'కిరణ్పై తెలంగాణ ప్రభుత్వంతో విచారణ జరిపిస్తాం' | Sakshi
Sakshi News home page

'కిరణ్పై తెలంగాణ ప్రభుత్వంతో విచారణ జరిపిస్తాం'

Published Fri, Feb 21 2014 2:43 PM

'కిరణ్పై తెలంగాణ ప్రభుత్వంతో విచారణ జరిపిస్తాం' - Sakshi

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసినందుకు యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ పేరు ప్రజల గుండెలలో చిరస్థాయిగా నిలిచి ఉంటారని   ఆ  ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్సీలు అన్నారు. శుక్రవారం టి. కాంగ్రెస్ ఎమ్మెల్సీలు యాదవ రెడ్డి, భూపాల్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డిలు హైదరాబాద్లో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతంలోని  మొత్తం లోక్సభ, శాసనసభ స్థానాలలో విజయం సాధించి సోనియాకు కానుకగా ఇస్తామన్నారు.

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తీరుకు నిరసనగా రాజీనామా చేసిన కిరణ్పై ఎమ్మెల్సీలు ఈ సందర్భంగా  తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కిరణ్ తన పదవికి రాజీనామా చేసే ఆరునెలల ముందు నుంచి తీవ్ర అవినీతికి పాల్పడ్డారని వారు ఆరోపించారు. ఆయన అవినీతిపై విచారణ జరిపించాలని త్వరలో తెలంగాణ ప్రాంతంలో ఏర్పడే ప్రభుత్వాన్ని కోరతామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని ప్రభుత్వ శాఖలలో అవినీతిని తొలగిస్తామని స్పష్టం చేశారు.

 

రాష్ట్రాన్ని సాధించుకుని శనివారం ఢిల్లీ నుంచి హైదరాబాద్కు రాబోతున్న తెలంగాణ మంత్రులకు స్వాగతం పలికేందుకు భారీగా స్వాగత ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఎయిర్పోర్ట్ వరకు గన్పార్క్ వరకు భారీగా ర్యాలీ చేపడుతున్నట్లు టి.కాంగ్రెస్ ఎమ్మెల్సీలు యాదవ రెడ్డి, భూపాల్‌రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి వెల్లడించారు.

Advertisement
Advertisement