హత్య కేసులో నిందితుల అరెస్ట్ | Sakshi
Sakshi News home page

హత్య కేసులో నిందితుల అరెస్ట్

Published Wed, Oct 22 2014 2:43 AM

హత్య కేసులో నిందితుల అరెస్ట్ - Sakshi

కోసిగి: మండలంలోని వందగల్లుకు చెందిన చాకలి వెంకటేష్, లక్ష్మి దంపతుల హత్య కేసులో నిందితులను మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ అస్రార్ బాష, ఎస్‌ఐ కృష్ణమూర్తి తెలిపారు. పోలీసుల కథనం మేరకు..2007లో గ్రామానికి చెందిన చాకలి ఆనందప్ప, సాతనూరు తిమ్మప్ప కుటుంబాల మధ్య  పొలం తగాదాలో ఆనందప్ప హత్యకు గురయ్యాడు. ఆ కేసులో ప్రస్తుతం కోర్టులో తుది విచారణ దశకు వచ్చింది. దీంతో చాకలి వెంకటేష్, లక్ష్మిలను రాజీ కావాలని, సాక్షులు మార్చేందుకు రూ12 లక్షలు వరకు ఇస్తామని, ఆ కేసులో నిందితులు ప్రయత్నించారు.

అయితే రాజీయత్నం విఫలం కావడంతో సెప్టెంబర్ నెల 17న రాత్రి ఆదోని నుంచి రైలులో కోసిగికు వస్తున్న చాకలి వెంకటేష్‌ను అదే గ్రామానికి  చెందిన మాజీ సర్పంచ్ నరసింహులు, కోసిగికు చెందిన సాతనూరు మంజునాథ, గోపాల్, తిమ్మరాజుతో పాటు మరో 9మంది కాపు కాచి, గ్రామ శివారులో ఉన్న పొలంలోకి బలవంతంగా తీసుకెళ్లారు. అక్కడ అతనికి బలప్రయోగంతో పురుగుల మందు తాగించి హత్య చేశారు. అలాగే ఇంట్లో నిద్రస్తున్న వెంకటేష్ భార్య లక్ష్మిని కూడ నోట్లో మందు పోసి చంపేశారు.

అయితే శవాలను రైల్వే పట్టాల పై పడవేసి ఆత్మహత్యలుగా చిత్రీకరించేందుకు యత్నించారు. పోస్టుమార్టంలో హత్యగా తేలింది. హతులు వందగల్లు గ్రామానికి చెందినవారుగా రైల్వే పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించి, ఈనెల 6న కోసిగి స్టేషన్‌కు వివరాలు పంపారు. నిందితులు నాటుగాని నరసింహులు, గోపాల్, తిమ్మరాజు, మల్లారెడ్డి వెంకటేష్, గోవిందు, చాకలి మమాదేవా, ఈడిగ హనుమంతరెడ్డి, దుమతిగోపాల్, అంజినయ్య , జింకల హనుమంతులను సాతనూరు తిమ్మప్ప పొలంలో అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మరో ముగ్గురు నిందితులు మంజునాథ, కందుకూరు వీరేష్, డుబాబు ఈరన్న పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
Advertisement