ఇంగ్లిష్‌ మీడియంతో విద్యార్థులకు 'ఉజ్వల భవిత' | Sakshi
Sakshi News home page

ఇంగ్లిష్‌ మీడియంతో విద్యార్థులకు 'ఉజ్వల భవిత'

Published Mon, Nov 25 2019 5:25 AM

Telugu Academy Former President Prathap Reddy Interview With Sakshi

ఇంగ్లిష్‌ మీడియంతో మాతృభాష మృతభాషగా మారిపోతుందని, ప్రాభవం కోల్పోతుందనే వాదనల్లో అర్థం లేదు. ఒకటో తరగతి నుంచే ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టాలన్న ప్రభుత్వ నిర్ణయం అభినందనీయం. ఇది విద్యార్థుల ఉజ్వల భవిష్యత్‌ దిశగా ముందడుగు

సాక్షి, అమరావతి: ‘బాల్యంలోనే ఏ భాషపైన అయినా పట్టు సాధించవచ్చని భాషాశాస్త్రం వెల్లడిస్తోంది. పోటీ ప్రపంచంలో రాణించేందుకు ఇంగ్లిష్‌లో విషయ పరిజ్ఞానం తప్పనిసరి. ఈ నేపథ్యంలో ప్రాథమిక విద్య నుంచే ఇంగ్లిష్‌ మీడియంలో బోధించడం ఉత్తమం’ అని ప్రముఖ భాషా శాస్త్రవేత్త, తెలుగు అకాడమీ మాజీ అధ్యక్షుడు జె.ప్రతాప్‌రెడ్డి చెప్పారు. ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. మరిన్ని విషయాలు ఆయన మాటల్లోనే.. 

ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలకు.. 
రాష్ట్ర ప్రభుత్వం శాస్త్రీయంగా విశ్లేషించాకే ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. పోటీ ప్రపంచంలో ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలు దక్కించుకోవాలంటే ఇంగ్లిష్‌ మీడియంలో విద్యాభ్యాసం తప్పనిసరి. ప్రపంచంలో విషయ పరిజ్ఞానమంతా ఇంగ్లిష్‌లోనే ఉంది. బాల్యంలోనే ఏ భాషపైన అయినా పట్టు సాధించవచ్చని భాషాశాస్త్రం శాస్త్రీయంగా నిరూపించింది. కాబట్టి విద్యార్థులకు బాల్యం నుంచే ఇంగ్లిష్‌ నేర్పించాలి. ప్రాథమిక విద్యాభ్యాసం మాతృభాషలో సాగితేనే విద్యార్థుల మనోవికాసం సరిగా ఉంటుందనే వాదన సరికాదు. మాతృభాషలో ప్రాథమిక విద్యను అభ్యసించి ఉన్నత విద్యను ఇంగ్లిష్‌లో అభ్యసిస్తే విద్యార్థులు సరైన విజ్ఞానాన్ని పొందలేరు. 

కొంతమంది రాద్ధాంతానికి అర్థం లేదు 
ఇంగ్లిష్‌ మీడియంతో తెలుగు భాష ప్రాభవానికి, ఉనికికి ఎలాంటి ముప్పూ లేదు. ఒకటో తరగతి నుంచి ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెడితే తెలుగు భాష వైభవాన్ని కోల్పోతోందని కొందరు చేస్తున్న రాద్ధాంతానికి అర్థం లేదు. దీని వెనుక కార్పొరేట్‌ విద్యా సంస్థల హస్తం ఉంది. ఇంగ్లిష్‌ మీడియం లేదా వేరే మీడియం విద్యా బోధనతో ప్రపంచంలో ఒక మాతృభాష మృతభాషగా మారిపోయినట్టు ఇంతవరకు నిర్ధారణ కాలేదు. స్వాతంత్య్రానికి పూర్వం హైదరాబాద్‌ సంస్థానంలో 400 ఏళ్లకుపైగా ఉర్దూనే అధికారిక భాషగా, బోధన భాషగా సాగింది.

అందరూ ఉర్దూ మీడియంలోనే చదువుకునేవారు. అయితే.. హైదరాబాద్‌తో సహా తెలంగాణలో తెలుగు భాష ఉనికికి, సాహితీ వైభవానికి ఏ మాత్రం భంగం కలగలేదు. కర్ణాటకలో తుళు భాషకు లిపి లేదు.. దాన్ని కన్నడంలోనే రాస్తారు. అయినా ఆ భాష వందల ఏళ్లుగా ప్రాభవాన్ని కోల్పోకుండా ఉంది. అలాంటిది.. 2 వేల ఏళ్లకుపైగా చరిత్ర, ఘన సాహితీ వారసత్వం, ప్రపంచవ్యాప్తంగా 15 కోట్ల మందికి మాతృభాష అయిన తెలుగు ఉనికి, వైభవం ఎందుకు కోల్పోతుంది?.. అని ప్రతాప్‌రెడ్డి ప్రశ్నిస్తున్నారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement