బాబూ.. బైబై | Sakshi
Sakshi News home page

బాబూ.. బైబై

Published Sat, Dec 14 2013 3:32 AM

బాబూ.. బైబై - Sakshi

సాక్షి, కరీంనగర్ : తెలంగాణపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ధోరణితో తెలుగు తమ్ముళ్లు సొంతదారులు వెతుక్కుంటున్నారు. రెండు రోజులుగా పార్టీలో సాగుతున్న పరిణామాలను చూసి ఒక్కొక్కరుగా బయటకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర విభజన విషయంలో చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరుపై పార్టీ ముఖ్యనేతలు సైతం గందరగోళానికి గురవుతున్నారు. తాము లేఖ ఇవ్వడం వల్లే కేంద్రం తెలంగాణ ప్రకటించిందని నియోజకవర్గాల్లో ప్రచారం చేయాలని ఇదివరకు చంద్రబాబు పార్టీ శ్రేణులకు సూచించారు.

ఇప్పుడు అటు లోకసభలో, ఇటు శాసనసభలో సమైక్యవాదాన్ని వినిపిస్తున్న నేతలను నిలువరించలేకపోతున్నారు. ప్రతిరోజు స్వయంగా చంద్రబాబు సైతం రాష్ట్ర విభజన రాజ్యంగ విరుద్ధంగా జరుగుతోందంటూ ప్రకటనలు చేస్తున్నారు. అధినేత వ్యవహార శైలితో తెలంగాణలో పార్టీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోతోందని నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో పార్టీ పరిస్థితి దారుణంగా మారిందని, అనేక కష్టాలు పడుతూ కేడర్‌ను కాపాడుకుంటూ వస్తుంటే ఈ ధోరణి మరింత దెబ్బ తీస్తోందని వారు వాపోతున్నారు.
 
 చంద్రబాబు తాజా వైఖరి సీనియర్ నేతలను సైతం ఆలోచనలో పడేసింది. ఒకరిద్దరు ముఖ్య నాయకులు మినహా మిగిలిన నాయకులు రాజకీయంగా సురక్షితమయిన దారులు వెతుక్కునే పనిలోపడ్డారు. జిల్లావ్యాప్తంగా చాలా మంది నాయకులు అదే బాటలో నడిచేందుకు సిద్ధమవుతున్నారు. చంద్రబాబుకు వీరవిధేయులు, ప్రత్యామ్నాయం లేని కొద్దిమంది నాయకులే జిల్లా పార్టీలో మిగులుతారని, వారు 2014 ఎన్నికలపై ఆశలు వదిలేసుకునే పార్టీలో కొనసాగాలని భావిస్తున్నారని అంటున్నారు.
 
 నాలుగేళ్ల నుంచి అదే తీరు..
 2009 తరువాత వివిధ సందర్భాల్లో టీడీపీ అధినేత తీరు వల్ల ఆ పార్టీ తెలంగాణవాదుల్లో విశ్వాసాన్ని నిలబెట్టుకోలేకపోయింది. ఫలితంగా ఉప ఎన్నికల్లో పార్టీ దారుణమైన ఫలితాలను చవిచూసింది. వేములవాడ, కరీంనగర్ ఎమ్మెల్యేలు సిహెచ్.రమేశ్‌బాబు, గంగుల కమలాకర్ టీడీపీని వదిలి టీఆర్‌ఎస్‌లోకి వెళ్లారు. జిల్లాలో చంద్రబాబు పాదయాత్ర చేస్తున్న సమయంలో కేంద్రం నిర్వహించిన అఖిలపక్ష భేటీలో తెలంగాణకు అనుకూలంగా ఉన్నట్టు చెప్పడం ద్వారా సహకార, పంచాయతీ ఎన్నికల్లో పరువు దక్కించుకోగలిగింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకోగానే చంద్రబాబు తిరిగి తీరు అనుమానాస్పదంగా మారింది. దేశ రాజధాని ఢిల్లీలో ఆయన ఆమరణదీక్షలో వినిపించిన వాదనలు పార్టీపై అపనమ్మకాన్ని మరింత పెంచాయి. అప్పటినుంచే పలువురు జిల్లా నాయకులు వలసల గురించి ఆలోచిస్తున్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement