తెలంగాణ అభివృద్ధికి...వైఎస్‌ఆర్ విశేష కృషి | Sakshi
Sakshi News home page

తెలంగాణ అభివృద్ధికి...వైఎస్‌ఆర్ విశేష కృషి

Published Mon, Oct 14 2013 3:29 AM

telangana Improvement , ysr` Substantial contribution

 తల్లాడ, న్యూస్‌లైన్: తెలంగాణ ప్రాంత అభివృద్ధికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి విశేష కృషి చేశారని వైఎస్‌ఆర్ సీపీ ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. పార్టీ తల్లాడ మండల స్థాయి కార్యకర్తల సమావేశం మండల కన్వీనర్ గొడుగునూరి లక్ష్మీరెడ్డి అధ్యక్షతన ఆదివారం స్థానిక బాలభారతి విద్యాలయంలో జరిగింది. పొంగులేటి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వైఎస్‌ఆర్ ఆనాడే అనుకూలంగా వ్యవహరించారని, ఈ ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక నిధులు కే టాయించారని చెప్పారు. ఆ మహానేత ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రజలు మరిచిపోలేదని అన్నారు.
 
 తెలంగాణలో వైఎస్‌ఆర్ సీపీ బలంగా ఉందని, రానున్న ఎన్నికల్లో ప్రజలు మరింతగా ఆదరిస్తార ని.. అండగా నిలబడతారని అన్నారు. రాబోయే జిల్లా-మండల పరిషత్, అసెంబ్లీ-పార్లమెంట్ ఎన్నికల్లో కూడా వైఎస్‌ఆర్ సీపీ ప్రభంజనం సృష్టిస్తుందని అన్నారు. ముందుగా వైఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహానికి, చిత్రపటానికి పొంగులేటి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సమావేశంలో పార్టీ సత్తుపల్లి నియోజకవర్గ సమన్వయకర్తలు నంబూరి రామలింగేశ్వరరావు, మట్టా దయానంద్ విజయ్‌కుమార్, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు తుమ్మలపల్లి రమేష్ పాల్గొన్నారు.
 
 తెలంగాణకు వైఎస్‌ఆర్ సీపీ వ్యతిరేకం కాదు
 మధిర : తెలంగాణకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదని ఆ పార్టీ నేత, ఖమ్మం పార్లమెంట్ నియోజవర్గ సమన్వయకర్త పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. మధిర పట్టణ, మండల ముఖ్య కార్యకర్తల సమావేశం ఆదివారం స్థానిక రెడ్డి గార్డెన్స్‌లో జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మహానేత వైఎస్‌ఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల అమలు.. వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి స్థాపించిన వైఎస్‌ఆర్ సీపీ ద్వారానే సాధ్యమవుతుందనే నమ్మకంతోనే ఆ పార్టీలో ప్రజలు చేరారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఈ పార్టీ(వైఎస్‌ఆర్ సీపీ)లో ఎవరూ చేరలేదని అన్నారు. తెలంగాణకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమంటూ కొన్ని పార్టీలు దుష్ర్పచారం చేస్తున్నాయని విమర్శించారు. 
 
 ‘మా పార్టీ తెలంగాణ ఇవ్వమంటే ఇస్తారా, వద్దంటే ఆగుతారా..?’ అని ప్రశ్నించారు.  తెలంగాణ ఇవ్వొద్దని జగనన్న ఏనాడూ చెప్పలేదని అన్నారు. తెలంగాణ తెచ్చినా, ఇచ్చినా తమ పార్టీ హర్షం వ్యక్తం చేస్తుందన్నారు. జైలు నుంచి జగన్ బయటకు వచ్చినప్పుడు జరిగిన భారీ ర్యాలీలో తెలంగాణ ప్రజలే పెద్ద సంఖ్యలో పాల్గొన్నారని చెప్పారు. తెలంగాణలో జగన్ పర్యటిస్తే ఆయన శక్తి ఎలాంటిదో, వైఎస్‌ఆర్ సీపీ ప్రభంజనమేమిటో తెలుస్తుందని అన్నారు. రాబోయే రోజుల్లో జగనన్న తెలంగాణ జిల్లాల్లో ఓదార్పు యాత్ర చేస్తారని, ఇది ఖమ్మం జిల్లా నుంచే ప్రారంభమవుతుందని చెప్పారు. వైఎస్‌ఆర్‌కు తెలంగాణలో కోట్లమంది అభిమానులు ఉన్నారని అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో వైఎస్‌ఆర్ సీపీ అభ్యర్థుల గెలుపును చూసి మిగిలిన పార్టీల నాయకులు ముక్కున వేలేసుకున్నారని, పార్టీ ప్రభంజనాన్ని చూసి అధికారులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. భట్టి ఎంత బలవంతుడైనప్పటికీ.. వైఎస్‌ఆర్ సీపీ ప్రభంజనంలో కొట్టుకుపోవాల్సిందేనని అన్నారు. 
 
 అధికారాన్ని అడ్డుపెట్టుకుని తమ (వైఎస్‌ఆర్ సీపీ) పార్టీ నాయకులు, కార్యకర్తలను బెదిరించేందుకు చేసే ప్రయత్నాలు వృధా ప్రయాసేనని అన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా నాయకుడు అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ మెండెం జయరాజు, సేవాదళ్ రాష్ట్ర కమిటీ సభ్యుడు దారెల్లి అశోక్, మండల-పట్టణ కన్వీనర్లు టివి.రెడ్డి, చల్లా శ్రీనివాసరెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు కత్తుల శ్యామలరావు, వీరయ్యచౌదరి, లకిరెడ్డి నర్సిరెడ్డి, ఎర్రుపాలెం-బోనకల్ మండల కన్వీనర్లు అంకసాల శ్రీనివాసరావు, చావా హన్మంతరావు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement