ముందున్నది అప్పుల ఊబే! | Sakshi
Sakshi News home page

ముందున్నది అప్పుల ఊబే!

Published Mon, Feb 24 2014 1:12 AM

ముందున్నది అప్పుల ఊబే! - Sakshi

ఇరు రాష్ట్రాలకూ పరీక్షా సమయమిది
 నిర్వహణ వ్యయమే తడిసిమోపెడు
  అభివృద్ధి ప్రణాళికకు మిగిలేది అరకొరే
   శాఖలను, విభాగాలను కుదించుకోవాల్సిందే!
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో పాలకులు ముందుచూపుతో వ్యవహరించి జాగ్రత్త పడకపోతే రెండు రాష్ట్రాలూ అప్పుల ఊబిలో కూరుకుపోతాయంటూ ఉన్నతాధికార వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. తెలంగాణ, సీమాంధ్ర రాష్ట్రాలకు నిర్వహణ వ్యయం తడిసిమోపెడు అవుతుందని ఆర్థిక శాఖ అధికారులు గుర్తించారు. ఫలితంగా విభజన తర్వాత కొన్నేళ్ల పాటు ఇరు రాష్ట్రాల ఆదాయంలో అత్యధిక మొత్తం ప్రభుత్వ నిర్వహణ వ్యయానికే సరిపోతుందని, అభివృద్ధికి ప్రాణ సమానమైన ప్రణాళికకు పెద్దగా నిధులు మిగలవని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్ర బడ్జెట్‌లో మూడింట రెండొంతులు నిర్వహణకు, ఉద్యోగుల జీతభత్యాలకే పోతోంది. ‘‘ఈ దృష్ట్యా విభజన తర్వాత రెండు ప్రభుత్వాలూ నిర్వహణ వ్యయాన్ని నియంత్రించడంపై దృష్టి పెట్టాలి. అలాగాక సమైక్య రాష్ట్రంలో ఉన్న శాఖలు, కార్పొరేషన్లన్నీ కొనసాగాల్సిందేననుకుంటే కొన్నేళ్ల పాటు ఇరు రాష్ట్రాలూ
 
 తీవ్ర ఆర్థిక ఇబ్బందుల పాలవుతాయి. అప్పుల ఊబిలోకీ కూరుకుపోతాయి’’ అంటున్నారు. రెండు రాష్ట్రాలకూ వారు చెబుతున్న జాగ్రత్తలివే...
 
 శాఖలు, కార్పొరేషన్లు, ఉద్యోగులను జనాభా ప్రాతిపదికన  రెండు రాష్ట్రాలకు కేంద్రం పంపిణీ చేస్తుంది. కానీ తమకు ఎన్ని శాఖలు, ఏ కార్పొరేషన్లు అవసరమో, ఏవి అనవసరమో ఇరు రాష్ట్రాలూ ఆలోచించుకోవాలి. ఉదాహరణకు తెలంగాణకు ఓడ రేవుల శాఖ అనవసరం
 
 కొత్త సహకార చట్టం ప్రకారం సహకార సంస్థలు స్వతంత్రంగా పనిచేస్తున్నాయి. కానీ ఆ సంస్థల్లో సిబ్బంది ఎక్కువగా ఉన్నారు. వారిని తగ్గించుకోవచ్చు. పైగా సహకార శాఖను ప్రభుత్వం నిర్వహించాల్సిన అవసరం ఉండదు
 
 ఆర్థిక శాఖలో ప్రస్తుతం ఐదుగురు ముఖ్య కార్యదర్శులున్నారు. రెవెన్యూ శాఖలో ముగ్గురు, మున్సిపల్ శాఖలో ఇద్దరున్నారు. కొత్త రాష్ట్రాలకు అన్ని పోస్టుల అవసరముండదు
 
 ఏ ప్రయోజనమూ లేని ప్రభుత్వ రంగ సంస్థలు కొన్నున్నాయి. వాటిలో మరీ అవసరమనుకున్న వాటిని ఉంచి మిగతా వాటిని వదిలించుకోవాలి
 
 ప్రస్తుతం పలు శాఖలు, విభాగాల్లో సిబ్బంది అవసరానికి మించి ఉన్నారు. అవసరమైన దానికంటే తక్కువ సిబ్బంది ఉన్న శాఖల్లోకి వారిని సర్దాలి
 
 జనాభా పెరుగుదల గణనీయంగా తగ్గిపోతోంది. 2.1 శాతం ఉండాల్సిన సంతానోత్పత్తి ప్రస్తుతం రాష్ట్రంలో 1.75 శాతానికి పడిపోయింది. దీనివల్ల మున్ముందు ఎక్కువ పాఠశాలల అవసరం ఉండదు. కాబట్టి ఇప్పట్లా పేటకో పాఠశాలను కొనసాగించడం అనవసరం. అలాగాకుండా నిజంగా అవసరమైన చోటే మంచి స్కూలు ఏర్పాటు చేయాలి
 
 వృద్ధుల సంఖ్య కూడా పెరుగుతోంది. 60 ఏళ్లు పైబడిన వారి సంఖ్య పదేళ్ల క్రితం జనాభాలో వారు 4 శాతం ఉండేది. ఇప్పుడది రెట్టింపైంది. అంటే 8 శాతానికి పెరిగింది. కాబట్టి ఆ మేరకు పింఛన్ భారం, ఆరోగ్య సేవల వ్యయం వంటివీ పెరుగుతాయి. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకోవాలి.
 

Advertisement
Advertisement