ప్లాట్లు..పాట్లు | Sakshi
Sakshi News home page

ప్లాట్లు..పాట్లు

Published Fri, Jun 10 2016 12:19 AM

The capital of the farmers chaos

రాజధాని రైతుల్లో గందరగోళం
కేటాయింపులపై స్పష్టత కరువు
కాగితాల్లోనే పంపిణీ!?
నేటినుంచి రిజిస్ట్రేషన్లపై ఆంక్షలు

 

రాజధాని ప్రాంత రైతుల్లో గందరగోళం నెలకొంది. ప్లాట్ల కేటాయింపుపై ప్రభుత్వ యంత్రాంగానికీ స్పష్టత లేదు. ఈనెల చివరినాటికి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. ఈ విషయంపై రైతులు మాత్రం ఏ ఆప్షన్లు తీసుకోవాలో అర్థం కాక తలలుపట్టుకుంటున్నారు. ఏ నిర్ణయం తీసుకుంటే.. ఎటువంటి పరిణామాలు ఎదురవుతాయోనని ఆందోళన చెందుతున్నారు. ఒకపక్క ప్లాట్ల కేటాయింపులు ఆలస్యం అవుతుంటే.. రాజధాని ప్రాంతంలో భూముల రిజిస్ట్రేషన్‌పై సర్కారు ఆంక్షలు విధించింది. శుక్రవారం నుంచి ఎన్‌వోసీ లేనిదే ఎటువంటి రిజిస్ట్రేషన్లూ జరపరాదని అధికారులకు ఆదేశాలిచ్చింది.

 

అమరావతి : రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లోని 29 గ్రామాలకు చెందిన 22 వేల మంది రైతులు 32 వేల ఎకరాల భూములను భూసమీకరణ పథకం కింద ఇచ్చారు. వారికి తిరిగి ఇవ్వాల్సిన ప్లాట్ల విషయంలో అటు రైతుల్లో.. అటు అధికారుల్లో గందరగోళం నెలకొనడంతో ప్లాట్ల కేటాయింపు వాయిదా పడుతూ వచ్చింది. గత నెలలో ప్లాట్ల కేటాయింపు విధానాన్ని ప్రకటించి జాయింట్, సింగిల్ ప్లాట్ల కోసం ఆప్షన్లు ఇవ్వాలని రైతులను కోరినా పెద్దగా స్పందించలేదు. గడువు ముగిసే నాటికి 22 వేల మందికి గాను కేవలం 6,992 మంది రైతులు ఆప్షన్లు ఇచ్చారు. మిగిలినవారు ఆప్షన్లకు దూరంగా ఉండిపోయారు. భూములు తీసుకున్న రైతులకు డిసెంబర్‌లోనే ప్లాట్లు కేటాయిస్తామని ప్రభుత్వం ఆర్భాటంగా చెప్పింది. ఆ తరువాత సంక్రాంతికని పేర్కొంది. అదీ కాకపోయేసరికి మార్చిలో ఇస్తామని తెలిపింది. మరికొద్దిరోజుల తరువాత ఏప్రిల్, ఆ తరువాత మే నెలలో అని ప్రభుత్వ పెద్దలు చెప్పారు. ప్రస్తుతం జూన్ అన్నారు. ఈ నెలలోనూ పది రోజులు గడచిపోయాయి. అయినా ప్లాట్ల కేటాయింపులో స్పష్టత లేదు. ఈనెల చివరి నాటికి నోటిఫికేషన్ ఇస్తామని అధికారులు చెపుతున్నారు. అది కూడా తుళ్లూరు మండలం నేలపాడు గ్రామానికి సంబంధించిన రైతులకు మాత్రమే ప్లాట్లకు సంబంధించి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

 
కాగితాల్లోనే ప్లాట్లు

నేలపాడులో రైతులకు చూపెట్టబోయే ప్లాట్లు కాగితాల్లో మాత్రమే ఉంటాయి. క్షేత్రస్థాయిలో ఆ భూములు ఎక్కడొస్తాయనేది ఎవ్వరికీ తెలియదు. దగ్గరగా రావొచ్చు.. దూరంగా ఇవ్వొచ్చు. ఈ విషయాలపై స్పష్టత లేదని తెలుస్తోంది. ప్లాట్ల కేటాయింపు విషయంలో మొదట్లో అధికారులు జాయింట్ ప్లాట్ల విషయాన్ని తెరపైకి తెచ్చారు. దీంతో గందరగోళం నెలకొంది. దీంతో ప్లాట్ల కేటాయింపునకే బ్రేక్ పడింది. పెద్దల కోసం ఇలాంటి ప్రతిపాదనలు తెచ్చి ప్లాట్ల పంపిణీ మొత్తాన్ని గందరగోళంగా మార్చేశారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో అధికారులు ప్లాట్ల కేటాయింపులోఆప్షన్లను తెరపైకి తెచ్చారు. దీనిపై అధికారులు పదేపదే ఒత్తిడి తెచ్చినా రైతులు స్పందించకపోవటం గమనార్హం. రైతులిచ్చిన భూములను ప్రభుత్వం ఖాళీగా వదిలేసింది. నిబంధనల ప్రకారం అయితే రైతులు ఇచ్చిన భూములను చదును చేసి లేఅవుట్లు వేయాల్సి ఉంది. ఆ దిశగా ప్రయత్నించిన దాఖలాలు లేవు. భూములను చదును చేసే ప్రక్రియను కాంట్రాక్టర్లకు కట్టబెట్టినా ఫలితం కనిపించలేదు. చదును పనులు పూర్తయితే తప్ప లేఅవుట్లుగా మార్చి రైతులకిచ్చే పరిస్థితి లేదు.

 

అర్థంకాని ఆప్షన్లు...రైతుల్లో అయోమయం
ప్లాట్ల కేటాయింపు విషయంలో ప్రభుత్వం నాలుగు ఆప్షన్లు ప్రకటించినట్లు తెలిసింది. అందులో సుమారు 200 గజాలు ఇచ్చిన వారికి జీ+2, 200 నుంచి వెయ్యి గజాలలోపు వారికి జీ+3, వెయ్యి నుంచి రెండువేలలోపు గజాలు ఇచ్చిన వారికి జీ+7, 2 వేల నుంచి 5 వేల లోపు ఇచ్చిన వారికి జీ+11 అని ప్రకటించినట్లు తెలిసింది. వీటిలో ఏ ఆప్షన్లు తీసుకోవాలో రైతులకు అర్థంకాని పరిస్థితి నెలకొంది. ఒకవేళ ఏదో ఒక ఆప్షన్ తీసుకుంటే రాబోయే రోజుల్లో నష్టపోయే ప్రమాదం ఉందనే ఆలోచనతో రైతులు వెనకడుగు వేస్తున్నారు. ప్రభుత్వం రాజధాని ప్రాంతంలో శుక్రవారం నుంచి రిజిస్ట్రేషన్లు చేయరాదని ఆదేశాలిచ్చింది. 29 గ్రామాల పరిధిలో భూములకు సంబంధించి ఎటువంటి లావాదేవీలూ జరపరాదని రిజిస్ట్రేషన్ అధికారులకు గట్టిగా ఉత్తర్వులిచ్చింది. విషయం తెలుసుకున్న రైతులు ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యానికి రైతులను బలిపశువులను చేయటం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

Advertisement

తప్పక చదవండి

Advertisement