అసెంబ్లీ నుంచి రాగానే పార్లమెంటుకు | Sakshi
Sakshi News home page

అసెంబ్లీ నుంచి రాగానే పార్లమెంటుకు

Published Sat, Jan 11 2014 2:02 AM

అసెంబ్లీ నుంచి రాగానే పార్లమెంటుకు - Sakshi

  • టీ-బిల్లుపై కేంద్ర హోంమంత్రి షిండే వెల్లడి
  •   వచ్చే సమావేశాల్లోనే పార్లమెంటులో బిల్లు పెడతాం 
  •   టీ-బిల్లు ఆమోదంపై మేం పూర్తి విశ్వాసంతో ఉన్నాం
  •  
     సాక్షి, న్యూఢిల్లీ:  రాష్ట్ర విభజనకు ఉద్దేశించిన ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఉందని.. బిల్లు అసెంబ్లీ నుంచి తిరిగి వచ్చిన వెంటనే పార్లమెంటులో ప్రవేశపెడతామని కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే చెప్పారు. పార్లమెంటులో రాష్ట్ర విభజన బిల్లు ఆమోదంపై కేంద్రం పూర్తి విశ్వాసంతో ఉన్నదన్నారు. హోంశాఖ నెలవారీ నివేదిక విడుదలకు శుక్రవారం ఢిల్లీలో విలేకరుల సమావేశంలో పాల్గొన్న షిండే.. తెలంగాణ ఏర్పాటుపై అడిగిన ప్రశ్నలకు బదులిచ్చా రు. రాష్ట్ర శాసనసభ అభిప్రాయంతో బిల్లును పంపడానికి రాష్ట్రపతి జనవరి 23వ తేదీ వరకు గడువు ఇచ్చారని.. అసెంబ్లీ నుంచి బిల్లు తిరిగిరావాలని తాను కోరుకుంటున్నానని, అది వచ్చాక పార్లమెంటులో పెడతామని చెప్పా రు.
     
    రానున్న పార్లమెంటు సమావేశాల్లోనే తెలంగాణ బిల్లును పెడతామని స్పష్టంచేశారు. ‘లోక్‌సభ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి కదా.. మరి బిల్లును ఆమోదించి రెండు రాష్ట్రాలు చేయటం కుదురుతుందా?’ అని అడగగా.. ‘‘ముందు బిల్లు అసెంబ్లీ నుంచి ఇక్కడికి రానివ్వండి.. మేమైతే బిల్లును పార్లమెంటులో పెడతాం.. దానిని పాసవ్వనివ్వండి. బిల్లు ఆమోదంపై మేం చాలా విశ్వాసంతో ఉన్నాం. నేను, ప్రభుత్వం, సోనియాగాంధీ అందరం విశ్వాసంతో ఉన్నాం’’ అని షిండే బదులిచ్చారు. 
     
     మావోయిస్టు నాయకులు ఉసెండిని అనుసరించాలి
     మావోయిస్టు పార్టీ ముఖ్య నాయకుడు వెంకట కృష్ణ ప్రసాద్ అలియాస్ గుడ్సా ఉసెండి ఆంధ్రప్రదేశ్ పోలీసుల ఎదుట లొంగిపోయారని.. గతంలో దండకారణ్య ప్రాంతానికి మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధిగా వ్యవహరించిన ఉసెండి లొంగుబాటును తాను స్వాగతిస్తున్నానని షిండే పేర్కొన్నారు. మావోయిస్టు పార్టీలోని ఇతర సీనియర్ నాయకులూ ఉసెండి బాటనే అనుసరించాలని విజ్ఞప్తి చేశారు. 
     
     నెలాఖరు వరకు ఏపీలో కేంద్ర బలగాలు...
     ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం మోహరించివున్న 95 కంపెనీల కేంద్ర బలగాలను జనవరి నెలాఖరు వరకు కొనసాగిస్తున్నట్లు షిండే తెలిపారు. రాష్ట్రంలోని శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షించాక 4 ఆర్‌ఏఎఫ్, 50 సీఆర్‌పీఎఫ్, 33 బీఎస్‌ఎఫ్, 8 సీఐఎస్‌ఎఫ్ కంపెనీల బలగాలను అక్కడే ఉంచాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. భద్రతా సంబంధిత వ్యయం పథకం కింద నక్సల్స్ ఏరివేత కార్యకలాపాలపై రాష్ట్రప్రభుత్వం ఖర్చుచేసిన మొత్తంలో రూ.153.40 లక్షల నిధులను గత డిసెంబర్ 2న రాష్ట్రానికి రీయింబర్స్‌మెంట్ రూపంలో ఇచ్చినట్టు షిండే నివేదికలో పేర్కొన్నారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement