379 మంది కేజీబీవీ ఉద్యోగుల కడుపు కొట్టారు! | Sakshi
Sakshi News home page

379 మంది కేజీబీవీ ఉద్యోగుల కడుపు కొట్టారు!

Published Fri, Apr 22 2016 1:30 AM

Teachers, workers remove the orders

ప్రత్యేకాధికారులు సహా ఉపాధ్యాయులు, కార్మికులను
తొలగించాలని ఉత్తర్వులు
రేపటి నుంచి అమలు

 

బి.కొత్తకోట: ఇటీవలే ఆరోగ్య మిత్రల కడుపుకొట్టిన ప్రభుత్వం తాజాగా కేజీబీవీ ఉద్యోగులను ఇంటికి పంపుతోంది. జిల్లాలోని 20 కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు(కేజీబీవీ)లో పనిచేస్తున్న ప్రత్యేక అధికారులు సహా ఉపాధ్యాయులు, సిబ్బందిని ఈనెల 23నుంచి తొలగించాలని సర్వశిక్ష అభియాన్ రాష్ట్ర ప్రాజెక్టు డెరైక్టర్ డాక్టర్ రమణమూర్తి మంగళవారం ఆదేశాలు జారీచేశారు.  ఏటా మే నెలలో ఉపాధ్యాయ, సిబ్బందిని విధులనుంచి తొలగించడం సాధారణమే. అయితే ప్రస్తుతం కొత్తగా ప్రత్యేకాధికారులను తొలగింపు జాబితాలో చేర్చింది. వీరిని తిరిగి విధుల్లోకి తీసుకుంటారా, లేదా అన్న విషయాన్ని ఆదేశాల్లో పేర్కొనలేదు. దీంతో ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో శనివారం నుంచి జిల్లాలోని 20 కేజీబీవీల్లో పనిచేస్తున్న 379మంది ఉద్యోగాలు కోల్పోనున్నారు. భవిష్యత్తులో తమ పరిస్థితి ఏమిటని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. ఒక్కో కేజీబీవీలో ఒక ఎస్‌ఓ, సబ్జెక్ట్ టీచర్లు ఏడుగురు, పీఈటీ ఒకరు, ఏఎన్‌ఎం ఒకరు, అకౌంటెంట్ ఒకరు, అటెండర్ ఒకరు, పగలు, రాత్రి వాచ్‌మెన్లు ఇద్దరు, స్కావెంజర్ ఒక రు, స్వీపర్ ఒకరు, కంప్యూటర్ ఆపరేటర్ ఒకరు, స్కిల్ ఇన్‌స్ట్రక్టర్  ఒకరు, కుక్ ఒకరు పనిచేస్తున్నారు.


ఇలా బి.కొత్తకోట, పెద్దతిప్పసముద్రం, ములకలచెరువు, కురబలకోట, తంబళ్లపల్లె, పెద్దమండ్యం, కుప్పం, గుడిపల్లె, రామకుప్పం, శాంతిపురం, బెరైడ్డిపల్లె, గంగవరం, పుంగనూరు, రామసముద్రం, నిమ్మనపల్లె, కలకడ, కేవీ.పల్లె, రొంపిచర్ల, యర్రావారిపాళ్యం, కేవీబీపురం విద్యాలయాల్లో 439 మంది పనిచేస్తున్నారు. వీరంతా కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ పద్దతిలో ఉద్యోగాల్లో చేరారు. వీరిలో అకౌంటెంట్, పగలు, రాత్రి వాచ్‌మెన్లు మినహా మిగిలిన 19మందిని విధులనుంచి తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  దీంతో జిల్లావ్యాప్తంగా 379మంది ఉద్యోగాలను కోల్పోతున్నారు. వేసవి సెలవుల్లో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను ఏప్రిల్ వరకు కొనసాగించి మేనెలలో వేతనాలు నిలిపివేస్తారు. జూన్ నుంచి మళ్లీ కొత్త విద్యాసంవత్సరంలో తిరిగి విధుల్లోకి కొత్తగా కాంట్రాక్టు పద్ధతిలో విధుల్లోకి తీసుకొంటారు. అయితే ప్రస్తుతం జారీచేసిన ఆదేశాల్లో ఎస్‌వోలను కూడా తొలగిస్తూ నిర్ణయం తీసుకోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అకౌంటెంట్, వాచ్‌మెన్లను మాత్రం కొనసాగిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా ఏప్రిల్ 23 నుంచి తొలగిస్తూ ఇచ్చిన ఆదేశాల్లో మళ్లీ వీరిని కొనసాగించే విషయాన్ని ఎక్కడా పేర్కొనలేదు. గతానికి భిన్నంగా ఎస్‌వోలను తొలగించడం, వారిని మళ్లీ చేర్చుకోవడంపై స్పష్టత లేని కారణంగా ప్రభుత్వం వీరికి అన్యాయం చేసేలా ప్రయత్నాలు చేస్తోందన్న వాదన వినవస్తోంది.

Advertisement
Advertisement