ఉలిక్కిపడిన నారాయణపురం | Sakshi
Sakshi News home page

ఉలిక్కిపడిన నారాయణపురం

Published Tue, Jan 27 2015 1:04 AM

ఉలిక్కిపడిన  నారాయణపురం - Sakshi

బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు
ఇద్దరు మృతితో గ్రామంలో విషాదం
తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరి పరిస్థితి విషమం
మిన్నంటిన బంధువుల రోదనలు

 
రాంబిల్లి: అప్పటి వరకు నిశ్శబ్దం.. భారీ పేలుడుతో  జనం బెంబేలు.. ఇళ్లల్లోంచి పరుగులు.. తునాతునకులైన రేకులషెడ్డు..శిథిలాల మధ్య యువకుని మృతదేహం.. కొంతదూరంలో క్షతగాత్రుల ఆర్తనాదాలతో హృదయవిదారక దృశ్యాలు..ఇలా రాంబిల్లి మండలం నారాయణపురం అనధికార తయారీ కేంద్రంలో బాణసంచా పేలుడుతో  సోమవారం ఉలిక్కిపడింది. ఇద్దరి మృతితో అంతటా విషాదం అలుముకుంది. శారదనది గట్టున ఆనుకుని ఉన్న స్థలంలో రేకులషెడ్డులో గ్రామానికి చెందిన భూపతి వెంకటరమణ అనధికారికంగా బాణసంచా తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడు. ఇదే విషయంలో గతేడాది అతడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అప్పటినుంచి బాణసంచా తయారీ నిలిపివేసిన వెంకటరమణ  మళ్లీ ప్రారంభించినట్టు గ్రామస్తులు తెలిపారు. సోమవారం ఉదయం సుమారు 11.30 గంటల ప్రాంతంలో వెంకటరమణ భోజనానికి ఇంటికి వెళ్లాడు. అరగంట తరువాత పేలుడు సంభవించింది. ఈ సమయంలో అతని కుమారులు నాగదుర్గ (24), శివకుమార్ (18), సోదరుడు పాండురంగ కుమారుడు జీవన్ (15), యర్రంశెట్టి గణేష్ (17) తయారీ కేంద్రంలో ఉన్నారు. పేలుడుకు రేకులషెడ్డు తునాతునకలైంది. శిథిలాల మధ్య శరీర భాగాలు తెగిపడి జీవన్ మృతి చెందాడు. మిగిలిన ముగ్గురూ సమీపానికి ఎగిరిపడి తీవ్రంగా గాయపడ్డారు.

సమాచారంమేరకు ఎస్‌ఐ కె. మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తొట్టి ఆటోల్లో బాధితులను యలమంచిలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం వారిని కేజీహెచ్‌కు తరలిస్తుండగా మార్గం మధ్యలో గణేష్ మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన శివకుమార్, నాగదుర్గ పరిస్థితీ విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. జీవన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం యలమంచిలి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ మల్లేశ్వరరావు తెలిపారు. గతేడాది బాణసంచా తయారీ కేంద్రం నిర్వాహకుడు వెంకటరమణపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినా అతనిలో మార్పురాలేదన్నారు. ఈ సంఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

 మిన్నంటిన ఆర్తనాదాలు:  సంఘటన స్థలంలో మృతులు, బంధువుల ఆర్తనాదాలు మిన్నంటాయి. పేద కుటుంబానికి చెందిన జీవన్ యలమంచిలిలో పదో తరగతి చదువుతున్నాడు. రిపబ్లిక్ డే కావడంతో పాఠశాలకు వెళ్లలేదు. బాణసంచా తయారీ కేంద్రానికి వెళ్లాడు. అక్కడ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు. అతని తల్లి, చెల్లి రోదన చూపరులను కంటతడి పెట్టించాయి.  
 
 
 
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement