.
 
 విద్యార్థుల కోసం ఎందుకు ధర్నాలు చేయలేదు
 తమ హక్కులకు భంగం కలిగితే ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తుండటం అందరికీ తెలిసిందే. అయితే విద్యార్థులకు ప్రధాన సబ్జెక్టులలో టీచర్లు లేకపోతే ఎందుకు ధర్నాలు చేయడంలేదని మేధావులు ప్రశ్నిస్తున్నారు. విద్యార్థులు ఫెయిల్ అయితే ఆ పాపం డీఈఓకు ఎంత వర్తిస్తుందో.. ఉపాధ్యాయులకూ అంతే తగులుతుందని జిల్లా ప్రజానీకం అంటోంది.
 

Advertisement
Advertisement