రాజ్యాంగ పరిరక్షణే ధ్యేయం | Sakshi
Sakshi News home page

రాజ్యాంగ పరిరక్షణే ధ్యేయం

Published Wed, Nov 25 2015 1:06 AM

The goal is to protect the Constitution

వైఎస్సార్ సీపీ జిల్లా ఇన్‌చార్జి బొత్స సత్యనారాయణ
 
 రాజ్యాంగ పరిరక్షణే వైఎస్సార్ సీపీ ధ్యేయమని ఆ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని ఓ పండగలా నిర్వహించాలని పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వివరించారని పేర్కొన్నారు. గుంటూరులో మంగళవారం పార్టీ నగర విసృ్తత స్థాయి, ఎస్సీ సెల్ జిల్లా స్థాయి సమావేశాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి, నేతలు అంబటి, మేరుగ, ఎమ్మెల్యే గోపిరెడ్డి, సాయిబాబు, అన్నాబత్తుని, అప్పిరెడ్డి, రావి, క్రిస్టినా తదితరులు పాల్గొన్నారు.
 
 పట్నంబజారు (గుంటూరు) : రాజ్యాంగ పరిరక్షణే వైఎస్సార్ సీపీ ధ్యేయమని ఆ పార్టీ గుంటూరు జిల్లా ఇన్‌చార్జి, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించే పాలకుల దుశ్చర్యలను ఎంత మాత్రం సహించబోమని హెచ్చరించారు. పాలకులకు గుణపాఠం చెప్పే రీతిలో రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని ఒక పండుగలా నిర్వహించాలని పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించినట్లు వివరించారు. అరండల్‌పేటలోని పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం నగర విస్తృత స్థాయి సమావేశం నగర అధ్యక్షుడు లేళ్ళ అప్పిరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర పాలకులు రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని ధ్వజమెత్తారు. అణగారిన వర్గాల సంక్షేమానికి ఉపకరించే రాజ్యాంగ ఆదేశిక సూత్రాలను అటకెక్కిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రాజ్యాంగ పరిరక్షణకు బాధ్యత గల ప్రతిపక్షంగా వైఎస్సార్ సీపీ నడుం బిగించిందన్నారు. దీన్ని జయప్రదం చేసేందుకు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, అభిమానులు తరలిరావాలని పిలుపునిచ్చారు.
 రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి.

పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడుతూ భారతీయులందరికీ రాజ్యాంగం పవిత్ర గ్రంథమని, దాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కుల, మత, పార్టీలకతీతంగా రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున మాట్లాడుతూ రాజ్యాంగం ద్వారా అణగారిన వర్గాలు, బడుగు, బలహీనులకు న్యాయంగా దక్కాల్సిన ఫలాలు అందడం లేదని ఆరోపించారు. పాలకులు తమకిష్టమొచ్చిన రీతిలో సవరణలు చేస్తూ చివరకు దాని స్ఫూర్తికి మచ్చ తెచ్చే రీతిలో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

ఇదే సరైన సమయం..
పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ రాజ్యాంగ ఆమోద దినోత్సవం నిర్వహించడానికి ఇది సరైన సమయం అని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలోనైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కళ్ళు తెరవాలని ఆయన హితవు పలికారు. పార్టీ నగర అధ్యక్షుడు లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలోని చాలా దేశాలకు మన రాజ్యాంగమే దిక్సూచిగా నిలిచిందన్నారు. అంతటి మహత్తరమైన రాజ్యాంగాన్ని అపహాస్యం పాలు చేసే పాలకుల కళ్ళు తెరిపించేలా, వారి గుండెలదిరేలా 26న జరిగే భారీ ప్రదర్శనను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే షేక్ మొహమ్మద్ ముస్తఫా మాట్లాడుతూ ఏ పాలకులైనా రాజ్యాంగానికి లోబడి పాలించాలని, అయితే దురదృష్టవశాత్తు ప్రస్తుత పాలకులు ఆ సంప్రదాయానికి తిలోదకాలు వదిలారని విమర్శించారు.
 
కార్యక్రమంలో...
 వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు,  తాడికొండ  నియోజకవర్గ సమన్వకర్త కత్తెర హెనీక్రిస్టినా, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు మామిడి రాము, నూనె ఉమామహేశ్వరరెడ్డి, ప్రేమ్‌కుమార్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి షేక్ గులాం రసూల్, నగర అధ్యక్షుడు ఎలికా శ్రీకాంత్ యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి అంగడి శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షుడు కావటి మనోహర్‌నాయుడు, లీగల్ విభాగం జిల్లా అధ్యక్షుడు పోలూరి వెంకటరెడ్డి, ఎస్సీ విభాగం నగర అధ్యక్షుడు దాసరి కిరణ్, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పానుగంటి చైతన్య తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement