విశాఖలో బాణసంచాపై నిషేధం | Sakshi
Sakshi News home page

విశాఖలో బాణసంచాపై నిషేధం

Published Sun, Oct 19 2014 12:48 AM

విశాఖలో బాణసంచాపై నిషేధం - Sakshi

ఈ దీపావళికి దీపాలు మాత్రమే వెలగాలి..
బాణసంచా కాల్చకండి : సీఎం చంద్రబాబు
చెట్లు, ఆకులు ఎండిపోయి ఉన్నాయి..
నిప్పంటుకుంటే పెద్ద ప్రమాదం
ప్రైవేటు భాగస్వామ్యంతో మత్స్యకారులకు టౌన్‌షిప్‌లు
ఏజెన్సీలో టూరిజం అభివృద్ధికి ప్రత్యేక సర్క్యూట్    
 

విశాఖ రూరల్: విశాఖలో బాణసంచా అమ్మకాలను నిషేదించినట్లు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెప్పారు. బాణసంచా విక్రయానికి ఇప్పటివరకు ఇచ్చిన లెసైన్సులు రద్దు చేస్తామని ప్రకటించారు. శనివారం జిల్లా కలెక్టరేట్‌లో సీఎం మీడియాతో మాట్లాడుతూ.. దీపావళి పండుగకు ప్రతీ ఇంటి ముందు దీపాలు మాత్రమే వెలిగించాలని, బాణసంచా కాల్చవద్దని విశాఖ ప్రజలకు సూచించారు. అవసరమైతే ప్రభుత్వమే దీపాలు సరఫరా చేస్తుందన్నారు. తుపాను కారణంగా చెట్లు విరిగి ఎండిపోయి ఉన్నాయని, ఆకులు కూడా ఎండిపోయాయని, చిన్న నిప్పు తగిలినా పెద్ద ప్రమాదం జరుగుతుందని తెలిపారు. భవిష్యత్తులో ప్రకృతిని ఛాలెంజ్ చేసి మరీ దీపావళి చేసుకుందామని, తుపాన్లు కూడా అసూయపడే స్థాయిలో కొత్త విశాఖను నిర్మించుకుందామని చెప్పారు.  విద్యుత్, గ్యాస్, ఫైబర్, సమాచార వ్యవస్థ ఇలా అన్నింటికి కామన్ డక్టులు ఏర్పాటు చేస్తామని, ఏ సమస్య వచ్చినా రెండు, మూడు గంటల్లో పరిష్కరించేలా చేస్తామన్నారు. ఇందుకోసం చెన్నై, ముంబైల నుంచి కన్సల్టెంట్లు వస్తున్నారని తెలిపారు. ప్రతి పౌరుడు ఆర్థికంగా లేదా శ్రమదానం చేసైనా పునర్నిర్మాణంలో పాలుపంచుకోవాలన్నారు. విశాఖ కోసం ప్రత్యేకంగా వెబ్‌సైట్, ఫేస్‌బుక్ అకౌంట్ ఓపెన్ చేసి ప్రజల్లో చైతన్యం తేవాలన్నారు. దీపావళికి ముందే విశాఖ ప్రజల కళ్లలో వెలుగులు చూడటానికి అన్ని సహాయ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.

అధికారులు, చౌక దుకాణదారులు పేదలకు పండుగకు 2 రోజుల ముందే నిత్యావసరాలను అందించాలని సూచించారు.పునరుద్ధరణ పనులు వేగవంతంగా చేపడుతున్నా సంతృప్తి లేదని, ఇంకా చేయాల్సింది చాలా ఉందన్నారు. విద్యుత్ సమస్య శాశ్వత పరిష్కారానికి టాటా, ఎన్‌సీసీ, ఎల్ అండ్ టి సంస్థల సహకారం కోరామన్నారు. తుపాను నష్టం ఎన్యూమరేషన్‌కు ఆన్‌లైన్ అప్లికేషన్ తయారు చేశామని, బాధితులు వారికి జరిగిన నష్టాలను ఫొటో లేదా వీడియో తీసి అప్‌లోడ్ చేస్తే పరిశీలించి పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు. సరుగుడు తోటకు రూ.12,500, పశువుల పాకలకు రూ.10 వేలు పరిహారం ఇస్తామన్నారు. టేక్ ఉడ్ చెట్లను యజమానులే అమ్ముకొనేలా అనుమతులు ఇస్తామన్నారు. తుపానుకు దెబ్బతిన్న ఇళ్ల మరమ్మత్తుల కోసం రాష్ట్ర స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కార్మికులు సిద్ధంగా ఉన్నారన్నారు.

మత్స్యకారులకు టౌన్‌షిప్‌లు

మత్స్యకారుల కోసం ప్రత్యేక టౌన్‌షిప్‌ల నిర్మాణానికి కార్పొరేట్ సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. తుపాను బాధితుల సహాయానికి ఇన్ఫోసిస్ సంస్థ  రూ.5 కోట్లు ప్రకటించగా, రూ.10 కోట్లు అడిగామని చెప్పారు. దానికి తాము మరో రూ.10 కోట్లు ఇచ్చి, స్థలాన్ని చూపిస్తామని, మత్స్యకారుల కోసం అన్ని వసతులతో టౌన్‌షిప్ నిర్మించాలని కోరినట్లు చెప్పారు.  

గిరిజనులు సురక్షిత ప్రాంతాల్లో ఇళ్లు కట్టుకోవాలి

పాడేరు, అరకులలో ఇంకా 5 లక్షల ఎకరాల్లో కాఫీ తోటలు చేపట్టే అవకాశముందని సీఎం చెప్పారు. గిరిజనులు కొండల మీద కాకుండా సురక్షిత ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించుకుంటే అక్కడ అన్ని సదుపాయాలు కల్పిస్తామన్నారు.
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement