పని బాట..కన్నీటి మూట | Sakshi
Sakshi News home page

పని బాట..కన్నీటి మూట

Published Sat, Mar 8 2014 3:41 AM

Tear-proof way to work ..

 త్వరలో తిరునాల. పండగలా చేసుకోవాలి. బంధువులను పిలుచుకోవాలి. నాలుగు రాళ్లు చేతిలో ఉంటే మేలు. ఊర్ల పనుల్లేవు. పక్క ఊర్లకైనా ఎల్లాల అనుకుంటుండగా.. గని గ్రామంలో మిరప పండు తెంచేందుకు పని దొరికింది. గడివేముల మండలం ఉండుట్ల గ్రామానికి చెందిన 36 మంది శుక్రవారం ఉదయమే ట్రాక్టర్‌లో పయనమైనారు. కొంత దూరం పోయినాక ట్రాక్టర్ బోల్తా పడటంతో ఓ మహిళ అక్కడికక్కడే చనిపోగా.. మరో ఇద్దరు మహిళలు కర్నూలు ప్రభుత్వాసుపత్రికి చేరుకునే లోపు మరణించారు.  తెల్లారితే మహిళా దినోత్సవం. ప్రపంచమంతా ఆ ఏర్పాట్లలో ఉండగా.. బతుకు బాటలో ముగ్గురు మహిళలు మృత్యువొడి చేరడంతో గ్రామంలో విషాదం అలుముకుంది.
 
 కర్నూలు(హాస్పిటల్), న్యూస్‌లైన్: కర్నూలు సర్వజన వైద్యశాల క్యాజువాలిటీ శుక్రవారం ఉదయం క్షతగాత్రులతో కిక్కిరిసింది. గడివేముల మండలం ఉండుట్ల గ్రామ సమీపంలో ట్రాక్టర్ బోల్తాపడిన ప్రమాదంలో గాయపడిన వారితో ఆసుపత్రి నిండిపోయింది. క్యాజు వాలిటీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నాగరాజు ఆధ్వర్యం లో జూనియర్ వైద్యులు, నర్సులు క్షతగాత్రులకు వైద్యం ప్రారంభించారు. పడకలు సరిపోకపోవడంతో ఒక్కోదానిపై ఇద్దరిచొప్పున వైద్యం చేయాల్సి వచ్చింది. మధ్యాహ్నం 3 గంటల వరకు క్యాజువాలిటీలో క్షతగాత్రుల ఆర్థనాదాలు మిన్నంటాయి.
 
 క్షతగాత్రులను పరామర్శించిన గౌరు దంపతులు
 కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు, వారి కుటుంబ సభ్యులను వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి, పార్టీ పాణ్యం నియోజకవర్గ సమన్వయకర్త గౌరు చరితారెడ్డి పరామర్శించారు. బాధితులంతా నిరుపేదలే కావడంతో ఆదుకోవాలని అధికారులను కోరారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా బాధితులను తెలుగుదేశం పార్టీ నాయకులు కేజే రెడ్డి, రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షులు బెరైడ్డి రాజశేఖరరెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి పరామర్శించారు.
 

Advertisement
Advertisement