రాయలసీమ ఎత్తిపోతలకు నేడు టెండర్‌ నోటిఫికేషన్ | Sakshi
Sakshi News home page

రాయలసీమ ఎత్తిపోతలకు నేడు టెండర్‌ నోటిఫికేషన్

Published Mon, Jul 20 2020 4:16 AM

Tender notification for Rayalaseema lift irrigation works On 20th July - Sakshi

సాక్షి, అమరావతి: రాయలసీమ ఎత్తిపోతల పనులకు ఈపీసీ (ఇంజనీరింగ్‌ ప్రొక్యూర్‌మెంట్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్‌) విధానంలో సోమవారం టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేయాలని జలవనరుల శాఖ నిర్ణయించింది. జ్యుడిషియల్‌ ప్రివ్యూ ఆమోదించిన ప్రతిపాదనలతో.. 30 నెలల్లో పనులను పూర్తి చేయాలనే షరతుతో టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేయనుంది. ఈ పనులకు రూ.3,278.18 కోట్లను ఐబీఎం(అంతర్గత అంచనా విలువ)గా నిర్ణయించింది.

సోమవారం ఉదయం 11 గంటల నుంచి ఈ–ప్రొక్యూర్‌మెంట్‌ వెబ్‌సైట్‌ నుంచి టెండర్‌ డాక్యుమెంట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అదే రోజు నుంచి షెడ్యూళ్లు దాఖలు చేసుకోవచ్చు. టెండర్‌ షెడ్యూళ్లు దాఖలు చేసే వారు రూ. 10 కోట్లను ఎర్నెస్ట్‌ మనీ డిపాజిట్‌ (ఈఎండీ)గా చెల్లించాలి.
– ఆగస్టు 3 మధ్యాహ్నం మూడు గంటల వరకూ టెండర్‌ డాక్యుమెంట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అదే రోజున ఐదు గంటల్లోగా షెడ్యూళ్లను దాఖలు చేయాలి.
– ప్రీ–బిడ్‌ సమావేశాన్ని ఈనెల 27న నిర్వహిస్తారు. టెండర్‌లో పాల్గొనే కాంట్రాక్టర్ల సందేహాలను జలవనరుల శాఖ అధికారులు నివృత్తి చేస్తారు.
– వచ్చే నెల 4న ఉదయం 11 గంటలకు సాంకేతిక బిడ్‌ను, 7న ఉదయం 11 గంటలకు ఆర్థిక బిడ్‌ను తెరుస్తారు.
– ఆర్థిక బిడ్‌లో తక్కువ ధర(ఎల్‌–1)కు కోట్‌ చేసిన కాంట్రాక్టర్‌ పేర్కొన్న మొత్తాన్నే కాంట్రాక్టు విలువగా పరిగణించి.. 10న ఉదయం 11 గంటల నుంచి ఈ–ఆక్షన్‌ (రివర్స్‌ టెండరింగ్‌) నిర్వహిస్తారు. తక్కువ ధరకు కోట్‌ చేసిన (ఎల్‌–1) కాంట్రాక్టర్‌ను ఖరారు చేసి.. వీటిని ఎస్‌ఎల్‌టీసీ (స్టేట్‌ లెవల్‌ టెక్నికల్‌ కమిటీ)కి పంపుతారు. వాటిని ఎస్‌ఎల్‌టీసీ పరిశీలించి ఆమోదించాక కాంట్రాక్టు ఒప్పందం చేసుకోవడానికి అనుమతి ఇస్తుంది.  

Advertisement
Advertisement