విజయోస్తు! | Sakshi
Sakshi News home page

విజయోస్తు!

Published Thu, Mar 26 2015 2:23 AM

విజయోస్తు!

నేటి నుంచి టెన్త్ పబ్లిక్ పరీక్షలు ఏర్పాట్లు పూర్తి
ఏవైనా ఫిర్యాదులుంటే 08572-229189కు ఫోన్ చేయండి
20 సమస్యాత్మక కేంద్రాల్లో సిట్టింగ్ స్క్వాడ్
విలేకరుల సమావేశంలో డీఈవో శామ్యూల్

 
చిత్తూరు(ఎడ్యుకేషన్): పది విద్యార్థులకు అంతా మంచే జరగాలని డీఈవో శామ్యూల్ ఆకాంక్షించారు.  జిల్లాలోని 270 కేంద్రాల్లో గురువారం నుంచి జరగనున్న పదో తరగతి పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. పదో తరగతి పరీక్షల నిర్వహణపై డీఈవో కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈసారి ఎలాంటి మాస్‌కాపీయింగ్‌కు తావులేకుండా పరీక్షలను నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు స్పష్టం చేశారు. జిల్లాలో మొత్తం 56,607మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నట్లు తెలిపారు. వీరిలో 28,672 బాలురు, 2,635 బాలికలు రెగ్యులర్‌గా, 1,300 మంది విద్యార్థులు ప్రైవేటు అభ్యర్థులుగా పరీక్ష రాయనున్నట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద తాగునీటి సౌకర్యం, ప్రాథమిక వైద్య సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

అలాగే పరీక్ష కేంద్రాలన్నింటిలోనూ డెస్కులపైనే విద్యార్థులు పరీక్ష రాయనున్నట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద 144సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. అలాగే జంబ్లింగ్ విధానంలోనే పరీక్షలు జరుగుతాయన్నారు. 2,700 మంది ఇన్విజిలేటర్లను నియమించామని, విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి, పరీక్ష హాలులోకి పంపాలని సూచించారు. జిల్లాలో సమస్యాత్మకమైన 20 పరీక్ష కేంద్రాల్లో సిట్టింగ్ స్క్వాడ్‌ను ఏర్పాటు చేశామన్నారు. పరీక్షలు కట్టుదిట్టంగా జరిపేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు సహకరించాలన్నారు. ఏవైనా ఫిర్యాదులున్నా, ఎక్కడైనా కాపీయింగ్ జరుగుతున్నట్లు పక్కా సమాచారం ఉంటే 08572-229189 నంబర్‌కు ఫోన్‌చేస్తే డీఈవో కార్యాలయ సిబ్బంది స్పందిస్తారని స్పష్టం చేశారు.

ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి

విద్యార్థులు పరీక్ష ప్రారంభానికి అరగంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని కోరారు. స్కూల్ యూనిఫామ్ ధరించి పరీక్ష హాజరు కావద్దని తెలిపారు. ప్రతిభ కలిగిన విద్యార్థులకు అన్యాయం జరగకుండా ఈసారి పరీక్షలు నిష్పక్షపాతంగా జరుపుతామన్నారు. పరీక్ష హాలులో మాస్‌కాపీయింగ్‌కు ఇన్విజిలేటర్ల సహకారం ఉందని నిర్ధారణకు వస్తే ఇన్విజలేటర్లపై చర్యలు తప్పవన్నారు. ఉదయం 8.30 గంటలకు ప్రశ్నపత్రం సెట్ నంబరును తెలుపుతామని, ఆ తర్వాత నిర్దేశిత పోలీస్‌స్టేషన్ల నుంచి ప్రశ్న పత్రాలను పోలీసు బలగాల మధ్య తీసుకెళ్లాలన్నారు. ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. పరీక్షల చీఫ్ సూపర్‌వైజర్లు, డీవోలు  విధిగా ఉదయం 9.15 నుంచి 9.30 గంటల మధ్య మాత్రమే ప్రశ్నపత్రాల బండిళ్లను విప్పాలని సూచించారు.

ఆలస్యానికి ఏదైనా బలమైన కారణం చూపితే మొదటి రెండు పరీక్షలకు మాత్రం పరీక్ష ప్రారంభమైన 15 నిమిషాల వరకు విద్యార్థులను పరీక్ష రాసేందుకు అనుమతిస్తామన్నారు. జిల్లాలో 68 సీ సెంటర్లు(పోస్టాఫీస్, పోలీస్‌స్టేషన్ లేని కేంద్రాలు) ఉన్నాయని, సమీపంలోని పోస్టాఫీసులో వీరు జవాబుపత్రాలను చేర్చాలని సూచించారు. ఏప్రిల్ 2వ తేదీ మహావీర్ జయంతి సందర్భంగా పోస్టాఫీసులకు సెలవని, ఆ రోజు జరగనున్న గణితం మొదటి పేపరు జవాబు పత్రాలను సంబంధిత పోలీస్‌స్టేషన్లలో భద్రపరచాలని, 3వ తేదీ గుడ్‌ఫ్రైడే సందర్భంగా పరీక్ష లేదని, 4వ తేదీ జరగనున్న గణితం పేపరు-2 పరీక్ష జవాబు పత్రాలతోపాటు పోలీస్‌స్టేషన్లో భద్రపరచిన గణితం మొదటి పేపర్ జవాబు పత్రాలను పోస్ట్‌ఫీసులకు చేర్చాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా అబ్జర్వర్ రఘుకుమార్, పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ నిరంజన్‌కుమార్ పాల్గొన్నారు.
 
 
 

Advertisement
Advertisement