అట్టుడికిన సచివాలయం | Sakshi
Sakshi News home page

అట్టుడికిన సచివాలయం

Published Wed, Dec 11 2013 2:11 AM

Tention created at secreteriate

నాలుగు గంటల పాటు సమతా బ్లాక్ వద్ద  ధర్నా నిర్వహించిన సీమాంధ్ర ఉద్యోగులు

రాష్ట్ర విభజన నేపథ్యంలో సచివాలయం అట్టుడికిపోయింది. సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు సమతా బ్లాక్ వద్ద బైఠాయించారు. దాదాపు నాలుగు గంటలపాటు జరిగిన ఈ ధర్నా ఒక దశలో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్‌పై చర్చించేందుకు అఖిల పక్షం నాయకులు సచివాలయం వద్దకు వస్తున్నారని తెలుసుకున్న సీమాంధ్ర మహిళా ఉద్యోగులు వారిని కలిసి ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగా ఉంచాలని కోరేందుకు సమతా బ్లాక్ వద్దకు వచ్చారు. గతంలో ధర్నా చేసినప్పుడు తమను ప్రధానమంత్రి వద్దకు తీసుకొని వెళ్లి సమస్యను వివరిస్తామని హామీ ఇచ్చి ఇప్పటివరకు ఎందుకు తీసుకెళ్లలేదో సీఎస్‌ను కలిసి అడిగేందుకు అనుమతించాలని డిమాండ్ చేశారు. ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’, ‘సోనియా... క్విట్ ఇండియా’, రాహుల్ డౌన్‌డౌన్’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. మహిళా ఉద్యోగులకు మద్దతుగా ఎల్ బ్లాక్ నుంచి ర్యాలీగా వచ్చిన సీమాంధ్ర ఉద్యోగులు కూడా సమత బ్లాక్ వద్ద బైఠాయించారు. ఒక దశలో ఉద్యోగులు ముఖ్యమంత్రి కార్యాలయం లోపలికి చొచ్చుకొని వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు తోపులాట జరిగింది. దాదాపు నాలుగు గంటల ధర్నా తరువాత అఖిలపక్షం నేతలను, సీఎస్‌ను  కలవడానికి పరిమిత సంఖ్యలో ఉద్యోగులను  అనుమతించారు.

 వైఎస్సార్‌సీపీ కృషి ప్రశంసనీయం

 సమైకాంధ్ర కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శక్తి వంచన లేకుండా కృషి చేస్తుందని, వారి కృషి ప్రశంసనీయమని ఈ సందర్భంగా సమైక్యాంధ్ర ఉద్యోగ సంఘం నాయకులు కొనియాడారు.
 

Advertisement
Advertisement