తాగునీటిపైనే దృష్టి | Sakshi
Sakshi News home page

తాగునీటిపైనే దృష్టి

Published Tue, May 26 2015 2:54 AM

The focus on drinking water

అనంతపురం సెంట్రల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు తాగునీటిని అందించడమే ప్రథమ కర్తవ్యంగా పనిచేస్తోందని రాష్ట్ర పౌరసంబందాలశాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి స్పష్టం చేశారు. సోమవారం జిల్లా పరిషత్ మీటింగ్‌హాలులో చెర్మైన్ చమన్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి రఘునాథరెడ్డి మాట్లాడుతూ... జిల్లాలో తాగునీటి ఎద్దడి నివారణకు రూ. 22.7 కోట్లు నిధులు విడుదల చేశామన్నారు. బోర్లు మరమ్మతులు, ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా, డీపెనింగ్ పనులు చేపడుతున్నట్లు వివరించారు.
 
 అలాగే శ్రీరామిరెడ్డి తాగునీటి, జేసీ నాగిరెడ్డి, హంద్రీనీవా ప్రాజెక్టును పూర్తి చేసి జిల్లాకు సాగు,తాగునీటిని అందించి సస్యశ్యామలంగా తీర్చిదిద్దుతామన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లాలో ఎండ తీవ్రత అధికంగా ఉందని, వడదెబ్బ బారిన పడి చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వడదెబ్బకు గురై చనిపోయిన వారికి రూ. లక్ష ఆర్థికసాయం అందజేయాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించిందన్నారు. తహశీల్దార్, ఎంపీడీఓ, ఎస్‌ఐ నేతృత్వంలో కమిటీ నిర్దారణ చేసిన తర్వాత ఎక్స్‌గ్రేషియా అందిస్తామన్నారు. జిల్లా పరిషత్‌కు సంబంధించి పెండింగ్‌లో ఉన్న నిధులను తీసుకురావడానికి చెర్మైన్‌తో కలిసి కృషి చేస్తానన్నారు.
 
 రైతు రుణాలను కొన్ని బ్యాంకులు రీషెడ్యూల్ చేయడం లేదని సభ్యులు ఫిర్యాదు చేయగా వడ్డీ కట్టించుకుని రుణాలను రెన్యువల్ చేయాలని ఎల్‌డీఎంను మంత్రి ఆదేశించారు. రానున్న ఖరీఫ్‌లో 3.25 లక్షల విత్తన వేరుశనగ అవసరమని, ప్రస్తుతానికి రూ. 18 వేల క్వింటాళ్లు సేకరించామని వ్యవసాయశాఖ జేడీ శ్రీరామమూర్తి వివరించారు. మంత్రి మాట్లాడుతూ... రానున్న జూన్2, 3 తేదీల్లో విత్తన పంపిణీ కార్యక్రమాన్ని చేపడతామని, ఆలోగా లక్ష క్వింటాళ్ల విత్తన వేరుశనగ సిద్దం చేసుకోవాలని ఆదేశించారు. నాణ ్యమైన విత్తనాలను సరఫరా చేయాలని, నాశిరకం విత్తనాలు వస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నీరు- చెట్టు కార్యక్రమంలో పూడికమట్టిని ప్రభుత్వ ఖర్చులతో రైతులు తమ పొలంలోకి తరలించుకోవచ్చునని, చిన్న, సన్న కారు రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అయితే సభ్యులు 3 కిలోమీటర్లకే పరిమితం చేశారని ఫిర్యాదు చేయడంతో ఇందులో మినహాయింపు ఇవ్వాలని ప్రతిపాదనలు పంపాలని అధికారులను మంత్రి ఆదేశించారు. జిల్లాకు వివిద పరిశ్రమలు వస్తున్నాయని తెలిపారు.
 
 బుక్కరాయసముద్రం మండలం రెడ్డిపల్లి వద్ద సెంట్రల్‌యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రభుత్వ అనుమతులు వచ్చాయని, త్వరలో ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారన్నారు.  కలెక్టర్ శశిధర్ మాట్లాడుతూ... జిల్లాలో లక్ష మరుగుదొడ్లు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. వేగవంతంగా మరుగుదొడ్లు పూర్తి చేసేందుకు ఆర్‌డీటీ సంస్థకు 34వేలు నిర్మించాలని కోరామన్నారు. మిగిలిన ఎన్‌జీఓల ద్వారా లక్ష సాధనకు మరుగుదొడ్లు నిర్మించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఉన్న వనరులను ఉపయోగించుకొని గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు.  
 
 తాగునీటి సమస్యలోనూ రాజకీయం: విశ్వ
 ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ...  ‘ఉరవకొండ నియోజకవర్గం జె.రాంపురం గ్రామంలో తాగునీటి ఎద్దడి నుంచి ప్రజలను కాపాడేందుకు బోరు వే యగా రాజకీయం చేసి అడ్డుకున్నారన్నారు. కలెక్టర్ ఆదేశాలను సైతం తహశీల్దార్ బేఖాతర్ చేస్తున్నాడని ఆరోపించారు. అలాగే బ్యాంకుల నుంచి రైతులకందే సాయంపై దృష్టి సారించాలని కోరారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అంటూ రుణాలు తీసుకునేందుకు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. హంద్రీనీవా సుజల స్రవంతి పథకాన్ని ఏడాదిలోగా పూర్తి చేస్తామని అంటున్నా ఆ దిశగా పనులు జరగలేదని స్పష్టం చేశారు. ఇప్పటి వరకూ కేవలం రూ.13 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, ఇలాగైతే ఎప్పటిలోగా ప్రాజెక్టును పూర్తి చేస్తారని ప్రశ్నించారు. వచ్చే ఏడాదికైనా జిల్లాలో 1.18 లక్షల ఆయకట్టుకు నీరివ్వాలని డిమాండ్ చేశారు.
 
 ఎమ్మెల్యేను అవమానిస్తున్నారు
 కదిరి నియోజకవర్గంలో ప్రొటోకాల్ పాటించడం లేదని ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నీరు-చెట్టు ప్రొగాం నియోజకవర్గంలో జరుగుతున్నా స్థానిక శాసనసభ్యునిగా తనకు కనీస ఆహ్వానం లేదని, ఇంతకన్నా దౌర్బాగ్యముంటుందా అని ప్రశ్నించారు. వెంటనే అధికారులతో ప్రొటోకాల్ విషయంపై సమీక్ష సమావేశం నిర్వహించాలని కలెక్టర్‌ను డిమాండ్ చేశారు. తాగునీటి ఎద్దడి నివారణకు తన కృషితో మంజూరైన రూ.42 లక్షలు ఎక్కడికిపోయాయో తెలియడం లేదన్నారు. నియోజకవర్గంలోని తాగునీటి ఇబ్బందులపై చర్చించాలని అధికారులు ఆహ్వానిస్తే సార్.. మీ దగ్గరుకు వస్తే మా ఉద్యోగాలు పోతాయి అని అంటున్నారు. నేనేమైనా ఉగ్రవాదినా? అసాంఘిక కార్యకలపాలు ఏమైనా చేస్తున్నానా? ప్రశ్నించారు.
 
 ఈ విషయంపై ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ కాంతానాథ్ మాట్లాడుతూ.. గతంలోనే పనులు మంజూరు చేయడం వలన ఎమ్మెల్యే సిఫారుస చేసిన పనులు చేపట్టలేకపోయామని సంజాయిషీ ఇచ్చారు. తాగునీటి ఎద్దడి నివారణకు నిధులున్నాయని, వెంటనే ఎమ్మెల్యే సిఫార్సు చేసిన గ్రామాల్లో తాగునీటి ఎద్దడి నివారణకు పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రొటోకాల్‌ను తూచతప్పకుండా పాటించాలని, లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులను మంత్రి హెచ్చరించారు. సమావేశంలో ప్రభుత్వ విప్ యామనిబాల, జెడ్పీ వైఎస్ చైర్మన్ సుబాషిణమ్మ, ఎమ్మెల్సీ గేయానంద్, జెడ్పీ సీఈఓ రామచంద్ర, జెడ్పీ ఫ్లోర్ లీడర్ వెన్నపూస రవీంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement