బ్యాలెట్ పేపర్లకు చెదలు | Sakshi
Sakshi News home page

బ్యాలెట్ పేపర్లకు చెదలు

Published Wed, May 14 2014 12:39 AM

బ్యాలెట్ పేపర్లకు చెదలు - Sakshi

మూడు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ 
తడిసినా లెక్కకు వచ్చిన బ్యాలెట్లు


నెల్లూరు/కాకినాడ: మండల, జెడ్పీ ఎన్నికల్లో కొన్నిచోట్ల బ్యాలెట్ పత్రాలు తడిసిపోగా కొన్నిచోట్ల చెదలుపట్టాయి. దీంతో మూడు కేంద్రాల్లో రీపోలింగ్‌కు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. తడిసిన బ్యాలెట్లను ఆరబెట్టి లెక్కేశారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొండాపురం మండలంలోని మూడు పోలింగ్ స్టేషన్లలోని మూడు బాక్స్‌ల్లో బ్యాలెట్లకు చెదలుపట్టింది. అక్కడ ఈనెల 18న రీపోలింగ్ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఉదయగిరి నియోజకవర్గం కొండాపురం మండలంలోని ఇసుకదామెర్ల, మన్నెం వారిపల్లె, తొట్టిపల్లి పోలింగ్ కేంద్రాల్లోని బాక్సుల్ని కావలి జేబీ డిగ్రీ కళాశాల లెక్కింపు కేంద్రంలో భద్రపరిచారు. మంగళవారం ఓట్ల లెక్కింపునకు ఈ బాక్సులు తెరవటంతో చెదలు బయటపడింది. బాక్సుల్లోని బ్యాలెట్లను బయటకు తీసి చెదలు తొలగించి వాటిని సరిచేసే ప్రయత్నం చేశారు.

ఇందులో చాలా బ్యాలెట్లు లెక్కింపునకు పనికిరాకుండా పోవడంతో రీపోలింగ్ నిర్వహించాలని అభ్యర్థులు పట్టుబట్టారు. దీనిపై కలెక్టర్ నివేదిక మేరకు ఈ మూడు కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ బాక్సుల్లో 1,516 బ్యాలెట్లు ఉండటంతో ఈ మండలం నుంచి జెడ్పీటీసీ స్థానానికి పోటీచేస్తున్న అభ్యర్థుల్లో ఎవరికైనా 1,516 ఓట్ల కంటే ఎక్కువ మెజారిటీ వస్తే మాత్రం ఇక్కడ జెడ్పీటీసీ స్థానానికి రీపోలింగ్ జరపాల్సిన అవసరం లేదని ఎన్నికల సంఘం ఆదేశించింది. అంతకంటే తక్కువ మెజారిటీతో ఏ అభ్యర్థి అయినా గెలుపొందితే ఈ మూడు బూత్‌ల పరిధిలో జెడ్పీటీసీ స్థానానికి కూడా రీపోలింగ్ నిర్వహించాలని సూచించింది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ వీఎస్ లక్ష్మి కళాశాల కౌంటింగ్ కేంద్రంలోని స్ట్రాంగ్‌రూమ్‌లో భద్రపరిచిన పెదపూడి మండలం గొల్లలమామిడాడ-1, 2, 4 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించిన ఏడు బ్యాలెట్ బాక్సులు, పెద్దాడ గ్రామానికి చెందిన మూడు బాక్సుల్లోకి నీళ్లు చేరడంతో బ్యాలెట్ పత్రాలు తడిసిపోయాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించిన బ్యాలట్ పత్రాలు ఒకదానికొకటి అంటుకుపోయా యి. చిరిగిపోకుండా వీటిని విడదీయడానికి సిబ్బంది ఇబ్బంది పడ్డారు.

అధికారులు మార్కెట్ నుంచి డ్రయ్యర్స్ తెప్పించి ఆరబెట్టి బ్యాలట్ పత్రాలను విడదీశారు. వాటిపై ఓటర్లు వే సిన స్వస్తిక్ ఓటు ముద్రలను అభ్యర్థులకు చూపించారు. అన్నీ సవ్యంగా ఉండడంతో వారు లెక్కింపునకు అంగీకరించారు. రామచంద్రపురం వీఎస్‌ఎం కళాశాలలోని స్ట్రాంగ్‌రూమ్‌లో భద్రపర్చిన కపిలేశ్వరపురం మండలం వడ్లమూరు ఎంపీటీసీ స్థానానికి సంబంధించి 41/9 బ్యాలెట్ బాక్స్‌లో 535 బ్యాలెట్ పత్రాలు తడిసిపోయాయి. వీటిని కూడా ఆరబెట్టిన అనంతరం లెక్కించారు.

Advertisement
Advertisement