ఇంకా తేలని లెక్క | Sakshi
Sakshi News home page

ఇంకా తేలని లెక్క

Published Thu, Jun 1 2017 2:06 AM

Teacher's rationalization process

ప్రహసనంలా హేతు  బద్ధీ్దకరణ
2వ తేదీకి పెంచిన గడువు
నిర్లక్ష్యం వీడని ఎంఈఓలు
పరిధి మారిస్తే పట్టేస్తారు....!
గ్రామీణ స్థాయిలో చర్చలు


విజయనగరం అర్బన్‌ : టీచర్ల హేతుబద్ధీకరణ ప్రక్రియ ప్రహసనంలా మారింది. జీఓ నంబర్‌ 29లో పొందుపరిచిన మార్గదర్శకాల ప్రకారం జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల వారీగా ఉపాధ్యాయుల హేతుబద్ధీ్దకరణ నిర్వహించాల్సి ఉంది. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల వారీగా వివరాలను సేకరించి ఈ నెల 30లోగా పాఠశాల విద్యాశాఖకు ఆన్‌లైన్‌లో పంపాల్సి ఉంది. దీని కోసం విద్యాశాఖ ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను కూడా రూపొందించింది. దీనిలో పొందుపరిచిన అంశాల ప్రకారం పాఠశాలలు, విద్యార్థులు, టీచర్ల వివరాలను పంపాలని ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు.

 ఈ మేరకు క్షేత్రస్థాయి నుంచి ఎంఈఓలు వివరాలను సేకరించడంలో శ్రద్ధ చూపడం లేదనే విమర్శలు వస్తున్నాయి. తాజాగా సోమవారం ఉదయం మరో సాఫ్ట్‌వేర్‌ను ఆప్‌డేట్‌ చేస్తూ మరికొన్ని అంశాలను కొత్తగా చేర్చారు. దీంతో మొత్తం ప్రక్రియ మళ్లీ మొదటికి వచ్చినట్లయింది. దీంతో మొత్తం ప్రక్రియ మళ్లీ మొదటికి వచ్చింది. జిల్లాలో మూతపడే, విలీనం అయ్యే పాఠశాలల వివరాలపై పూర్తిస్థాయిలో స్పష్టత వచ్చే సరికి మరో రెండు రోజులు పట్టొచ్చని ఉన్నతాధికారులు గ్రహించి గడువు తేదీని వచ్చే నెల 2 వరకు పొడిగించారు.

నిర్లక్ష్యం వీడని ఎంఈఓలు..
హేతుబద్ధీ్దకరణ చేయాలంటే క్షేత్రస్థాయి నుంచి వివరాలు విద్యాశాఖకు  అందాల్సి ఉంది. వివరాలు అందించడంలో ఎంఈఓలే కీలకం. గడువు పూర్తయినా ఇంకా సగం మంది వివారాలు ఇవ్వలేదు. రేషనలైజేషన్‌ జీఓ 29ను అమలు చేస్తే పాఠశాల విద్యా శాఖ జీపీఎస్‌ ద్వారా గుర్తించిన 516 పాఠశాలలకు సంబంధించిన వివరాలను క్షేత్రస్థాయిలో ధ్రువీకరించి గడువు తేదీలోపు జిల్లా కేంద్రానికి ఎంఈఓలు ఆన్‌లైన్‌లో పంపాల్సి ఉంది. సంబంధిత పాఠశాలల వివరాలు దాదాపు జిల్లాలోని 34 మండలాల్లోనూ ఉన్నాయి. ప్రా««థమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు వేర్వేరుగా విద్యార్థులు, టీచర్ల సంఖ్య ఉంటుంది. ఈ వివరాలన్నింటినీ నాలుగు ప్రొఫార్మాల్లో ఎంఈఓలు ఇవ్వాలి. క్షేత్రస్థాయిలో పరిశీలించి, వివరాలిస్తే విద్యాశాఖ ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేస్తుంది. మంగళవారం సాయంత్రానికి ఇంకా 15 మండలాల నుంచి వివరాలు రావాల్సి ఉంది.  

పరిధి మారిస్తే పట్టేస్తారు..!
గ్రామంలో పాఠశాలలు మూతబడతాయిని ప్రభుత్వం జారీ చేసిన జీఓ 29 విధి విధానాలను అమలు చేయకుండా ఉద్దేశ పూర్వకంగా తప్పుడు వివరాలు పంపితే ఎంఈఓలపై చర్యలు తప్పవు. ఆయా గ్రామాల్లో ఏ ఒక్క ప్రభుత్వ పాఠశాల మూత పడకూడదనే ఉద్దేశంతో కిలోమీటర్ల నిడివిని పెంచేలా ఎంఈఓలపై పలువురు ప్రజాప్రతినిధులు ఒత్తిడి తెస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇదే విషయాన్ని డీఈఓ ఎస్‌ అరుణకుమారి వద్ద ప్రస్తావించగా జీపీఎస్‌ విధానం  వల్ల కిలోమీటర్ల పరిధిని పెంచడం కానీ, తగ్గించ డం కానీ వీలుకా దన్నారు. స్కూళ్లు మూతపడకుండా ప్రజాప్రతినిధులు ఎవరైనా ఎంఈఓలపై ఒత్తిడి తెస్తుంటే ఆ సమాచారాన్ని తనకు తెలియజేయాలని ఇప్పటికే వారికి సూచించినట్లు తెలిపారు.

 హేతుబద్ధీ్దకరణ ఉత్తర్వులపై చర్చ..
2017 హేతుబద్ధీ్దకరణకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన జీఓ 29ను ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు ఇది గ్రామీణ ప్రాంతాల ప్రజలపై ప్రభావం చూపిస్తోంది. గ్రామాల్లో ఏ ఇద్దరు వ్యక్తులు కలిసిన మాట్లాడుకున్నా, చివరికి ఇదే ప్రస్తావనతో ముగిస్తున్నారు. ఇక్కడున్న పాఠశాల మూసివేతకు గురైతే తమ పిల్లల భవిష్యత్తు కార్యాచరణ, రాబోవు విద్యా సంవత్సరానికి ఇదే పాఠశాలల్లో కొనసాగించాలా...? బడి మాన్పిం చాలా..? అన్న సందిగ్ధంలో పడ్డారు. నిబంధనలు కచ్చితంగా పాటించి వీలైనంతలో పాఠశాలలు మూతపడకుండా చూడాలని గ్రామస్థులు ఎంఈఓలను కోరుతున్నారు. మూసివేతలో భాగంగా ప్రాథమిక పాఠశాలలకు కిలోమీటరు, ప్రాథమికోన్నత పాఠశాలకు 3 కిలోమీటర్లు, ఉన్నత పాఠశాలకు 5 కిలోమీటర్లు లోపు దూరంలోని పాఠశాలల్లో కలిపేయడం వంటి చర్యలపై అధికారులు చర్చించుకుంటున్నారు.

Advertisement
Advertisement