Sakshi News home page

ప్రత్యేక హోదాపై అవగాహన లేని సీఎం

Published Thu, May 5 2016 4:51 AM

ప్రత్యేక హోదాపై అవగాహన లేని సీఎం - Sakshi

వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జోగి రమేష్
 

విజయవాడ(భవానీపురం) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధికి కీలకమైన ప్రత్యేక హోదాపై అవగాహన లేని అసమర్ధ ముఖ్యమంత్రి చంద్రబాబని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జోగి రమేష్ ఒక ప్రకటనలో విమర్శించారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కోట్లాది రూపాయలతో కొనుగోలు చేయటంపై ఉన్న శ్రద్ధ ప్రత్యేక హోదాపై లేదని పేర్కొన్నారు. మాట్లాడితే ప్రత్యేక హోదాపై ప్రధానిని 20 సార్లు కలిశానని చెప్పుకొస్తున్న చంద్రబాబు సాధించింది మాత్రం శూన్యమని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సంజీవిని కాదని ఒకసారి, ప్రత్యేక హోదా సాధిస్తామని మరోసారి చెబుతూ ప్రజలను మాయ మాటలతో మోసం చేస్తున్నాడని ధ్వజమెత్తారు. కేంద్రంలోని భారతీయ జనతా పార్టీపై ఒత్తిడి తీసుకురావడం చేతగాని చంద్రబాబు, దమ్ముంటే టీడీపీ ఎంపీలతో రాజీనామా చేయించి బయటకు తీసుకురావాలని డిమాండ్ చేశారు.

నాడు పార్లమెంట్‌లో ఏపీకి 5 ఏళ్లు కాదు, 10 ఏళ్లపాటు ప్రతేక హోదా కావాలని అన్న కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, ప్రత్యేక హోదా తీసుకురావడం చేతగాని చంద్రబాబులు ఏ శిక్షకైనా అర్హులేనని పేర్కొన్నారు. ఇప్పటి వరకూ ప్రత్యేక హోదా తెస్తాం..అది ఆంధ్రుల హక్కని ప్రకటించిన చంద్రబాబు ఇప్పుడు హోదాపై పోరాటం వద్దు, ప్రస్తుత పరిస్ధితుల్లో పోరాటం చేయలేమని మంత్రివర్గ సమావేశంలో అనడం హాస్యాస్పదంగా ఉందని తెలిపారు.

కేంద్ర మంత్రివర్గం నుంచి టీడీపీ వారిని ఉపసంహరించుకోలేని చంద్రబాబు ప్రధానిపై ఎలా ఒత్తిడి తీసుకురాగలరని ప్రశ్నించారు .ప్రధానిని ఇప్పటికే 20 సార్లు కలిశానని చెబుతున్న చంద్రబాబు ఇంకా ఎన్నిసార్లు కలుస్తారని, ఎన్ని వినతి పత్రాలు, విజ్ఞప్తులు చేస్తారని ఎద్దేవా చేశారు. సంతలో పశువులను కొన్నట్లు ఎమ్మెల్యేలను కొనటం, పార్టీ ఫిరాయింపుదారులు, ఆయా నియోజకవర్గాలలోగల సీనియర్ టీడీపీ నాయకుల మధ్య పంచాయితీలతోనే కాలం వెళ్లబుచ్చుతున్న చంద్రబాబుకు ప్రత్యేక హోదా సాధనపై పోరాడేందుకు సమయం ఎక్కడిదని ప్రశ్నించారు. హోదాపై చిత్తశుద్ధి ఉంటే కేంద్రంతో తాడోపేడో తేల్చుకుని ప్రజలకు హోదా తీసుకురావాలని సూచించారు. 

 
 
 

Advertisement
Advertisement