మొదటి ముద్దాయి టీడీపీనే! | Sakshi
Sakshi News home page

మొదటి ముద్దాయి టీడీపీనే!

Published Sun, Dec 1 2013 2:00 AM

మొదటి ముద్దాయి టీడీపీనే! - Sakshi

బాబు హయాంలో ప్రాజెక్టులు పూర్తి అయి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు
బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్‌ది పక్షపాత ధోరణి  మైసూరారెడ్డి ధ్వజం
కడప, న్యూస్‌లైన్:
రాష్ట్రంలో మిగులు జలాలపై ఆధారపడి నిర్మించిన ప్రాజెక్టులకు బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు జరపకపోవడానికి ప్రధాన కారణం తెలుగుదేశం పార్టీయేనని వైఎస్‌ఆర్‌సీపీ రాజకీయ వ్యవ హారాల కమిటీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి ఆరోపించారు. 2004 కన్నా ముందు అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం అప్పుడే ప్రాజెక్టులు నిర్మించి ఉంటే ఇప్పుడు ట్రిబ్యునల్‌లో నీటి కేటాయింపులు జరిగేవన్నారు. కర్ణాటక, మహారాష్ట్రలు అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తుంటే అప్పటి టీడీపీ ప్రభుత్వం ఆపలేకపోయిందని విమర్శించారు. ఇప్పుడు ఆ రాష్ట్రాలు నిర్మించిన ఆల్మట్టి సహా 12 అక్రమ ప్రాజెక్టులకు ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు జరిపి వాటిని రెగ్యులరైజ్ చేసిందని మైసూరారెడ్డి పేర్కొన్నారు. కడపలోని వైఎస్ గెస్ట్‌హౌస్‌లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు ఆంధ్రప్రదేశ్‌కు గొడ్డలి పెట్టని, ముఖ్యంగా రాయలసీమ, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలకు శాశ్వతంగా అన్యాయం జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం 70 శాతం పూర్తయిన ప్రాజెక్టులకే నీటి కేటాయింపులు జరిపారని, దాంతో మన ప్రభుత్వం వివిధ ప్రాజెక్టులపై ఇప్పటివరకు ఖర్చు పెట్టిన రూ.40 వేల కోట్లు నిరర్థకమయ్యాయన్నారు. మధ్యంతర తీర్పు అనంతరం ట్రిబ్యునల్ పక్షపాత వైఖరిని కేంద్రం దృష్టికి తీసుకెళ్లడంతో రాష్ట్రప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆయన ధ్వజమెత్తారు. దీనిపై బాధ్యత గల ప్రతిపక్షంగా వ్యవహరించాల్సిన తెలుగుదేశం పార్టీ కూడా తమ తప్పులు కప్పిపుచ్చుకుంటూ ఇతరులపై బురద జల్లుతోందని మండిపడ్డారు. టీడీపీ తొమ్మిదేళ్ల పాలనలో గాలేరు-నగరికి రూ.17 కోట్లు, హంద్రీ-నీవాకు రూ.13 కోట్లు, వెలిగొండకు రూ. 13 కోట్లు, కల్వకుర్తికి రూ.12 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, నెట్టెంపాడుకు ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదన్నారు. కానీ, వైఎస్ హయాంలో 2004 నుంచి 2009 వరకు గాలేరు-నగరికి రూ. 4 వేల కోట్లు, హంద్రీ-నీవాకు రూ.4 వేల కోట్లు, వెలిగొండకు రూ. 1443 కోట్లు, నెట్టెంపాడుకు రూ. 1124 కోట్లు, కల్వకుర్తికి రూ. 1930 కోట్లు ఖర్చు చేశారని వివరించారు. గాలేరు-నగరి ప్రాజెక్టు గ్రావిటీ ప్రకారం ప్రవహించే ప్రాజెక్టు అని, 1994లో ఆ ప్రాజెక్టుకు టెండర్లు పిలిచి పనులు అప్పగించినా ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఆ టెండర్లను రద్దు చేసిందని గుర్తుచేశారు. ట్రిబ్యునల్ తీర్పుపై ప్రభుత్వమే సుప్రీం కోర్టుకు వెళ్లాల్సి ఉందని, లేనిపక్షంలో రాష్ట్ర ప్రాజెక్టులు స్మారక చిహ్నాలుగా మిగిలిపోతాయన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీసీ జిల్లా కన్వీనర్ కె.సురేష్‌బాబు, డీసీసీబీ చైర్మన్ ఇరగంరెడ్డి తిరుపాల్‌రెడ్డి, కడప సమన్వయకర్త అంజాద్‌బాషా, కమలాపురం సమన్వయకర్త దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, హఫీజుల్లా పాల్గొన్నారు.
 చంద్రబాబు వైఖరి వల్లనే: సీఎంగా పనిచేసినప్పుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అనుసరించిన వైఖరి వల్లనే జస్టిస్ బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు మన రాష్ట్రానికి ప్రతికూలంగా వచ్చిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులు వాసిరెడ్డి పద్మ, గట్టు రామచంద్రరావులు విమర్శించారు. వ్యవసాయం దండగ అంటూ చంద్రబాబు తన హయాంలో ఒక్క ప్రాజెక్టు కూడా నిర్మించకపోవడం వల్లే కృష్ణా మిగులు జలాల విషయంలో రాష్ట్రం తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చిందన్నారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం వారు మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డిపై బురదజల్లేందుకు ప్రయత్నించడం ఆయన కుసంస్కారాన్ని తెలియజేస్తోందన్నారు.


వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యులుగా ముగ్గురి నియామకం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యనిర్వాహక మండలిలో సభ్యులుగా కొత్తగా ఒ.వి.రమణ (తిరుపతి), పాపకన్ను రాజశేఖరరెడ్డి(వెంకటగిరి), బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి(ఆత్మకూరు)ని నియమించారు. ఈ విషయాన్ని పార్టీ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది.
 

Advertisement
Advertisement