నిధులిచ్చి న్యాయం చేయండి | Sakshi
Sakshi News home page

నిధులిచ్చి న్యాయం చేయండి

Published Sat, Sep 13 2014 12:32 AM

నిధులిచ్చి న్యాయం చేయండి - Sakshi

14వ ఆర్థిక సంఘానికి చంద్రబాబు నివేదన
 
తిరుపతి: రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా, అన్యాయంగా విభజించారని.. నిధుల కేటాయింపులో న్యాయం చేసి ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకోవాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు 14వ ఆర్థిక సంఘాన్ని కోరారు. రాష్ట్ర పరిస్థితులను కేంద్రానికి నివేదించి, న్యాయం జరిగేలా చూస్తామని ఆర్థిక సంఘం చైర్మన్ వైవీ రెడ్డి హామీ ఇచ్చారు. తిరుపతిలోని ఓ ప్రైవే ట్ హోటల్‌లో శుక్రవారం సీఎం, మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు ఆర్థిక సంఘంతో సమావేశమయ్యారు. బాబు, ఆర్థికశాఖ కార్యదర్శి పీవీ రమేశ్ రెండు వినతిపత్రాలను సమర్పించారు. బాబు మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని విభజించి జనాభాలో 58 శాతం ఉన్న సీమాంధ్ర ప్రజలను ఒట్టి చేతులతో బయటకు పంపడాన్ని కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు. రాజధానిలో ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్వహించాల్సిన ఈ సమావేశాన్ని ప్రైవేటు హోటల్‌లో నిర్వహిస్తున్నామంటే ఏ దుస్థితిలో ఉన్నామో అర్థం చేసుకోవాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా 56 ఏళ్ల పాటు కొనసాగిన హైదరాబాద్‌ను కేంద్ర ప్రభుత్వం రూ.1.40 లక్షల కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.5.89 లక్షల కోట్లు, ప్రైవేటు రంగం నుంచి రూ.6 లక్షల కోట్లు.. మొత్తం రూ.13.29 లక్షల కోట్లు వెచ్చించి అభివృద్ధి చేశాయని గుర్తు చేశారు.

అభివృద్ధి హైదరాబాద్‌లో కేంద్రీకృతమవడం వల్ల ఒక్క రాజధాని నగరం నుంచే రాష్ట్రానికి 60 శాతం ఆదాయం లభించేదన్నారు. రాష్ట్ర విభజన జరిగినా తెలంగాణ మిగులు బడ్జెట్‌లో ఉండటానికి ఇదే ప్రధాన కారణమని వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధానిని నిర్మించాలంటే రూ.4 లక్షల కోట్ల నుంచి రూ.5 లక్షల కోట్లు ఖర్చవుతాయన్నారు. కేంద్రం తక్షణమే రూ.1.02 లక్షల కోట్లు ఇచ్చేలా ప్రతిపాదించాలని కోరారు. 5 నుంచి 15 ఏళ్లలో రాజధాని నగరాన్ని పూర్తిచేస్తామని చెప్పారు. నేషనల్ సమ్ రీపేమెంట్ కింద  తీసుకున్న రుణాలను 2017-18 నుంచి  చెల్లించాల్సి ఉందని.. దాన్ని కనీసం 25 ఏళ్ల పాటు వాయిదా వేయాలని కోరారు.
 కేంద్ర పథకాలతో ప్రయోజనం లేదు
 భేటీ తర్వాత సీఎం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర స్థితిగతులపై కేంద్రానికి అవగాహన లేకపోవడం వల్ల అది రూపొందించే పథకాలు ఎలాంటి ప్రయోజనాన్ని చేకూర్చలేకపోతున్నాయని చెప్పా రు. అందువల్ల కేంద్రం చేపట్టే అభివృద్ధి పథకాలకు కేటాయించే నిధులను రాష్ట్రానికే ఇవ్వాలని డిమాండ్ చేశారు. వాటితో రాష్ట్ర ప్రభుత్వమే అభివృద్ధి పథకాలను చేపట్టే వెసులుబాటును కల్పించాల్సిందిగా ఆర్థిక సంఘాన్ని కోరామని చెప్పారు.

ఆడబిడ్డా.. మగబిడ్డా అక్టోబర్‌లో తేలుతుంది

14వ ఆర్థిక సంఘం చేసే ప్రతిపాదనల వల్ల రాష్ట్రానికి ఏమేరకు నిధులు వచ్చే అవకాశం ఉందని ముఖ్యమంత్రిని విలేకరులు ప్రశ్నించగా ఆయన స్పందించారు. ‘ఆర్థిక సంఘం అక్టోబర్‌లో కేంద్రానికి నివేదిక అందజేస్తుంది. అప్పుడు ఆడ బిడ్డా.. మగబిడ్డా.. అన్నది తేలుతుంది. ఇప్పటికిప్పుడు ఏమేరకు నిధులు వస్తాయన్నది చెప్పలేం’ అని బదులిచ్చారు.
 
ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలివే..
 
ఆంధ్రప్రదేశ్‌కు పదేళ్ల పాటు ప్రత్యేక ప్రతిపత్తిని ప్రకటించాలి.
కొత్త రాజధాని నిర్మాణానికి కేంద్రం వెంటనే రూ.లక్ష కోట్లు ఇచ్చేలా ప్రతిపాదించండి.
స్పెషల్ గ్రాంట్ కింద రూ.41,500 కోట్లు అదనంగా మంజూరు చేయూలి
కేంద్రం పన్నుల ఆదాయంలో రాష్ట్ర వాటాను 32 నుంచి 50 శాతానికి పెంచాలి.
కేంద్రం ఇచ్చిన రూ.10,400 కోట్ల రుణాన్ని మాఫీ చేయూలి.
ఎఫ్‌బీఆర్‌ఎం రుణ పరిమితిని ఏడు శాతానికి పెంచాలి.
జాతీయ విపత్తు నిధిలో కేంద్రం వాటాను 75 శాతం నుంచి 90 శాతానికి పెంచాలి
రాయలసీమ, ఉత్తరాంధ్రలకు ప్రత్యేక ప్యాకేజీ కింద తక్షణమే రూ.24,350 కోట్లు మంజూరుకు ప్రతిపాదించండి
రూ.15,651 కోట్ల రెవెన్యూ లోటు ఉన్నం దున ఆ నిధులను కేంద్రం వెంటనే విడుదల చేసేలా సూచించండి
పెట్రోలియం, పొగాకు ఉత్పత్తులకు జీఎస్‌టీ నుంచి మినహాయింపును ఇవ్వాలి. జీఎస్‌టీ వల్ల రాష్ట్రానికి ఆదాయం తగ్గితే ఆ నష్టాన్ని కేంద్రమే భర్తీ చేయూలి.
ఉత్తరాంచల్, హిమాచల్‌ప్రదేశ్ రీతిలో రాష్ట్రానికీ పారిశ్రామిక రాయితీలు ఇవ్వాలి.
 

Advertisement
Advertisement