పట్టాల పంపిణీలో తమ్ముళ్ల చేతివాటం | Sakshi
Sakshi News home page

పట్టాల పంపిణీలో తమ్ముళ్ల చేతివాటం

Published Sat, May 14 2016 2:52 AM

పట్టాల పంపిణీలో తమ్ముళ్ల చేతివాటం - Sakshi

సుందరయ్యనగర్, ఫెర్రీ నిర్వాసితుల నుంచి డబ్బుల వసూలు
కాచవరం కొండల్లో స్థలాల కేటాయింపు
కనీస సౌకర్యాలు లేవని బాధితుల  ఆందోళన

 
 
ఇబ్రహీంపట్నం : పుష్కర నిర్వాసితులకు పట్టాల కేటాయింపులో తెలుగు తమ్ముళ్లు చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. మండలంలోని సుందరయ్య నగర్, ఫెర్రీ రహదారిలోని ఈ నిర్వాసితులకు కాచవరం గ్రామంలో కేటాయించిన స్థలం కొండలు, గుట్టల మధ్యన ఉండటంతో కనీస సౌకర్యాలు కూడా లేనిచోట నివసించేది ఎలా అని బాధితులు ఆందోళన చెందుతున్నారు.
బాధితులకు అండగా నిలిచిన వైఎస్సార్ సీపీ నిర్వాసితులకు ప్రత్యామ్నాయం చూపించటంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జోగి రమేష్ నిర్విరామ కృషి చేశారు. పేదలకు స్థలాలు ఇచ్చేలా అధికారులపై వైఎస్సార్ సీపీ పోరాడింది. ఈ క్రమంలో నిర్వాసితులు సుమారు 450 మందికి రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చి ఇంటింటికి తిరిగి తగిన ఆధారాలతో నివేశన స్థలం పట్టాలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. సుందరయ్యనగర్‌లో 233 మందికిగాను 92 మందికి, ఫెర్రీ రహదారిలో 213 మందికిగాను కేవలం 65 మందికి మాత్రమే పట్టాలు అందజేసినట్లు తెలుస్తోంది. మిగిలిన వారికి ఆధారాలు చూపిన అనంతరం పట్టాలు మంజూరు చేస్తామని అధికారులు చెబుతున్నారు.


వసూళ్లకు తెరతీసిన తమ్ముళ్లు
 పట్టాల కేటాయింపులో అధికారులు ఇంటి  పన్నును ప్రామాణికంగా తీసుకోవటంతో టీడీపీ వార్డు సభ్యురాలి భర్త డబ్బు వసూళ్లకు పాల్పడుతున్నాడని బాధితులు ఆరోపించారు. పన్ను ఆధారాలు లేనివారికి ఇంటి  పన్ను, పట్టా, ప్లాటు కేటాయింపు వరకు మేమే చూసుకుంటామని ఒక్కొక్కరి నుంచి రూ.25 వేల నుంచి 30 వేల వరకు వసూలు చేస్తున్నారని అధికార పార్టీ వార్డు సభ్యులే ఆరోపణలు చేయటం గమనార్హం.


కొండలు, గుట్టల్లో స్థలాలు
 కాచవరంలోని సర్వే నంబర్ 8లోని 9.30 ఎకరాల కొండ పోరంబోకు స్థలంలో పుష్కర నిర్వాసితులకు 465 ప్లాట్లు ఏర్పాటు చేశారు. పట్టాలున్న వారికి స్థలాలు కేటాయించేందుకు అధికారులు నిమగ్నమయ్యారు. అయితే కొండలు, రాళ్లగుట్టల మధ్య స్థలాలు కేటాయిస్తే నివాసాలు ఎలా ఏర్పాటు చేసుకోవాలని నిర్వాసితులు ప్రశ్నిస్తున్నారు.
 
 
నివాసయోగ్యంగా లేదు
 ఫెర్రీ రహదారిలో నా ఇం టిని కూల్చేశారు. రెవెన్యూ అధికారులు పట్టా మంజూరు చేశారు. ఇక్కడకు వస్తే ఇవన్నీ కొండలు, గుట్టల  మధ్య స్థలం ఉంది. సౌకర్యాలు లేకపోవడంతో ప్రస్తుతం నివాసయోగ్యంగా లేదు.
 - గుమ్మడిదల హనుమంతరావు, నిర్వాసితుడు
 
 
ఎడారిని తలపిస్తోంది
 పుష్కర బాధితులకు కేటాయించిన స్థలం ఎడారిని తలపిస్తోంది. రాళ్లగుట్టల మధ్య ప్లాట్లు ఏర్పాటు చేశారు. రహదారి సౌకర్యం కూడా సరిగా లేదు. ఇక్కడ ఇళ్లను ఎలా నిర్మించుకోవాలో తెలియటం లేదు. సౌకర్యాలు ఏర్పాటు చేయాలి.  - చాగంటి దుర్గారావు, నిర్వాసితుడు

Advertisement
Advertisement