జూన్‌లో పునాది రాయి

5 Feb, 2015 02:01 IST|Sakshi
 • ఏపీ రాజధానికి జూన్ 11వతేదీ లేదా 12న శంకుస్థాపన
 • సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన రాజధాని నిర్మాణానికి జూన్ 11వ తేదీ లేదా 12వ తేదీన పునాది రాయి వేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భావిస్తున్నారు. జూన్ 11, 12వ తేదీలు దశమి, ఏకాదశి కావటంతో మంచి రోజులని జ్యోతిష్యులు సూచిం చడంతో ఈ ముహూర్తం మేరకు రెండింటిలో ఏదో ఒక రోజున రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు అధికారవర్గాలు తెలిపాయి.

  కృష్ణా నదిని ఆనుకుని వెంకటాయపాలెం, ఉద్దండరాయపాలెం, బోరుపాలెంలో పాలనా రాజధాని నిర్మాణం కానున్న నేపధ్యంలో శంకుస్థాపన కార్యక్రమం కూడా అక్కడే జరగవచ్చని సమాచారం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోపాటు సింగపూర్ ప్రధానమంత్రిని కూడా దీనికి ఆహ్వానించే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. సింగపూర్ కంపెనీలు ఈలోగా రాజధాని నిర్మాణంపై మాస్టర్ ప్లాన్‌ను అందచేస్తాయని తెలిసింది.
   
  కేంద్రానికి ప్రాథమిక నివేదిక సమర్పణ

  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, సచివాలయం, రాజ్‌భవన్, ఎమ్మెల్యే, మంత్రులు నివాస గృహాలు, హైకోర్టు, ఆసుపత్రులు, పాఠశాలలు, మంచినీటి సరఫరా, రహదారుల నిర్మాణాలకు ప్రాథమికంగా రూ.20 వేల కోట్ల ఆర్థిక సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రాజెక్టు నివేదికను సమర్పించింది. కేంద్రం సూచనల మేరకు దీన్ని అందచేసింది.
   
  సీఎం తాత్కాలిక సచివాలయానికి రూ.90 కోట్లు

  రాజధాని నిర్మాణానికి 20,500 ఎకరాలు అవసరమని రాష్ట్ర ప్రభుత్వం వాస్తవికత నివేదికను రూపొందించింది. భూమిని సేకరించేందుకు, పునరావాసం అమలుకు ఎకరానికి రూ.కోటి వంతున వ్యయమవుతుందని అంచనా వేసిం ది. ఈ లెక్కన రూ.20,500 కోట్లు ఆర్థిక సాయం కావాలని కేంద్రానికి నివేదిక పంపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మాస్టర్ ప్రణాళిక, సవివరమైన ప్రాజెక్టు నివేదిక తయారీ, కన్సల్టెన్సీ చార్జీల కింద రూ.500 కోట్లు వ్యయం అవుతుందని ప్రభుత్వం నివేదిక రూపొందించింది.  ముఖ్యమంత్రి తాత్కాలిక సచివాలయం నిర్మాణానికి 14 ఎకరాల స్థలం అవసరమని, దీనికి రూ.90 కోట్లు వ్యయం అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం నివేదికలో పేర్కొంది. 655 ఎకరాల్లో నిర్మించే పరిపాలనా రాజధాని నిర్మాణానికి రూ.8,962.17 కోట్లు అవసరమని అంచనాలు రూపొందించింది.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు