దగాపడిన నేతన్న | Sakshi
Sakshi News home page

దగాపడిన నేతన్న

Published Wed, Feb 11 2015 4:56 AM

Textiles workers always loss in cm chandra babu period

- చేనేత రుణమాఫీ మాట మరచిన చంద్రన్న
- జిల్లాలో 17 వేల మందికిపైగా ఎదురుచూపులు


అమలాపురం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జమానాలో రైతు రుణమాఫీ హామీ అమలు గందరగోళానికి దారి తీస్తే.. డ్వాక్రా రుణమాఫీ హామీ ప్రకటనలకే పరిమితమైంది. మరోపక్క అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు కావస్తున్నా.. చేనేత రుణమాఫీ హామీ గురించి మాట వరసకైనా ప్రస్తావించకపోవడంపై నేతన్నల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. సంక్షోభంలో చిక్కుకున్న నేతన్నలకు చేయూతనిచ్చేందుకు.. రుణమాఫీ చేస్తానని ఎన్నికల వేళ చెప్పి.. వారి ఓట్లు కొల్లగొట్టిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చిన తరువాత ఆ హామీని పక్కన పెట్టడంపై వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
 
జిల్లాలో 1700 పైగా కుటుంబాలు నేతపై ఆధారపడి ఉన్నాయి. వీరిలో చాలామందికి పలు బ్యాంకుల్లో రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకూ రుణాలున్నాయి. చేనేత సహకార సంఘాల్లో అత్యధిక రుణాలున్నాయి. వారంతా రుణమాఫీ కోసం చాలాకాలంగా ఎదురు చూస్తున్నారు. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా చేనేత కార్మికులకు ఉన్న రూ.165 కోట్ల రుణాలను మాఫీ చేస్తానని చంద్రబాబు ఎన్నికల సమయంలో ప్రకటించిన విషయం తెలిసిందే. మన జిల్లాలో కార్మికులకు రూ.10 కోట్ల వరకూ రుణమాఫీ జరగాల్సి ఉంది. ఇటీవల నూలు ధరలు పెరగడం, ఆ స్థాయిలో అమ్మకాలు లేక నష్టపోవడంతో నేతన్నలకు రోజు గడవడం భారంగా మారింది. ఈ పరిస్థితుల్లో నేతన్నలు రుణమాఫీపై ఆశలు పెట్టుకున్నారు. కానీ చంద్రబాబు అధికారం చేపట్టి ఎనిమిది నెలలు గడుస్తున్నా మాఫీ ఊసే లేకుండా పోయింది. రైతు రుణమాఫీ ఆరంభించి వాయిదాల పద్ధతిలో చెల్లిస్తూ అన్నదాతలను, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానంటూ మహిళలను బుజ్జగించుకుంటూ వస్తున్న చంద్రబాబు, నేతన్నల రుణమాఫీపై మాత్రం నోరు మెదపడంలేదు. ఆయన తీరుపై నేతన్నలు మండిపడుతున్నారు.
 
గతంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నేతన్నలకు రూ.312 కోట్ల రుణమాఫీ ప్రకటించారు. ఆయన హఠాన్మరణంతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై వాయిదాలు మొదలు పెట్టింది. తొలుత రోశయ్య, తరువాత కిరణ్‌కుమార్‌రెడ్డి మాఫీపై దాటవేత ధోరణి అవలంబించారు. నేతన్నల ఆగ్రహం చవిచూడాల్సి రావడంతో కిరణ్‌కుమార్‌రెడ్డి రూ.169 కోట్లు మాఫీ చేశారు. ఇంకా రూ.143 కోట్లు చేయాల్సి ఉంది. దీంతో సంబంధం లేకుండానే రాష్ర్ట విభజన తరువాత ఆంధ్రప్రదేశ్‌లోని నేత కార్మికులకు రూ.165 కోట్ల రుణమాఫీ చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ, ఎన్నికల్లో గెలిచిన తరువాత ఆ హామీని విస్మరిస్తున్నారని నేతన్నలు విమర్శిస్తున్నారు.
 
సంఘాల రుణాలూ మాఫీ చేయాల్సిందే..
 చేనేత కార్మికులే కాకుండా చేనేత సహకార సంఘాలు సైతం అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. జిల్లాలో 50 వరకూ సహకార సంఘాలుండగా కేవలం పది పన్నెండు మాత్రమే లాభాల్లో ఉన్నాయి. మిగిలిన సంఘాలు నష్టాల ఊబిలో కూరుకుపోయాయి. వీటి నష్టాలు రూ.12 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. వీటిని కూడా మాఫీ చేస్తేనే కానీ చేనేత బతికి బట్టకట్టలేదని నేతన్నలు చెబుతున్నారు.
 
సంపూర్ణ మాఫీతోనే పూర్వ వైభవం
చేనేత కార్మికుల రుణాలే కాదు.. చేనేత సహకార సంఘాల అప్పులను సైతం చంద్రబాబు ప్రభుత్వం మాఫీ చేస్తేనే పూర్వ వైభవం వస్తుంది. లేకుంటే ఈ రంగం మరింత అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదముంది. గతంలో అప్కో రెండేళ్లపాటు బకాయిలు చెల్లించలేదు. అప్పటినుంచీ సంఘాలు అప్పుల్లో కూరుకుపోయాయి. చంద్రబాబు ప్రభుత్వం వీటికి పునరుజ్జీవం ఇవ్వాల్సి ఉంది.
 - దొంతంశెట్టి విరూపాక్షం, చేనేత సహకార సంఘాల
 రాష్ట్ర సమాఖ్య అధ్యక్షుడు, హసన్‌బాద
 
తమిళనాడును ఆదర్శంగా తీసుకోవాలి
రాజధాని నిర్మాణానికి సింగపూర్‌ను ఆదర్శంగా తీసుకున్నట్టుగానే.. చేనేత రంగాన్ని ఆదుకునేందుకు చంద్రబాబు తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. అక్కడ విద్యుత్ మగ్గాలకు కరెంటు ఉచితంగా ఇస్తున్నారు. రేషన్ కార్డుదారులకు చీర, ధోవతి ఏటా అందిస్తున్నారు. దీంతో కార్మికుడికి పని దొరుకుతోంది. నేతన్నల కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం రూ.300 కోట్ల వరకూ మంజూరు చేసి ఖర్చు చేస్తోంది.      - కటకం గణపతిరావు, చేనేత సహకార సంఘం మాజీ ఉపాధ్యక్షుడు, బండారులంక
 
 

Advertisement
Advertisement