Sakshi News home page

గిరిజన హక్కులు కాలరాస్తున్న టీడీపీ

Published Mon, Jun 23 2014 1:57 AM

గిరిజన హక్కులు కాలరాస్తున్న టీడీపీ

ఒంగోలు అర్బన్ : ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ గిరిజనుల హక్కులు కాలరాస్తోందని గిరిజన విద్యార్థి సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షుడు వి.శంకర్‌నాయక్ విమర్శించారు. ఈ మేరకు ఆయన స్థానిక మీడియా కెమెరామెన్ అసోసియేషన్ హాలులో ఆదివారం విలేకరులతో మాట్లాడారు.

రాష్ట్రం విడిపోయిన తర్వాత జరిగిన మొట్టమొదటి సాధారణ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ తరఫున ఆరుగురు గిరిజనులు ఎమ్మెల్యేలుగా ఎన్నికకాగా టీడీపీలో ఒకే ఒక్కరు ఎన్నిక కావడం.. ఆయనకూ మంత్రి పదవి కేటాయించకపోవడం చంద్రబాబు నిరంకుశత్వానికి నిదర్శనమని శంకర్‌నాయక్ ధ్వజమెత్తారు. చంద్రబాబు ఇప్పటికైనా కళ్లు తెరిచి టీడీపీ తరఫున గెలుపొందిన పోలవరం ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే 6శాతం ఉన్న గిరిజనుల రిజర్వేషన్లను 12 శాతానికి పెంచాలని కోరారు.
 
ఎర్రగొండపాలెం సమీపంలో గిరిజన విద్యాలయం ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. రాష్ట్ర జనాభాలో కేవలం 1శాతం ఉన్న వైశ్యులకు మంత్రి పదవి ఇచ్చి 5శాతం ఉన్న గిరిజనులకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. టికెట్ల కేటాయింపులో గిరిజనులకు వైఎస్సార్ సీపీ అధిక ప్రాధాన్యం ఇచ్చిందని గుర్తు చేశారు. గిరిజనులను చిన్న చూపు చూస్తే సహించేది లేదని శంకర్‌నాయక్ గట్టిగా హెచ్చరించారు. సమావేశంలో సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్.సునీల్‌కుమార్ నాయక్, రామకృష్ణ, శివప్రసాద్, రామకృష్ణ నాయక్, వెంకట రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement