ఫలించిన కల | Sakshi
Sakshi News home page

ఫలించిన కల

Published Thu, Jan 23 2014 4:25 AM

The deck area is the so-called evergreen decades

గద్వాల, న్యూస్‌లైన్: దశాబ్దాలుగా కరువుప్రాంతంగా పేరొందిన గట్టు ప్రాంతం ఇక సస్యశ్యామలం కానుంది.. చెరువులు, కుంటలకు జలకళ సంతరించుకోనుంది. ఈ ప్రాంతభూములకు కృష్ణానది జలాలను అందించే ఉద్దేశించిన గట్టు హైలెవల్ కెనాల్‌కు ప్రభుత్వం ఎట్టకేలకు పరిపాలన అనుమతులు ఇచ్చింది.
 
 ఇది పూర్తయితే నడిగడ్డలో ఎగువప్రాంత రైతులకు సాగునీరు అందడంతోపాటు, గ్రామాల్లో తాగునీటి సమస్య తీరనుంది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీఅయ్యాయి. ఇందుకోసం ప్రభుత్వం రూ.10.50కోట్లు విడుదలచేసింది. దశాబ్దాలుగా ప్రతిపాదనలో ఉన్న నెట్టెంపాడు ఎత్తిపోతల పథకానికి జలయజ్ఞంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మంజూరు ఇచ్చారు. టీడీపీ ప్రభుత్వం కుదించిన ఈ పథకాన్ని రెండులక్షల ఎకరాల ఆయకట్టుతో మంత్రి డీకే అరుణ అప్పట్లో వైఎస్‌కు వివరించి మంజూరు వచ్చేలా చేశారు. నెట్టెంపాడు నీళ్లందని గట్టు ఎగువప్రాంత కరువు నేలకు గట్టు హైలెవల్ కెనాల్ ద్వారా సాగు, తాగునీటిని అందించాలన్న ప్రతిపాదనను చేయగా.. తాజాగా మంజూరు ఇచ్చారు.
   
 ఎత్తిపోతల రూపకల్పన ఇలా..
 నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో రెండో పంప్‌హౌస్ వద్ద ఉన్న ర్యాలంపాడు రిజర్వాయర్‌కు పడమర వైపున ఆలూరు శివారులో రిజర్వాయర్ వద్ద ఇంటెక్ వెల్‌ను నిర్మిస్తారు. అక్కడ కేవలం 0.3 మెగావాట్‌ల విద్యుత్ వినియోగంతో నడిచే పంపింగ్ మోటారును ఏర్పాటు చేసి అక్కడి నుంచి గట్టు మండలలోని మల్లాపురం తండా పక్కన ఉన్న గజ్జెలమ్మగుట్టపైకి నీటిని పంపింగ్ చేస్తారు. అక్కడ భూతల భాండాగారం నిర్మిస్తారు. ఇందులోకి వచ్చిన నీటిని మూడు వైపులకు వెళ్లేవిధంగా చానల్స్‌ను ఏర్పాటు చేస్తారు. గుట్టపై నుంచి మండలంలోని చెరువులు, కుంటలకు నీళ్లు గ్రావిటిఫ్లో ద్వారా వెళ్లేలా కాల్వలను తవ్వుతారు. ఇలా దాదాపు 30 నుంచి 40 చెరువుల కుంటలను నీటితో నింపుతారు. వీటితో పాటు లిప్టు ద్వారా అదనంగా 3500 ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందిస్తారు.
 
 గట్టువాసులకు శుభవార్తే..!
 వర్షాభావ పరిస్థితులతో కరువు ప్రాంతంగా మారిన గట్టు ఎగువ ప్రాంతానికి సాగు, తాగునీటిని అందించేందుకు గట్టు  హైలెవల్ ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం మంజూరు ఇవ్వడం ఆ ప్రాంత ప్రజలకు శుభవార్తే. ప్రాజెక్టు సంబంధించిన సమగ్రసర్వేను నిర్వహించి పథకాన్ని చేపట్టేందుకు ఇక మార్గం సుగమమైంది.
 - ప్రకాష్, ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్
 

Advertisement
Advertisement