పిల్లల భవిష్యత్ పట్టదా? | Sakshi
Sakshi News home page

పిల్లల భవిష్యత్ పట్టదా?

Published Tue, Dec 30 2014 2:01 AM

telangana, AP row on eamcet

* ఎంసెట్‌పై పట్టువిడుపులు లేని ఇరు రాష్ట్రాలు
* ఏపీ సర్కారు ఒంటెత్తు పోకడ
* మెట్టుదిగని తెలంగాణ ప్రభుత్వం
* వేర్వేరుగానే పరీక్షల నిర్వహణకు రెండు రాష్ట్రాల పంతం
* ఎవరికీ పట్టని విభజన చట్టం నిబంధనలు
* భవిష్యత్తుపై విద్యార్థుల్లో భయాందోళనలు

సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్యారంగంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు అనుసరిస్తున్న వైఖరి విద్యార్థులకు తలనొప్పిగా మారింది. ఇరు ప్రభుత్వాలు దేనికదే ఏకపక్షంగా వ్యవహరిస్తుండటంతో తమ పిల్లల భవిష్యత్తుపై తల్లిదండ్రులకూ ఆందోళన తప్పడం లేదు. రెండు రాష్ట్రాల నిర్ణయాలతో లక్షలాది మంది విద్యార్థులు గందరగోళంలో పడుతున్నారు. ఇప్పటికే ఇంటర్ పరీక్షల నిర్వహణకు వేర్వేరు తేదీలు ప్రకటించిన ఇరు ప్రభుత్వాలు.. తాజాగా ఎంసెట్ నూ వేర్వేరుగా నిర్వహిస్తామని ప్రకటించాయి.

వచ్చే ఏడాది మే 10వ  తేదీన ఎంసెట్‌ను నిర్వహిస్తామని ఏపీ ఉన్నత విద్యా మండలి సోమవారం ప్రకటించగా, అంతకంటే వారం పది రోజుల ముందే తాము నిర్వహించే ఎంసెట్ ఉంటుందని తెలంగాణ ఉన్నత విద్యా మండలి పోటీ ప్రకటన చేసింది. పరీక్షల విషయంలో షెడ్యూళ్లను ప్రకటిస్తున్నాయే తప్ప విద్యార్థుల ప్రయోజనాలను ఏ ప్రభుత్వమూ పట్టించుకోవడం లేదు. వచ్చే పదేళ్ల పాటు, రాష్ట్ర విభజనకు ముందున్న ప్రవేశాల విధానమే కొనసాగించాలన్న ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని నిబంధనలను ఏ రాష్ర్టమూ పాటించడం లేదు. పదో షెడ్యూల్‌లోని ఉమ్మడి సంస్థలు ఇరు రాష్ట్రాల వారికి సమానంగా సేవలు అందించాలని మాత్రమే విభజన చట్టం స్పష్టం చేసింది. కానీ, సదరు సంస్థల నియంత్రణపై ఇరు రాష్ట్రాలు పట్టుదలగా ఉండటంతో గందరగోళానికి, ఆదిపత్య పోరుకు దారితీస్తోంది.

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ నుంచి మొదలు..
మొన్నటి ఇంజనీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ సందర్భంగా ఇరు రాష్ట్రాల మధ్య గొడవ మొదలైంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 75 ప్రకారం ఏపీ ఉన్నత విద్యా మండలి తెలంగాణ ప్రభుత్వ నేతృత్వంలో పని చేయాలి. కానీ ఆ నిబంధనకు విరుద్ధంగా ఏపీ వ్యవహరించింది. సుప్రీం ఆదేశాల మేరకు గడువులోగా ప్రవేశాలను పూర్తిచేయడం కష్టమని తెలంగాణ సర్కారు చెప్పినా.. ఏపీ మండలి అందుకు భిన్నంగా ముందుకెళ్లింది. ఫలితంగా రెండో దశ కౌన్సెలింగ్ నిర్వహించలేని పరిస్థితి తలెత్తింది. ఏపీ కౌన్సిల్ తీరుతో మండిపడిన తెలంగాణ ప్రభుత్వం సొంతంగా తెలంగాణ ఉన్నత విద్యా మండలిని ఏర్పాటు చేసింది. మొత్తానికి రెండో విడత అడ్మిషన్లు లేకపోవడంతో వేలాదిమంది విద్యార్థులు నష్టపోయారు.

ఇంటర్ విషయంలోనూ అదే తీరు
చట్టం ప్రకారం ఇంటర్ బోర్డు కూడా తెలంగాణ ప్రభుత్వ పరిధిలో పని చేయాలి. కానీ బోర్డుపై అధికారాన్ని వదులుకునేందుకు ఏపీ ప్రభుత్వం ఇష్ట పడలేదు. బోర్డును తమకు అప్పగిస్తే రెండు రాష్ట్రాల్లో పరీక్షలను నిర్వహిస్తామని తెలంగాణ విద్యా శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు. అయినా  ఏపీ సర్కారు అందుకు ఒప్పుకోలేదు. కానీ ఇంటర్ పరీక్షలను ఉమ్మడిగానే నిర్వహించాలని ఏపీ పట్టుబట్టింది. పైగా ఎంసెట్ తుది ర్యాంకు ఖరారులో ఇంటర్ మార్కులకు ఇచ్చే 25 శాతం వెయిటేజీ విషయంలో సమస్యలు వస్తాయని పేర్కొంది.

అయితే ఇందుకు ఐఐటీ తరహాలో పర్సంటైల్ నార్మలైజేషన్‌ను పాటిద్దామని, వేర్వేరుగానే పరీక్షలు నిర్వహించుకుందామని తెలంగాణ చెప్పింది. విద్యార్థుల ప్రయోజనాల విషయంలో ఏ రాష్ర్టమూ పట్టువిడుపులను ప్రదర్శించలేదు. చివరకు తెలంగాణ మంత్రితో మాట్లాడకుండానే మార్చి 11 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలను నిర్వహిస్తామని ఏపీ విద్యా శాఖ మంత్రి ప్రకటించారు. దీంతో ఆగ్రహం చెందిన తెలంగాణ ప్రభుత్వం సొంతంగా ఇంటర్ బోర్డును ఏర్పాటు చేసుకుని మార్చి 9వ తేదీ నుంచే పరీక్షల నిర్వహణకు షెడ్యూల్ ప్రకటించుకుంది.

తాజాగా ఎంసెట్ విషయంలోనూ..
పదేళ్లపాటు ఉమ్మడి ప్రవేశాల విధానం అమలు చేయాల్సి ఉన్నందున ఎంసెట్‌ను ఉమ్మడిగా నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం వాదించింది. అయితే తామే ఎంసెట్‌ను నిర్వహిస్తామని, ఏపీ ప్రభుత్వం అంగీకరిస్తే రెండు రాష్ట్రాలకు కలిపి ఒకే ఎంసెట్ పరీక్ష నిర్వహిస్తామని తెలంగాణ సర్కారు స్పష్టం చేసింది. ఈ విషయం ఎటూ తేలకుండానే సోమవారం ఉన్నట్టుండి మే 10న ఎంసెట్‌ను, ఇతరత్రా ఉమ్మడి ప్రవేశ పరీక్షలను రెండు రాష్ట్రాలకు తామే నిర్వహిస్తామంటూ ఏపీ ఉన్నత విద్యా మండలి చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డి ప్రకటించారు. తెలంగాణ కౌన్సిల్‌కు చట్టబద్ధత లేదన్నారు. దీంతో తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి కూడా మీడియా సమావేశం పెట్టి.. తాము నిర్వహించబోయే ఎంసెట్ తదితర పరీక్షల షెడ్యూలును జనవరి 5వ తేదీన ప్రకటిస్తామని చెప్పారు.

ఏపీ ఎంసెట్ కంటే వారం పది రోజుల ముందుగానే తమ ఎంసెట్ ఉంటుందని, తెలంగాణలోని విద్యా సంస్థల్లో ఓపెన్ కోటా కింద 15 శాతం సీట్లలో ప్రవేశాల కోసం ఏపీ విద్యార్థులు కూడా తమ ఎంసెట్ రాయవచ్చని పేర్కొన్నారు. విభజన చట్టం నిబంధనల ప్రకారం తాము ఏపీ విద్యార్థులకు ఓపెన్ కోటాలో మెరిట్ ఆధారంగా సీట్లు ఇస్తామని తెలిపారు. ఇప్పటికైనా ఏపీ సర్కారు ముందుకు వస్తే రెండు రాష్ట్రాలకు ఒకే ఎంసెట్ నిర్వహిస్తామని కూడా చెప్పారు. ఈ పరిణామాలతో విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలు తెలంగాణలో ఎక్కువగా ఉండగా, మెడిసిన్ సీట్లు ఏపీలో ఎక్కువగా ఉన్నాయి. వాటిల్లో ఓపెన్ కోటాలో సీట్ల కోసం ఎదురు చూస్తున్న వారంతా గందరగోళంలో పడ్డారు.

విభజన చట్టంలో ఏముంది?
ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని పదో షెడ్యూలులో ఇంటర్మీడియట్ బోర్డును, ఏపీ ఉన్నత విద్యా మండలిని చేర్చింది. పదో షెడ్యూలులో ఉన్న ఈ సంస్థలు రెండు రాష్ట్రాలకు సేవలు అందించాలి. ఏడాదిలోగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పందం చేసుకొని, వాటి సేవలను కొనసాగించాలా లేక విభజించుకోవాలా అన్నది తేల్చుకోవాలి. ఇక సెక్షన్ 95 ప్రకారం పదేళ్ల పాటు రెండు రాష్ట్రాల్లోని విద్యార్థులకు సమాన విద్యావకాశాలు అందించాలి.

రెండు రాష్ట్రాల్లోని ప్రైవేటు, ప్రభుత్వ, ఎయిడెడ్ విద్యా సంస్థల్లో రాష్ట్ర విభజనకు ముందున్న ప్రవేశాల కోటా, రిజర్వేషన్లు, ప్రవేశాల విధానాన్ని పదేళ్ల పాటు అమలు చేయాలి. అలాగే సెక్షన్ 75 ప్రకారం పదో షెడ్యూలులోని సంస్థలు భౌగోళికంగా ఏ రాష్ట్ర పరిధిలో ఉంటే ఆ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే పని చేయాలి. పొరుగు రాష్ట్రానికి అంతకుముందు అందించిన విధంగానే సేవలను కొనసాగించాలి. సేవల్లో ఎలాంటి వివక్ష చూపడానికి వీల్లేదు. ఈ మేరకు విద్యా రంగ ం విషయంలో విభజన చట్టంలో పేర్కొన్నారు.

Advertisement
Advertisement