అలుపెరుగని ఉద్యమ అల | Sakshi
Sakshi News home page

అలుపెరుగని ఉద్యమ అల

Published Fri, Sep 13 2013 3:54 AM

The 44th day of a united movement

 విరామం ఎరుగని గోదావరికి లాగే ఆ సీమలో పెల్లుబికిన సమైక్య ఉద్యమమూ నిరంతరాయంగా కొనసాగుతోంది. దారి పొడవునా వాగువంకల్ని కలుపుకొని విస్తృతమయ్యే ఆ జీవనదికి లాగే ఉద్యమంలోకీ కొత్తపాయలు వచ్చి చేరుతున్నాయి. వివిధ ప్రభుత్వ శాఖ ఉద్యోగులు ఇప్పటికే ఆందోళనపథంలో ఉండగా తాజాగా విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు దిగారు. జిల్లాలో 44వ రోజైన గురువారం వివిధ వర్గాల వారు సమైక్య ఉద్యమాన్ని కొనసాగించారు.
 
 సాక్షి, రాజమండ్రి : జిల్లాలో గురువారం సమైక్యవాదుల ఆందోళనలు మరింత జోరుగా కొనసాగాయి. రైతులు, ఉద్యోగులు, వ్యాపారులు సమైక్యమే తమ ధ్యేయమని గర్జించారు. తాటిపాకలో వర్తక సంఘం ఆధ్వర్యంలో లక్ష గళ ఘోష నిర్వహించారు. రాజోలు, పి.గన్నవరం నియోజక వర్గాల నుంచి విద్యార్థి, ఉపాధ్యాయ, ఉద్యోగు, కార్మిక, రాజకీయ జేఏసీల ఆధ్వర్యంలో సమైక్యవాదులు భారీగా తరలి వచ్చి ప్రదర్శన జరిపి అనంతరం తాటిపాక సెంటర్‌లో బైఠాయించి ముక్తకంఠంతో సమైక్య నినాదాలు చేశారు. అమలాపురంలో కోనసీమలోని వేలాదిమంది రైతులు రెవెన్యూ డివిజనల్ కార్యాలయం నుంచి ఊరేగింపుగా గడియారస్తంభం సెంటర్ వరకూ ర్యాలీ చేసి సమైక్య గర్జన సభ నిర్వహించారు.
 
 సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు వెళ్లి వస్తున్న సీమాంధ్ర ఉద్యోగులపై దాడులను ఖండిస్తూ రాజమండ్రిలో ఎన్‌జీఓ సంఘం ఆధ్వర్యంలో ఎన్‌జీవో హోం వద్ద అన్ని విభాగాల జేఏసీల ప్రతినిధులు 24 గంటల మహా దీక్ష చేపట్టారు. రాత్రి 8 గంటల నుంచి ‘పోరునిద్ర’ కొనసాగించారు. తొలుత ఉద్యోగులు  ర్యాలీ చేశారు. అల్లు రామలింగయ్య హోమియోపతి కళాశాల విద్యార్థులు ఎన్‌జీఓలకు మద్దతుగా ర్యాలీగా వచ్చి దీక్షా శిబిరంలో పాల్గొన్నారు. ఎన్‌జీఓల పిలుపు మేరకు రాజమండ్రి బంద్ పాటించి  విద్యా సంస్థలు మూసివేశారు. మున్సిపల్ ఉద్యోగులు నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి పుష్కరఘాట్ వరకూ వంద అడుగుల జాతీయ జెండాను ప్రదర్శించారు. మోరంపూడి సెంటర్‌లో మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో ఒకరోజు దీక్ష చేపట్టారు.
 
  గురువారం ఉదయం నుంచి సమ్మె చేపట్టిన  విద్యుత్తు ఉద్యోగులు సబ్‌స్టేషన్ల వద్ద నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. కాకినాడలో రామారావుపేట సబ్ స్టేషన్ వద్ద దీక్షా శిబిరం ఏర్పాటు చేసి వంటా వార్పూ కార్యక్రమం చేపట్టారు. బొమ్మూరు 220 కేవీ సబ్ స్టేషన్ వద్ద ఏపీ ట్రాన్స్‌కో జేఏసీ ఆధ్వర్యంలో 200 మంది ఉద్యోగులు విధులకు గైర్హాజరు అయ్యారు. కాకినాడ రూరల్ పరిధిలోని ట్రాన్స్‌కో ఉద్యోగులు రాయుడుపాలెం సబ్‌స్టేషన్ ఎదురుగా దీక్షలు ప్రారంభించారు.
 
 కళారూపాలతో సమైక్య సందేశాలు
 కాకినాడ కలెక్టరేట్ ఎదుట కొనసాగుతున్న జేఏసీ శిబిరంలో ఎస్సీ, బీసీ సంక్షేమ శాఖల ఉద్యోగులు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. శిబిరం వద్ద గొర్రెల రాము బృందం రాష్ట్ర విభజన తో వాటిల్లే నష్టాలను బుర్రకథ ద్వారా  విశదీకరించారు. ఉపాధ్యాయులు కలెక్టరేట్ గేటు వద్ద వంటా వార్పూ చేపట్టారు. సమైక్యరాష్ట్ర పరిరక్షణ నినాదాలతో వేట్లపాలెంకు చెందిన కోలాటం బృందం కళాజాతా నిర్వహించింది. పీఆర్ కళాశాల విద్యార్థులు బాలాజీ చెరువు నుంచి కలెక్టరేట్ వరకూ ర్యాలీ చేశారు.  సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఉద్యోగులు ర్యాలీ చేసి కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు. గృహ నిర్మాణ శాఖ ఉద్యోగులు ఎన్‌ఎఫ్‌సీఎల్ రోడ్డు నుంచి నాగమల్లి తోట వరకూ ర్యాలీ చేసి మానవహారంగా ఏర్పడ్డారు. తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి సంఘీభావం తెలిపారు.
 
 ముమ్మిడివరంలో ఉద్యోగుల భిక్షాటన
 కోనసీమలోని ఓడలరేవు ఓఎన్‌జీసీ టెర్మినల్‌ను. తాళ్లరేవులో రిలయన్‌‌స సంస్థను శుక్రవారం ముట్టడించేందుకు సమైక్య వాదులు సిద్ధమవుతున్నారు. కోనసీమ ఏకలవ్య ఎరుకుల సంఘం ఆధ్వర్యంలో అమలాపురం రూరల్ మండల పరిధిలో ర్యాలీ నిర్వహించి గడియారస్తంభం సెంటర్‌లో మానవహారంగా ఏర్పడ్డారు. ఉప్పలగుప్తంలో రైతులు ర్యాలీ చేశారు. ముమ్మిడివరంలో ఏపీ ఎన్‌జీఓల జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు రోడ్డుపై భిక్షాటన చేశారు. కొత్తపేటలో జేఏసీ ఆధ్వర్యంలో యువకులు నిరాహార దీక్షల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సంఘీభావం తెలిపారు. డిగ్రీకళాశాల విద్యార్థులు, జేఏసీ ప్రతినిధులు పాతబస్టాండ్ సెంటర్‌లో మానవహారంగా ఏర్పడ్డారు. ఇరిగేషన్ సర్కిల్ హెడ్ వర్క్స్ సిబ్బంది ధవళేశ్వరం నుంచి ఆత్రేయపురం వరకూ మోటారు సైకిల్ ర్యాలీ నిర్వహించారు.
 
 సామర్లకోటలో ప్రజాభిప్రాయ సేకరణ
 జేఏసీ ఆధ్వర్యంలో సామర్లకోట రైల్వే స్టేషన్ సెంటర్‌లో రాష్ట్ర విభజనపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. మహిళలు మానవహారంగా ఏర్పడి సమైక్య నినాదాలు చేశారు. జేఏసీ, న్యాయవాదులు, న్యాయశాఖ ఉద్యోగులు, గ్యాస్ డెలివరీ బాయ్స్ పెద్దాపురం తహశీల్దారు కార్యాలయం ఎదుట మానవహారంగా ఏర్పడి సమైక్య నినాదాలు చేశారు. జేఏసీ, ఎన్‌జీఓలు తునిలో కొనసాగిస్తున్న దీక్షలకు వైఎస్సార్ కాంగ్రెస్ కో ఆర్డినేటర్ దాడిశెట్టి రాజా, జిల్లా మహిళా విభాగం కన్వీనర్ రొంగల లక్ష్మి, మాజీ మున్సిపల్ చైర్మన్ కుసుమంచి శోభారాణి   సంఘీభావం తెలిపారు.
 
 జగ్గంపేటలో జర్నలిస్టుల ‘హైవే నిద్ర’
 ఏలేశ్వరంలో ఉపాధ్యాయులు, ఎన్‌జీఓలు క్వారీల్లో రాళ్లు కొడుతూ, టీడీపీ నేతలు హనుమాన్ సెంటర్‌లో చెప్పులు కుడుతూ నిరసన తెలిపారు. కిర్లంపూడిలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో వంటా వార్పూ చేపట్టారు. జగ్గంపేటలో రాత్రి ఏడు గంటలకు 16వ నంబరు జాతీయ రహదారిపై జర్నలిస్టులు ‘హైవే నిద్ర’ కార్యక్రమం చేపట్టారు. సీతానగరంలో సహకార సంఘాల కార్యదర్శులు రోడ్డు తుడిచి నిరసన తెలిపారు. బిక్కవోలులో వైద్య సిబ్బంది ర్యాలీ చేశారు. మండపేట కలువప్వు సెంటర్‌లో ఉపాధ్యాయులు రాస్తారోకో చేశారు. వైఎస్సార్ సీపీ కిసాన్ సెల్ జిల్లా కన్వీనర్ రెడ్డి రాధాకృష్ణ పాల్గొన్నారు.
 
 కపిలేశ్వరపురం మండలం అంగరలో జేఏసీ ఆధ్వర్యంలో సమైక్యవాదులు వంటా వార్పూ చేశారు. ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, వైఎస్సార్ కాంగ్రెస్ కో ఆర్డినేటర్ రెడ్డి ప్రసాద్  పాల్గొన్నారు.  ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న దీక్షలకు మద్దతు తెలిపిన వైఎస్సార్ కాంగ్రెస్ వాణిజ్య విభాగం కన్వీనర్ కర్రిపాపారాయుడు వారికి గులాబీలు ఇచ్చారు. కె.గంగవరం మండలం పేకేరులో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. కాజులూరులో జేఏసీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ర్యాలీ జరిపారు. రంపచోడవరం అంబేద్కర్ సెంటర్‌లో జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే దీక్షల్లో ఐటీడీఏ ఇంజనీరింగ్ ఉద్యోగులు పాల్గొన్నారు.
 
 వైఎస్సార్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో..
 ప్రత్తిపాడులో వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు ‘కాంగ్రెస్ పార్టీ మాక్ ప్లీనరీ’ నిర్వహించారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రులు, రాష్ట్ర ఎంపీలు సోనియా, రాహుల్ గాంధీలకు భజన చేస్తున్నట్టు ప్రదర్శించారు. రాజమండ్రిలో వైఎస్సార్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కోటగుమ్మం సెంటర్‌లో కొనసాగుతున్న రిలే దీక్షల శిబిరాన్ని ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, పార్టీ ట్రేడ్‌యూనియన్ రాష్ట్ర కార్యదర్శి టి.కె.విశ్వేశ్వరరెడ్డి సందర్శించి సంఘీభావం తెలిపారు. మామిడికుదురులో వైఎస్సార్ కాంగ్రెస్ చేపట్టిన రిలే దీక్షల్లో అప్పనపల్లికి చెందిన డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు. పార్టీ కో ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు, రైతు విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు జక్కంపూడి తాతాజీ సంఘీభావం తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మలికిపురం మండలం తూర్పుపాలెంలో వంటా వార్పూ చేపట్టారు. కో ఆర్డినేటర్ మత్తి జయప్రకాష్ హాజరయ్యారు.
 

Advertisement
Advertisement