పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలి | Sakshi
Sakshi News home page

పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలి

Published Mon, Aug 26 2013 4:17 AM

telangana bill in parliament

హుజూర్‌నగర్,న్యూస్‌లైన్ :య్రూపీఏ ప్రభుత్వం తెలంగాణ బిల్లును పార్లమెంట్‌లో వెంటనే ప్రవేశపెట్టాలని తెలంగాణ మట్టిమనిషి వేనేపల్లి పాండురంగారావు డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక తేజ టాలెంట్‌స్కూల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దశాబ్దాలకాలంగా తెలంగాణ రాష్ట్రం కోసం ఈ ప్రాంతప్రజలు ఉద్యమాలు చేస్తే.. రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు సీమాంధ్రులు ఉద్యమాల పేరుతో అల్లర్లు సృష్టిస్తున్నారన్నారు. కాంగ్రెస్ అధిష్టానం సీమాంధ్రుల అల్లర్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదని, రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. 2001లో తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన నాటి నుంచే.. ఒక వేళ రాష్ట్రం ఏర్పాటైతే హైదరాబాద్ పరిస్థితి ఏమిటనే విషయంపై చర్చ చేపడితే బాగుండేదన్నారు. 
 
 కానీ నాటి పాలకులు తెలంగాణ రాష్ట్ర డిమాండ్‌ను పట్టించుకోకుండా ప్రత్యామ్నాయంగా మరొక రాజధాని అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా, నేడు రాజధాని విషయాన్ని జటిలం చేశారన్నారు. సీమాంధ్రలో కేవలం రాయలసీమ ప్రాంతంలోని కర్నూలు, అనంతపురంలలో మాత్రమే సమైక్యవాద ఉద్యమం బలంగా జరుగుతుంటే దానికి ప్రత్యేక కారణాలున్నాయన్నారు. రాష్ట్ర విభజన వల్ల రాయలసీమ ప్రాంతానికి నీళ్ల విషయంలో అన్యాయం జరుగుతుందని అక్కడి ప్రజలు ఉద్యమబాట పట్టారన్నారు. అయితే రాష్ట్రంలోని మేధావులంతా కూర్చొని సమగ్ర చర్చ జరిపి ఏ ప్రాంతానికి కూడా అన్యాయం జరగకుండా నీళ్లు, ఉద్యోగాలు తదితర సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. 
 
 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ద్వారా ఈ ప్రాంతంలో కాంగ్రెస్‌పార్టీకి పూర్వవైభవం వస్తుందని సంబరాలు జరుపుకుంటున్న కాంగ్రెస్ నాయకులను చూస్తుంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. మొదటి నుంచీ సీమాంధ్రులకు తొత్తులుగా వ్యవహరించిన కాంగ్రెస్ నాయకులకు రానున్న రోజుల్లో అధికారాన్ని అప్పజెపితే తిరిగి సీమాంధ్రులకే లాభం చేకూర్చే ప్రమాదం ఉందన్నారు.  తెలంగాణ ప్రాంతంలోని యువకులు, విద్యార్థులు, మేధావులు ఆలోచన చేసి ఆ దిశగా తెలంగాణ పునర్నిర్మాణానికి పాటుపడాలని కోరారు. ఈ సమావేశంలో పట్టణ జేఏసీ కన్వీనర్ కేఎల్‌ఎన్.రావు, టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు దొడ్డా నర్సింహారావు, జేఏసీ నాయకులు పోతబత్తిని శ్రీను, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement