ఉత్కంఠ... | Sakshi
Sakshi News home page

ఉత్కంఠ...

Published Fri, Feb 14 2014 2:05 AM

telangana people tension on telangana bill

 సాక్షి ప్రతినిధి, ఖమ్మం: తెలంగాణ బిల్లు విషయంలో ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్న పరిణామాలు జిల్లా వాసుల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. ముఖ్యంగా బిల్లును లోక్‌సభలో పెట్టేందుకు గురువారం ప్రభుత్వం సిద్ధపడడం... అదే సమయంలో కొందరు పార్లమెంటు సభ్యులు వ్యవహరించిన తీరు.... బీజేపీ అగ్రనేతల మాటలు... కాంగ్రెస్ అధిష్ఠానం వేసిన అడుగులు.... ‘ఏ నిమిషానికి ఏమి జరుగునో’ అనే రీతిలో జరిగిన పరిణామాలు జిల్లా ప్రజలను టెన్షన్‌కు గురిచేశాయి.
 లోక్‌సభలో తెలంగాణ బిల్లు ప్రవేశపెడతారనే వార్తలు రావడంతో జిల్లా ప్రజలంతా గురువారం టీవీలకు అతుక్కుపోయారు.

ఉదయం సభ ప్రారంభమైనప్పటి నుంచి సోమవారానికి వాయిదా పడేవరకు జరిగిన పరిణామాలను ఆసక్తిగా గమనించారు.  సభలో నిరసన తెలపడంలో భాగ ంగా కొందరు ఎంపీలు చేసిన చర్యలు చర్చనీయాంశమయ్యాయి. దీనికి తోడు బీజేపీకి చెందిన అగ్రనేతలు చేసిన వ్యాఖ్యలపై కూడా తెలంగాణవాదులు చర్చించుకుంటున్నారు. ఢిల్లీలో జరుగుతున్న పరిణామాల క్రమంలో ఒక దశలో అయితే, తెలంగాణ బిల్లు గురువారమే లోక్‌సభ ఆమోదం పొందనుందన్న ఊహాగానం జిల్లా వ్యాప్తంగా వ్యాపించింది. దీంతో తెలంగాణవాదులంతా విజయోత్సవాలకు సిద్ధమయ్యారు. ముఖ్యంగా తెలంగాణ జేఏసీ, టీఆర్‌ఎస్ పక్షాలు జిల్లాలో ధూంధాం చేసేందుకు ప్రణాళికలు రచించాయి.

కానీ,  సభను సోమవారానికి వాయిదా వే స్తున్నట్లు స్పీకర్  మీరాకుమార్ ప్రకటించడంతో వారి ఆశలు నెరవేరలేదు. దీంతో మరో మూడు రోజుల పాటు ‘టీ’ బిల్లు ఏమవుతుందనే దాని కోసం ఎదురుచూపులు తప్పలేదు.  కాగా, లోక్‌సభలో తెలంగాణ బిల్లు ప్రవేశపెడుతున్న సమయంలో  కొందరు ఎంపీలు వ్యవహరించిన తీరుకు నిరసనగా జిల్లాలో పలు చోట్ల ఆందోళనలు జరిగాయి. దిష్టిబొమ్మల దహనాలు, ప్రదర్శనలు, ఉరి తీయడం లాంటి  నిరసనలతో తెలంగాణవాదులు తమ ఆకాంక్షను వెలిబుచ్చారు.

 కొనసాగుతున్న ‘ముంపు’ ఆందోళనలు
 తెలంగాణ బిల్లు మాట అటుంచితే, జిల్లాలోని పోలవరం ముంపు గ్రామాలను సీమాంధ్రలో కలపాలని కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆదివాసీ సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఈ ఆందోళనలు సాగుతున్నాయి. మహాజన సోషలిస్టు పార్టీ ఆధ్వర్యంలో భద్రాచలంలో దీక్షలు కొనసాగుతుండగా..., ఈనెల 15 నుంచి పాపికొండల విహార యాత్రకు బ్రేక్ వేయనున్నట్టు ఆదివాసీ సంఘాలు చెపుతున్నాయి. తమ నిరసనను తెలియజెప్పేందుకు ఎలాంటి ఉద్యమానికయినా సిద్ధపడతామని వారంటున్నారు.

అయితే, పోలవరం ముంపు కారణంగా జిల్లాలోని మండలాలను రద్దు చేయాలన్న ఆలోచన కేంద్రానికి లేదని, నియోజకవర్గాల మనుగడకు ఇబ్బంది లేకుండా మండలాలు అలానే ఉంటాయని, కేవలం ముంపునకు గురయ్యే గ్రామాలనే సీమాంధ్రలో కలపాలని బిల్లులో సవరణలు తెచ్చారన్న వార్తలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఓవైపు తెలంగాణ బిల్లు, మరోవైపు పోలవరం ముంపు ప్రాంతాలు ఆంధ్రలో విలీనం అంశాలు జిల్లా ప్రజల మెదళ్లలో పలు ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.

Advertisement
Advertisement