టీడీపీ మైండ్‌గేమ్! | Sakshi
Sakshi News home page

టీడీపీ మైండ్‌గేమ్!

Published Wed, Jan 22 2014 3:38 AM

telugu desam mind game in praksam district

సాక్షి  ప్రతినిధి, ఒంగోలు: జిల్లాలో తమ పార్టీకి పట్టు ఏర్పడిందనే కల్పన ప్రజల్లో కల్పించేందుకు తెలుగుదేశం పార్టీ మైండ్‌గేమ్‌కు సిద్ధపడుతోంది. జిల్లాలో టీడీపీ హవా నడుస్తోందని, నెల రోజులుగా తమ పార్టీకి ఆదరణ పెరుగుతోందని పేర్కొనేలా ప్రజలను మభ్య పెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. పార్టీ పరిస్థితి నానాటికీ దిగజారుతున్నా.. ప్రజలను తమవైపుకు తిప్పుకునేందుకు వ్యూహ రచన చేస్తున్నట్లు సమాచారం.  వైఎస్‌ఆర్ కాంగ్రె స్ పార్టీ చేపడుతున్న గడప గడపకు వైఎస్‌ఆర్ సీపీ  కార్యక్రమాన్ని కాపీ కొడుతూ, ఇంటింటికీ తెలుగు దేశం పార్టీ అనే నినాదంతో ప్రచారం ప్రారంభించింది.  పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈ ప్రచారానికి రాష్ట్ర స్థాయిలో పిలుపునిచ్చినా, జిల్లా నాయకుల్లో స్పందన అంతంత మాత్రంగానే కనిపిస్తోంది.  కనిగిరి, గిద్దలూరు, యర్రగొండపాలెం మినహా మిగిలిన ప్రాంతాల్లో మొక్కుబడిగా ఈ  కార్యక్రమం జరుగుతోంది. అయినప్పటికీ ‘కింద పడ్డా పై చేయి మాదే’ అన్న చందాన తమ పార్టీకి గొప్ప ఊపు వచ్చిందని ప్రచారం చేసుకుంటున్నారు.
 
 చంద్రబాబు నాయుడు జిల్లాకు వచ్చి వెళ్లినా, కార్యకర్తల్లో మునుపటి ఉత్సాహం లేదనే విషయం స్పష్టమవుతోంది. అయితే ఈ సారి కచ్చితంగా అధికారంలోకి రాని పక్షంలో పార్టీ ఉనికి కోల్పోతుందని భావించిన  అధిష్టానం ఈ  మైండ్‌గేమ్‌కు శ్రీకారం చుట్టింది. ఈమేరకు  జిల్లా నాయకులకు సూచనలిచ్చింది.  ఇందులో భాగంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులను తమ పార్టీలో చేర్చుకోవాలని సూచించినట్లు సమాచారం. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చే అవకాశం లేక పోవడంతో, పూర్తి స్థాయిలో కాంగ్రెస్ నాయకులపై దృష్టి సారించింది. కాంగ్రెస్ రాష్ట్రంలో కనుమరుగయ్యే అవకాశం ఉండటంతో,  ఆ పార్టీ నేతలు కూడా ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఖాళీ లేకపోవడంతో, తెలుగుదేశం వైపు చూస్తున్నారు. అటువంటి నాయకులను పార్టీలో చేర్చుకుని, తమకే విజయావకాశాలున్నాయంటూ ప్రజలను మభ్యపెట్టే ఆలోచనలో  టీడీపీ ఉంది.
 
 ఎమ్మెల్యేలపైనే గురి..
 ముఖ్యంగా జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా ఉన్న వారిని తమ పార్టీలోకి తీసుకొచ్చేందుకు టీడీపీ నాయకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సంతనూతలపాడు, యర్రగొండపాలెం, చీరాల ఎమ్మెల్యేలను లాగే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. అదే విధంగా ఇతర నియోజకవర్గాల్లోని కాంగ్రెస్ నాయకులకు సీటు ఆశ చూపించి, తమ వైపుకు లాగే  ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం. దీంతో కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇన్నాళ్లు జెండాలు మోసిన తమను పక్కన పెట్టి,  ఇతర పార్టీలో నుంచి వచ్చే వారికి అగ్రతాంబూలం ఇవ్వడాన్ని కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారు. పదేళ్లుగా పార్టీ అధికారంలో లేకపోయినా జెండాలు మోసి, పార్టీ ఉనికి కాపాడుతూ వస్తున్న తమను కరివేపాకులా ఉపయోగించుకోవడంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. వీరిని బుజ్జగించేందుకు బడా నాయకులు శతవిధాలా ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement