వచ్చే ఎన్నికల తర్వాత కాంగ్రెస్ కనుమరుగు | Sakshi
Sakshi News home page

వచ్చే ఎన్నికల తర్వాత కాంగ్రెస్ కనుమరుగు

Published Mon, Dec 16 2013 1:01 AM

వచ్చే ఎన్నికల తర్వాత  కాంగ్రెస్ కనుమరుగు - Sakshi

=టీడీపీకి పుట్టగతులుండవ్!
 =వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను

 
సాక్షి, విజయవాడ : వచ్చే సార్వత్రిక ఎన్నికల తరువాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతుందని, తెలుగుదేశం పార్టీకి పుట్టగతులుండవని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను తెలిపారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని వాంబేకాలనీలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో సమైక్య శంఖారావం సభ ఆదివారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉదయభాను మాట్లాడుతూ తన కొడుకు కోసం సోనియాగాంధీ రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేయడాన్ని సీమాంధ్ర ప్రాంత వాసులే కాకుండా తెలంగాణలోని సమైక్యవాదులు కూడా వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీకి తగిన బుద్ధి చెబుతారని అన్నారు. చంద్రబాబునాయుడు సమన్యాయం అంటారు.. ఆయన పార్టీ నాయకులు సమైక్యవాదం అంటారు.. అంటూ ఎద్దేవా చేశారు.
 
టీడీపీ నేతలకు దమ్ముంటే...

సీమాంధ్ర ప్రాంతంలోని తెలుగుదేశం నేతలకు దమ్ముంటే చంద్రబాబు చేత సమైక్యాంధ్రకు అనుకూలంగా మాట్లాడించాలని సవాల్ విసిరారు. చంద్రబాబు కొబ్బరిచిప్పలు, ఇద్దరు కొడుకుల సిద్ధాంతం అంటూ ఏం మాట్లాడుతున్నారో ప్రజలకు అర్థం కావడం లేదని విమర్శించారు. చంద్రబాబు సమైక్యవాదం కోరుకుంటున్నారో... వేర్పాటువాదాన్ని కోరుకుంటున్నారో ఒక్క ముక్కలో చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ఐక్యత కోసం పోరాడుతుంటే యువకులు, వృద్ధులు అనే తేడా లేకుండా ఆయన అడుగులో అడుగువేస్తూ ధర్నాలు, రాస్తారాకోలు, నిరసన ప్రదర్శనలు చేస్తున్నారని గుర్తుచేశారు. రాష్ట్రం విడిపోతే కృష్ణా డెల్టాకు నీరు ఎలా వస్తుందని ఆందోళన చెందుతున్నారని చెప్పారు.
 
బీజేపీతో చంద్రబాబు చెట్టపట్టాలు...

సమావేశంలో పార్టీ నగర కన్వీనర్ జలీల్‌ఖాన్ మాట్లాడుతూ లగడపాటి విజయవాడ జోకర్ అయితే, చంద్రబాబు రాష్ట్రంలోనే పెద్ద జోకర్ అని పేర్కొన్నారు. పేకాటలో జోకర్ ఎక్కడైనా ఇమిడిపోయినట్లు చంద్రబాబు ఇప్పడు బీజేపీతో కలిసిపోయి చెట్టపట్టాలు వేసుకుని తిరిగేందుకు సిద్ధమౌతున్నారని విమర్శించారు. బీజేపీతో కలిసి పెద్ద తప్పు చేశానని చంద్రబాబు గతంలో చెప్పిన మాటలను మరిచిపోయారా అని ప్రశ్నించారు.
 
టీడీపీలో దొంగ సమైక్యవాదులు...

తెలుగుదేశంలో దొంగ సమైక్యవాదులు ఉన్నారని, ఆ పార్టీలో ఆరుగురు ఎంపీలు ఉంటే నలుగురు మాత్రమే అవిశ్వాస తీర్మానంపై స్వంతకం పెట్టారని జలీల్‌ఖాన్ ఎద్దేవా చేశారు. రాష్ట్ర విభజనను జగన్‌మోహన్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నందునే రాష్ట్ర ఐక్యత కోసం నేను పోరాడతా... మీరూ పోరాడండి అని పిలుపునిచ్చారన్నారు. ఆయన ఓటమి అంగీకరించరని, చంద్రబాబు లాగా రాజీ పడబోరని చెప్పారు. అందువల్లనే 16 నెలలు జైలులో ఉన్నా సోనియాతో పోరాడుతున్నారని కొనియాడారు.
 
ఆర్టికల్స్ మార్చకుండా విభజన కష్టం...

సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త గౌతంరెడ్డి మాట్లాడుతూ ఆర్టికల్ 371డీ, 371ఈ లను మార్చకుండా రాష్ట్ర విభజన చేయడం కష్టమన్నారు. ఆర్డికల్-3 ని కూడా మార్చాలని, రాష్ట్రంలో మూడు వంతుల మెజార్టీ ఉంటేనే విభజనకు అంగీకరించాలని జగన్‌మోహన్‌రెడ్డి డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష నేతల్ని కలుస్తున్నారని వివరించారు. కృష్ణానదిపై కర్ణాటక ప్రభుత్వం అనేక ప్రాజెక్టులు కడుతున్నా చంద్రబాబునాయుడు తన తొమ్మిదేళ్ల పాలనలో ఒక్క ప్రాజెక్టు కట్టలేదన్నారు. దీనివల్లనే ఇప్పుడు కృష్ణాడెల్టా ఎడారిగా మారే ప్రమాదం వచ్చిందన్నారు. మాజీ కార్పొరేటర్ జానారెడ్డి సభకు అధ్యక్షత వహించి మాట్లాడారు.
 

Advertisement
Advertisement