దద్దరిల్లిన సచివాలయం | Sakshi
Sakshi News home page

దద్దరిల్లిన సచివాలయం

Published Sat, Dec 14 2013 1:30 AM

దద్దరిల్లిన సచివాలయం


సాక్షి, హైదరాబాద్: ‘జై సమైక్యాంధ్ర... జై జై తెలంగాణ’ నినాదాలతో  రాష్ట్ర సచివాలయం మార్మోగింది. నిషేధాజ్ఞలు పక్కనపెట్టి ఒకవైపు సీమాంధ్ర ఉద్యోగులు మైకుల హోరుతో, మరోవైపు తెలంగాణ ఉద్యోగుల డప్పు చప్పుళ్లతో  రణ నినాదాలు చేశారు. అనుకోకుండా సమతా బ్లాక్ వద్ద ఎదురు పడ్డ ఇరు ప్రాంతాల ఉద్యోగులు కయ్యానికి కాలు దువ్వారు. ఒకరినొకరు తోసుకున్నంత పని చేశారు. వారిని అదుపు చేయడానికి పోలీసులు తీవ్రంగా చెమటోడ్చాల్సి వచ్చింది. రాష్ట్ర విభజనకు నిరసనగా సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. ఎల్ బ్లాక్ నుంచి సమతా బ్లాక్ వరకు ర్యాలీ కొనసాగింది.
 
 ఉద్యోగులు దిగ్విజయ్ దిష్టిబొమ్మను చేబూని ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘దిగ్విజయ్ బ్రోకర్’, ‘ఇటలీ సోనియా గో బ్యాక్.. గో బ్యాక్’ అంటూ మైకులో నినదించారు. సమతాబ్లాక్ వద్ద దిగ్విజయ్ దిష్టబొమ్మను దగ్ధం చేయబోగా పోలీసులు అడ్డుకున్నారు. దాంతో సీమాంధ్ర ఉద్యోగులు దిష్టిబొమ్మను కాళ్ల కింద వేసి తొక్కారు. చెప్పులతో కొట్టారు. తెలంగాణ ముసాయిదా బిల్లునూ చించేసి కాళ్లతో తొక్కారు. అదే సమయంలో మధ్యంతర భృతి విషయమై ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిని కలిసేందుకు సమతా బ్లాక్ వద్దకు వచ్చిన తెలంగాణ నేతలు శ్రీనివాస్‌గౌడ్, దేవీప్రసాద్ తదితరులు ‘జై తెలంగాణ’ అంటూ ప్రతి నినాదాలు చేశారు. సచివాలయ తెలంగాణ ఉద్యోగులు వారికి తోడయ్యారు. డప్పులు వాయిస్తూ నినాదాలు చేశారు. ‘తెలంగాణ బిల్లు మా 60 ఏళ్ల కల. ఆ బిల్లునే తొక్కుతారా?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పరస్పరం తోసుకున్నారు. పోలీసులు వారిని వారించి, సచివాలయేతర ఉద్యోగులైన శ్రీనివాస్‌గౌడ్, దేవీప్రసాద్‌లను అదుపులోకి తీసుకొని మెయిన్‌గేటు బయట వదిలేసి రావడంతో పరిస్థితి కాస్త అదుపులోకి వచ్చింది.
 
 కుసంస్కారం.. శ్రీనివాస్‌గౌడ్: పరిపాలన కేంద్రమైన సచివాలయంలోనే దిగ్విజయ్ వంటి నేత దిష్టిబొమ్మ తగలబెట్టడం సరికాదని శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. వేల ప్రాణాల త్యాగ ఫలితమైన తెలంగాణ బిల్లును తొక్కడం సీమాంధ్ర ఉద్యోగుల కుసంస్కారమని, ఇలాంటి వాటిని సహించేది లేదని అన్నారు.
 
 సీమాంధ్ర విద్యార్థులు తీవ్రవాదులుగా మారితే సర్కారుదే బాధ్యత: మురళీకృష్ణ


 టీ బిల్లును దొడ్డి దారిన తెచ్చారని సచివాలయ సీమాంధ్ర ఉద్యోగ సంఘ నేత మురళికృష్ణ మీడియాతో విమర్శించారు. బిల్లు ఆపేదాకా ఉద్యమిస్తామన్నారు. దిగ్విజయ్ ద్రోహి అని గుర్తించాం కాబట్టే ఆయన దిష్టిబొమ్మను తగులబెట్టజూశామని చెప్పారు. సీమాంధ్ర విద్యార్థులు తీవ్రవాదులుగా, నక్సలైట్లుగా మారితే కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు.
 

Advertisement
Advertisement