అయ్యవార్లకు వేతన గుబులు! | Sakshi
Sakshi News home page

అయ్యవార్లకు వేతన గుబులు!

Published Fri, Apr 7 2017 8:20 AM

teachers to wage war!

► హెచ్‌.ఎం.లకు
►  పదోన్నతులతో బిల్లులు పెట్టని వైనం
► ఫలితంగా జీతాలకు నోచుకోని పలువురు 
► ఉపాధ్యాయులు ఇన్‌చార్జిలను సైతం నియమించని అధికారులు
వీరఘట్టం మండలం తెట్టంగి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పని చేసిన డి.బాలరాజుకు సరుబుజ్జిలి ఎంఈఓగా మార్చి 26న ప్రమోషన్‌ వచ్చింది. వెంటనే ఆ మండల విద్యాశాఖాధికారిగా బాధ్యతలు చేపట్టారు. అయితే అప్పటి వరకూ పని చేసిన పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి సంబంధించిన బిల్లులు పెట్టకపోవడంతో గత నెల జీతం అందక వారంతా ఆందోళన చెందుతున్నారు. ఇదే పరిస్థితి చాలా పాఠశాలల్లో నెలకొంది. అయ్యవారికి పదోన్నతి వచ్చి హాయిగా వెళ్లిపోయారు... మా పరిస్థితి ఏమిటని ఉపాధ్యాయులు..ఇతర సిబ్బంది ప్రశ్నిస్తున్నారు.
 
వీరఘట్టం: ఉపాధ్యాయులకు వేతన గుబులు పట్టుకుంది. ఏప్రిల్‌ నెల ప్రారంభమైంది వారం రోజులు గడుస్తున్నా.. గత నెల జీతానికి వందలాది మంది ఉపాధ్యాయులు నోచుకోలేదు. మార్చి 26న జిల్లాలోని 34 ఉన్నత పాఠశాలల్లో పని చేస్తున్న ప్రధానోపాధ్యాయులకు మండల విద్యాశాఖాధికారులుగా ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. వెంటనే వీరు తమకు కేటాయించిన చోట ఎంఈవోలుగా బాధ్యతలు చేపట్టారు. అయితే ప్రధానోపాధ్యాయులు విడిచిన పాఠశాలల్లో ఇంతవరకు ఇన్‌చార్జిలుగా ఎవరినీ నియమించలేదు. కనీసం ఎఫ్‌ఏసీ బాధ్యతలను ఎవరికీ అప్పగించలేదు. దీంతో ఈ పాఠశాలలో కొత్త సమస్యలు మొదలయ్యాయి. ముఖ్యంగా జీతాలు అందక ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు.
 
ఇదీ విషయం.. 
  ఉపాధ్యాయుల జీతాల బిల్లులపై సంతకాలు చేసి ప్రతి నెలా ఉన్నతాధికారులకు పంపించాల్సిన బాధ్యత ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులపై ఉంది. అయితే ఇటీవల జిల్లాకు చెందిన 34 మంది ప్రధానోపాధ్యాయులు ఎంఈవోలుగా  పదోన్నతి పొందారు. ప్రమోషన్‌ ఆనందంలో ఉన్నవారంతా బదిలీ స్థానాలకు వెళ్లిపోయారు. ఇంతవరకూ బాగానే ఉన్నా తాము పనిచేసిన పాఠశాలలో పరిస్థితిని చక్కబెట్టకుండా వెళ్లిపోవడంతో ప్రస్తుతం ఆయా పాఠశాలల్లో ఉన్న 500 లకు పైబడి ఉపాధ్యాయులకు, ఇతర సిబ్బందికి గత నెల జీతాలు ఇప్పటికీ అందలేదు. దీంతో వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మేల్కొని తమకు సకాలంలో వేతనాలు అందేలా చూడాలని కోరుతున్నారు.
 
డీఈవో ఏమన్నారంటే...
ఉపాధ్యాయులు జీతాలకు నోచుకోని విషయాన్ని జిల్లా విద్యాశాఖాధికారి వి.ఎస్‌.సుబ్బారావు వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా.. కొన్ని పాఠశాలలకు చెందిన సిబ్బందికి జీతాలు అందకపోవచ్చున్నారు. 
త్వరలోనే ఆయా పాఠశాలల్లో పదోన్నతుల ద్వారా హెచ్‌.ఎంలను నియమించేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. కొద్ది రోజుల్లో జీతాలు అందేలా చర్యలు చేపడతామని...జీతాలు అందని వారు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు.
  

Advertisement
Advertisement