స్వధర్మ సంస్థాపనార్థాయ..! | Sakshi
Sakshi News home page

స్వధర్మ సంస్థాపనార్థాయ..!

Published Tue, Jan 21 2014 1:44 AM

Tenders will be finalized today

  • రూ.1.59 కోట్ల అభివృద్ధి నిధుల పంపకానికి పందేరం
  •  పనుల కోసం వర్గపోరు
  •  కాంగ్రెస్, టీడీపీ అనుయాయులకే అవకాశం!
  •  నేడు ఖరారు కానున్న టెండర్లు
  •  
    సాక్షి, మచిలీపట్నం : ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పనులు చేసి ప్రజలను బుట్టలో వేసుకుందామనుకున్న అధికార పార్టీ పాచిక పారడంలేదు. అభివృద్ధి పనుల మాటెలా ఉన్న టెండర్లు దక్కించుకుని నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని కాంగ్రెస్ శ్రేణులు పంతాలకు పోతున్నారు. ఫలితంగా పెడన మున్సిపాలిటీలో గత కొద్దిరోజులుగా సాగుతున్న నిధులు, పనుల పంపిణీ వివాదం కొలిక్కిరావడం లేదు. పనుల విషయంలో సాగుతున్న వివాదంపై ఇటీవల ‘పంచుకుందాం... రా’ అనే శీర్షికన ‘సాక్షి’ ప్రత్యేక కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టెండర్ల ప్రక్రియను కొంతకాలం సాగదీసి పార్టీలో వివాదాలను సద్దుమణిగేలా చేయాలన్న మాజీ ఎమ్మెల్యే బూరగడ్డ వేదవ్యాస్ ఎత్తుగడ ఫలించడం లేదు. రెండు పర్యాయాలుగా టెండర్లకు గడువుపెంచుతూ వచ్చిన అధికారు లు రూ.1.59కోట్ల అభివృద్ధి పనులకు మంగళవారం టెండర్లను ఖరారు చేయనున్నారు.
     
    లోపాయికారీ ఒప్పందాలు?
     
    పెడన మున్సిపాలిటీలో పనుల పంపకం వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. మున్సిపాలిటీ పరిధిలోని పనులు దక్కించుకునేందుకు ఇప్పటికే కాంగ్రెస్, టీడీపీ వర్గీయులు లోపాయికారీ ఒప్పందాలకు వచ్చినట్టు సమాచారం. పనుల్లో టీడీపీకి వాటా ఇవ్వడాన్ని పెడన కాంగ్రెస్‌లో మరో వర్గం నేతలు వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు బందరుకు చెందిన పలువురు కాంట్రాక్టర్లు వైఎస్సార్‌సీపీకి అనుకూలమనే సాకుతో వారికి ఈ టెండర్లు దక్కకుండా కాంగ్రెస్ నేతలు అడ్డుపుల్ల వేస్తున్నట్టు సమాచారం. బందరుకు చెందిన పలువురు కాంట్రాక్టర్లు పెడన మున్సిపాలిటీలో చేపట్టే పనులకు టెండర్లు వేశారు. వాటిని ఖరారు చేస్తే వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఉండేవారికి మేలు కలుగుతుందన్న దుగ్ధతో ఏకంగా అ పనులనే రద్దు చేసేందుకు మున్సిపల్ అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం.
     
    వైఎస్సార్‌సీపీకి అనుకూలురనే సాకుతో బందరుకు చెందిన కాంట్రాక్టర్లకు దక్కకుండా మంచినీటి పైపులైను పనులను టెండర్ల నుంచి తొలగించినట్టు తెలిసింది. అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు ప్రతిపాదించిన రియల్ ఎస్టేట్‌కు వెళ్లే రోడ్డు, గతంలో వేసిన రహదారిపైనే మరో రోడ్డు వేసేందుకు బంగ్లా స్కూల్ రోడ్డు, నాలుగో వార్డులో ఉన్న రోడ్డు వంటి ప్రతిపాదనలు టెండర్లలో అలానే ఉంచడం గమనార్హం. 5, 10 వార్డుల్లో వివాదంలో ఉన్న రోడ్లు కూడా ప్రతిపాదించారు. అవుట్‌లెట్ సౌకర్యం లేని ప్రాంతాల్లో సుమారు రూ.7 లక్షలతో డ్రెయిన్ల నిర్మాణానికి కూడా ప్రతిపాదనలు చేయడం శోచనీయం.
     
    చక్రం తిప్పుతున్న ముఖ్య అనుచరుడు...
     
    పెడన మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న పనుల రాజకీయంలో కీలకనేత ముఖ్య అనుచరుడు చక్రం తిప్పుతున్నారు. ఆయా కాంట్రాక్టర్ల నుంచి పలు పనులకు కేటాయించిన నిధుల్లో ఐదు శాతం వసూళ్లు చేసేందుకు రంగం సిద్ధమైనట్లు తెలిసింది. ఈ పనులను కట్టబెట్టేందుకు.. బందరు, పెడన కాంట్రాక్టర్ల నడుమ వివాదాన్ని సర్దుబాటు చేసేందుకు ఆ ముఖ్య అనుచరుడు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన సూచన మేరకు రెండు పర్యాయాలు వాయిదాలు వేస్తూ వచ్చారు. మున్సిపల్ అధికారులు సైతం టెండర్లు రద్దు చేయాలన్న కాంగ్రెస్ నేతల ఒత్తిడిని పట్టించుకోకుండా తమ అనుభావాన్ని రంగరించి టెండర్ల ప్రక్రియను గడువు పొడిగిస్తూ వచ్చారు. ఎట్టకేలకు టెండర్ల ఖరారు గడువు సమీపించడంతో అధికార పార్టీలో వివాదాలు రాజుకుంటున్నాయి.
     

Advertisement
Advertisement