కన్నీటి సేద్యం | Sakshi
Sakshi News home page

కన్నీటి సేద్యం

Published Wed, Oct 28 2015 12:07 AM

కన్నీటి సేద్యం - Sakshi

కరెంటు లేదు.. కాల్వలకు నీరు రాదు
ఎండిపోవడానికి సిద్ధంగా4.32 లక్షల ఎకరాలు
వరుణుడి కరుణ కోసం ఎదురుచూపులు
కృష్ణా డెల్టా రైతులకు నీటి కష్టాలు

 
 విజయవాడ : కృష్ణా డెల్టా రైతు కన్నీటి సేద్యం చేస్తున్నాడు. 150 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా అక్టోబర్ నెల ముగుస్తున్నా.. నాగార్జునసాగర్ నుంచి చుక్క నీరు కిందికి రాలేదు. సాగర్ దిగువన.. పులిచింతల ఎగువన కురిసిన వర్షం నీటినే నీటిపారుదల శాఖ అధికారులు భద్రపరిచి కొద్దికొద్దిగా వదులుతున్నారు. దీంతో చేతికొచ్చిన పంట నోటి వరకు వస్తుందో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.  ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం రాత్రి ఎట్టకేలకు రైతుల కష్టాలపై దృష్టిసారించారు. మరి నష్ట నివారణ చర్యలు ఏ మేరకు తీసుకుంటారనేది అంతుచిక్కని ప్రశ్నే.

రోజుకు ఐదో వంతు నీరు
కృష్ణా డెల్టా అన్ని కాల్వలకు పూర్తిస్థాయిలో నీటిని వదలాలంటే 16 వేల క్యూసెక్కులు కావాలి. మంగళవారం రాత్రికి కేవలం 3,247 క్యూసెక్కుల నీరు మాత్రమే వదిలినట్లు ఇరిగేషన్ ఇంజినీర్లు చెబుతున్నారు. ఈ నీరు కాల్వలను దాటి రైతుల పొలాలను తాకేది అనుమానమే.మరోవైపు పులిచింతలలో నీరు బాగా తగ్గింది. మంగ ళవారానికి 0.9 టీఎంసీలు మాత్రమే ఉంది. ఈ నీటిని నిరంతరంగా వదిలితే  రెండు మూడు రోజుల కంటే ఎక్కువ రాదు. అందువల్ల ఇక వదలకుండా తాగునీటి కోసం దాస్తామని ఇంజినీర్లు చెబుతున్నారు. కాల్వలకు వదులుతున్న 3,247 టీఎంసీల్లో కేవలం పులిచింతల నుంచి 2,560 టీఎంసీల నీరు వస్తుండగా కేవలం ఆరేడు వందల క్యూసెక్కులు మాత్రమే పట్టిసీమ నుంచి వస్తున్నట్లు సమాచారం.

 నీటికోసం కోటి కష్టాలు
 అడపాదడపా పడిన వర్షాలకు ఎలాగోలా ఊడ్పులు పూర్తిచేసిన రైతులు ఇప్పుడు పండిన పంటను కాపాడుకునేందుకు ప్రాణాలకు తెగిస్తున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం జిల్లాలో 4.32 లక్షల ఎకరాలకు రెండు, మూడు తడులు ఇవ్వాల్సి ఉంది. ఇప్పుడు వరి పొలాలన్నీ ఈనిక, పొట్ట దశల్లో ఉన్నాయి. ఈ సమయంలో నీరు లేక భూమి నెర్రెలిస్తే తాలు కంకులు వస్తాయని రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. మచిలీపట్నం, బంటుమిల్లి, పామర్రు, పెడన, గుడివాడ, గుడ్లవల్లేరు తదితర ప్రాంతాల్లో కాల్వలలో వచ్చే కొద్దిపాటి నీటిని దక్కించుకునేందుకు నిద్ర మానుకుని రాత్రిపూట కాల్వల వద్దే పడిగాపులు పడుతున్నారు. కరెంటు రాగానే బోర్ల ద్వారా నీటిని మళ్లించాలనే ఉద్దేశంతో వందలాదిమంది రైతులు పొలాలను వదలి గ్రామాల్లోకి రావడమే లేదు. మరోవైపు కాల్వలు ఎండిపోగా, ఇంకోవైపు వర్షాలులేక భూగర్భ జలాలు అడుగంటాయి. రైతులు వరుణుడి కరుణ కోసం ఎదురు చూస్తున్నారు. రోజుకు ఏడు గంటలు కరెంటు వచ్చినా విడతలవారీగా రావడంతో భూములు తడవడం లేదని చెబుతున్నారు. ఇప్పటికే ఎకరాకు కనీసం రూ.10 వేలు చొప్పున పది ఎకరాలకు పెట్టుబడి పెట్టామని, ఈ దశలో పంట చేతికి రాకపోతే భారీగా నష్టపోతామని పెడన రైతు కృష్ణారావు ‘సాక్షి’ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement